'2018' - మూవీ రివ్యూ

Movie Name: 2018

Release Date: 2023-05-26
Cast: Tovino Thomas, Kunchacko Boban, Asif Ali, Vineeth Sreenivasan, Lal, Narain, Aparna Balamurali ,Tanvi Ram
Director: Jude Anthany Joseph
Producer: Venu Kunnappilly
Music: Nobin Paul
Banner: Kavya Film Company
Rating: 3.50 out of 5
  • ఈ నెల 5న మలయాళంలో విడుదలైన '2018'
  • కేరళ వరదల నేపథ్యంలో నడిచే కథ 
  • అక్కడ భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సినిమా
  •  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ... ఫొటోగ్రఫీ హైలైట్
  • ఎమోషన్స్ పరంగా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు    

సునామీ నేపథ్యంలో .. తుపాన్  నేపథ్యంలో వెండితెరపైకి చాలా కథలు వచ్చాయి. ఈ తరహా కథలు హాలీవుడ్ లో ఎక్కువగా తెరపైకి వస్తుంటాయి. అవి ఇక్కడి ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటాయి. అందుకు కారణం అక్కడ అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమని చెప్పచ్చు. అలాంటి ఒక కంటెంట్ తో ఇక్కడ సినిమా తీయడమంటే అది ఒక సాహసమనే చెప్పాలి. మలయాళంలో '2018' సినిమాతో  అలాంటి సాహసం చేసిన దర్శకుడిగా జూడ్ ఆంథోని జోసెఫ్ కనిపిస్తాడు.

టోవినో థామస్ .. కుంచాకో బోబన్ .. నరేన్ .. కలై అరసన్ .. వినీత్ శ్రీనివాసన్ .. అపర్ణ బాలమురళి .. తన్వీ రామ్ .. లాల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, వేణు కున్నప్పిలి నిర్మించాడు. సాధారణంగా ఒక వాన పాటను చిత్రీకరించడానికే ఎంతో కష్టపడవలసి ఉంటుంది. అలాంటిది సినిమాలో చాలా వరకూ అలా వర్షం కురుస్తూనే ఉంటుంది. వరదలో ఈ కథ నడుస్తూనే ఉంటుంది. ఇంత కష్టమైన కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన విడుదలై, మలయాళంలో మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక ఈ రోజునే ఇక్కడ విడుదలైన ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

ఈ కథ కేరళ ప్రాంతంలో మొదలవుతుంది .. అక్కడి నేపథ్యంతోనే నడుస్తుంది. అనూప్ (టోవినో థామస్) సినిమాలు చూసి ఆర్మీలో చేరతాడు. తాను ఊహించుకున్నట్టుగా అక్కడ లేకపోవడంతో వెనక్కి వచ్చేస్తాడు. అదే గ్రామానికి టీచర్ గా వచ్చిన మంజు (తన్వీ రామ్)ప్రేమలో పడతాడు. నూరా (అపర్ణ బాలమురళి) ఒక టీవీ చానల్లో ... షాజీ (కుంచాకో బోబన్) మరో టీవీ చానల్లో రిపోర్ట్సర్ గా పనిచేస్తుంటారు. 

ఇక అదే ప్రాంతానికి చెందిన మత్స్యకారులు (లాల్ - నరేన్) సముద్రంలో వేటకి వెళతారు. ఒక లారీ డ్రైవర్ ... మరొక టాక్సీ డ్రైవర్ .. తమ పనులపై వేరే ప్రాంతాలకి వెళతారు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి విదేశాల నుంచి ఒక కొడుకు ఆ గ్రామానికి బయల్దేరతాడు. ఇలా ఎవరు ఏ పని చేస్తున్నా అది వాళ్ల ఫ్యామిలీ కోసమే. అందరూ కూడా ఎమోషన్స్ పరంగా తమ ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ ప్రాంతంలో తుపాను హెచ్చరికలు జారీ చేస్తారు. సమీపంలోని అతి పెద్ద డామ్ గేట్లను 20 ఏళ్ల తరువాత ఎత్తుతున్నట్టుగా ప్రకటిస్తారు. దాంతో అందరిలో టెన్షన్ మొదలవుతుంది. నెమ్మదిగా మొదలైన వాన ఊపందుకుంటుంది. డామ్ గేట్లకు పెద్ద చెట్టు అడ్డుపడటంతో, డామ్ పక్కనుంచి నీరు ఊహించని విధంగా ఆ ఊరిపై ఎలా విరుచుకుపడుతుంది? అప్పుడు అనూప్ ఏం చేస్తాడు? నిస్సహాయులను ఆయన ఎలా ఆదుకుంటాడు? అనేదే కథ. 

వరదల నేపథ్యంలో ఆంటోని జోసెఫ్ ఈ కథను అల్లుకున్న తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. కొన్ని కుటుంబాలను ప్రధానంగా తీసుకుని, వరదలు సంభవించినప్పుడు తమవారు ఎక్కడ చిక్కుపడ్డారోననే ఆందోళన .. తమ పరిస్థితి ఏమవుతుందోననే భయం .. తాము ఉన్న చోటుకి వారు చేరుకుంటారా లేదా అనే ఆదుర్దాను ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఊరంతా జలమయం కావడం .. ఇళ్లలోకి వరద నీరు రావడం ఎంతో సహజంగా చూపించాడు. 

2018లో కేరళలో వచ్చిన వరదల తాలూకు ఫొటోస్ ను .. టీవీలో న్యూస్ సమయంలో కొన్ని విజువల్స్ ను వాడారు. ఈ సినిమాలో వరదలు చూపించారా? లేదంటే వరదల్లోనే షూటింగ్ చేశారా? అనేంత సహజంగా చిత్రీకరించారు. కథాకథనాల తరువాత స్థానం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి దక్కుతుంది. వర్షం .. ఉరుములు .. మెరుపుల ఎఫెక్ట్ ను నోబిన్ పాల్ గొప్పగా ఆవిష్కరించాడు. థియేటర్స్ లో వర్షం పడుతుందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. 

ఇక అఖిల్ జార్జ్ కెమెరా పనితనాన్ని అభినందించకుండా ఉండలేం. కంటిన్యూగా వర్షం .. వరదల తాలూకు చిత్రీకరణ ఏ వైపు నుంచి .. ఏ యాంగిల్ లో ప్రేక్షకుల ముందుంచాలనేది ఒక సవాల్. అలాంటిది ఆయన అందించిన విజువల్స్ వలన వరదల్లో మనం ఉన్నామనే ఒక భ్రమ కలుగుతుంది. ఇక చమన్ చక్కో ఎడిటింగ్ కి వంక బెట్టవలసిన పనిలేదు. ఏ సీన్ కూడా అనవసరం అనిపించదు. 

సముద్రంలో జాలరులు చిక్కుబడటం .. నిండుచూలాలను హెలికాఫ్టర్ లో తరలించడం .. అంధుడిని వరదల్లో నుంచి కాపాడటం .. ఇంట్లో నుంచి బయటికి రాలేక చిక్కుబడిపోయిన మానసిక వికలాంగుడి ఫ్యామిలీని రక్షించడం .. తోటివారిని రక్షించడానికి జాలరులు తమ బోట్లతో రంగంలోకి దిగడం వంటి ఎపిసోడ్స్ ఈ సినిమాలో హైలైట్ గా నిలిచాయి. ఇక ఇందులో స్టార్స్ ఉన్నప్పటికీ, తెరపై పాత్రలే కనిపిస్తాయి. ఆర్టిస్టులు కాకుండా ఊళ్లోని సాధారణ జనాలే తెరపై కనిపిస్తారు.

సినిమా థియేటర్లో నుంచి బయటికి వచ్చాక, బయట వాతావరణం చూసి హమ్మయ్య తుపాను వెలిసింది అనుకుంటాం .. అంతగా ప్రేక్షకులను ప్రభావితం చేసే సినిమా ఇది. హీరో ... హీరోయిన్ .. పాటలు .. కామెడీ .. రొమాన్స్ .. ఇలాంటివేమీ ఆశించకుండా వెళ్లేవారికి, కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. 

ప్లస్ పాయింట్స్: కథాకథనాలు .. టేకింగ్ ..  పాత్రలను సహజంగా తీర్చిదిద్దిన తీరు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా పనితనం .. ఎమోషన్స్. 

మైనస్ పాయింట్స్ : కొన్ని పాత్రల పేర్లను సరిగ్గా రిజిస్టర్ చేయకపోవడం .. కుంచాకో బోబన్ - అపర్ణ బాలమురళి పాత్రల నిడివి తక్కువగా ఉండటం

Trailer

More Movie Reviews