'బ్రోమాన్స్' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

  • మలయాళంలో రూపొందిన 'బ్రోమాన్స్'
  • ఫిబ్రవరిలో థియేటర్స్ కి వచ్చిన సినిమా 
  • నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్  
  • అడ్వెంచర్ కామెడీ జోనర్లో నడిచే కథ 
  • సరదాగా సాగిపోయే సన్నివేశాలు 

మలయాళంలో అడ్వెంచర్ కామెడీ జోనర్ నుంచి వచ్చిన సినిమానే 'బ్రోమాన్స్'. అరుణ్ డి. జొస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాథ్యూ థామస్ .. అర్జున్ అశోకన్ .. మహిమ నంబియార్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. 13 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'సోనీలివ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథపై ఒక లుక్కేద్దాం. 

కథ: షింటో (శ్యామ్ మోహన్) బింటో ( మాథ్యూ థామస్) అన్నదమ్ములు. షింటో కొచ్చిలో ఉంటూ ఉంటాడు. అతనికి ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. బింటో డిగ్రీ పూర్తిచేసి, ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఒక రోజున కొచ్చి నుంచి షింటో ఫ్రెండ్ షబ్బీర్ అలీ (అర్జున్ అశోకన్) కాల్ చేస్తాడు. షింటో కి ఐశ్వర్యతో బ్రేకప్ జరిగిందనీ, అప్పటి నుంచి అతను కనిపించడం లేదని చెబుతాడు. దాంతో బింటో నేరుగా ఐశ్వర్య ( మహిమ నంబియార్) దగ్గరికి వెళ్లి నిలదీస్తాడు. 

షింటో బ్రేకప్ చేసుకున్న ఐశ్వర్య వేరే ఉండొచ్చనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేస్తుంది. ఆ సమయంలోనే కొరియర్ బాబు నుంచి షింటో కి ఎక్కువ కాల్స్ వచ్చినట్టు గమనించి అతనిని కలుస్తారు. షింటో తనకి 15 లక్షలు ఇవ్వాల్సి ఉందనీ, అయితే అతను కనిపించకుండా పోవడం వెనుక తన ప్రమేయం లేదని చెబుతాడు. అందరూ కలిసి పోలీస్ ఆఫీసర్ 'టోనీ'ని కలిసి జరిగిందంతా చెబుతారు. 

షింటో 'కూర్గ్'లో ఉన్నాడనే జాడ తెలుకుని పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో, వాళ్లంతా అక్కడికి బయల్దేరతారు. షింటోతో బ్రేకప్ చేసుకున్న ఐశ్వర్య కూర్గ్ లో ఉంటుందని తెలుసుకుని ఆమె ఇంటికి వెళతారు. అక్కడ ఆమె పెళ్లికి సంబంధించిన ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. వాళ్లది కాస్త తేడా ఫ్యామిలీ అనే విషయం వీళ్లకి అర్థమైపోతుంది. షింటో కనిపించకుండా పోవడానికి కారణం, ఐశ్వర్య బ్రదర్ ఆశిష్ (భరత్ బోపన్న) అని తెలుసుకుంటారు. షింటో ఆచూకీ తెలుసుకోవడానికి వాళ్లు ఏం చేస్తారు? ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తారు? ఎలా బయటపడతారు? అనేది కథ. 

విశ్లేషణ: ఒక అన్నయ్య కనిపించకుండా పోవడంతో, అతని ఆచూకీ తెలుసుకోవడం ఓ తమ్ముడు చేసే ప్రయత్నమే ఈ సినిమా. అన్నయ్య ఆచూకీ తెలుసుకోవడంలో అతని మాజీ లవర్ .. స్నేహితుడు .. ఆ అన్నయ్యకి అప్పు ఇచ్చినవాడు .. ఒక హ్యాకర్ ను తోడుగా తీసుకుని ఆ తమ్ముడు చేసే అన్వేషణ ఇది. ఈ టీమ్ చేసే జర్నీతో సరదాగా .. సందడిగా ఈ కథ కొనసాగుతుంది. 

కథలో కొంతదూరం వెళ్లిన తరువాత, ఆశిష్ అనే ఒక తేడా కేరక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అప్పటి నుంచి కథ మరింత పుంజుకుంటుంది. కామెడీ టచ్ ఏ మాత్రం తగ్గకుండానే, తరువాత ఏం జరుగుతుందా అనే ఒక కుతూహలం పెరుగుతూ ఉంటుంది. నిజానికి ఈ కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. కానీ కథను బోర్ కొట్టించకుండా నడిపించిన తీరు నచ్చుతుంది. ఒక సింపుల్ లైన్ ను కామెడీ టచ్ తో ఇంట్రెస్టింగ్ గా చెప్పారని అనిపిస్తుంది. 

పనితీరు: దర్శకుడు పెద్దగా బడ్జెట్ అవసరం లేని విధంగా ఈ కథను డిజైన్ చేసుకున్నాడు. ఎనిమిది పాత్రలను ప్రధానంగా తీసుకుని వాటి చుట్టూనే కథను తిప్పాడు. మిగతా పాత్రలు ఉన్నప్పటికీ అవి సందర్భాన్ని బట్టి నామమాత్రంగా కనిపించేవే. ఒక్కో పాత్రలో ఉన్న ఒక్కో బలహీనతను లైట్ గా టచ్ చేస్తూ, ఆ పాత్రల ద్వారా కామెడీని రాబట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

అఖిల్ జార్జ్ ఫొటోగ్రఫీ బాగుంది. కామెడీ టచ్ తో కూడిన ఈ కంటెంట్ ను గోవింద్ వసంత నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. చమన్ చాకో ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. ఆర్టిస్టులంతా కూడా పాత్ర పరిధిలో మెప్పించారు. 

ముగింపు: ఇది కొత్తకథేం కాదు .. కానీ కథనాన్ని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. మొదటి నుంచి చివరివరకూ సందడిగా కొనసాగుతుంది. కడుపుబ్బా నవ్వించే ప్రయత్నమేమీ చేయలేదు. చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకునేలా ఉంటుందంతే. 

Movie Name: Bromance

Release Date: 2025-05-01
Cast: Mathew Thomas, Arjun shokan, Mahima Nambiar, Sangeeth Prathap, Bharath Bopanna
Director: Arun D Jose
Producer: Ashiq Usman
Music: Govind Vasantha
Banner: Ashiq Usman Productions
Review By: Peddinti

Bromance Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews