'కుల్ : ది లెగసీ ఆఫ్ ది రైసింగ్స్' ( జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

  • హిందీలో రూపొందిన సిరీస్ గా 'కుల్'
  • 8 ఎపిసోడ్స్ గా మొదలైన స్ట్రీమింగ్ 
  • రాజకుటుంబంలోని రాజకీయాలే కథ 
  • ఖర్చు పరంగా .. విజువల్స్ పరంగా మంచి మార్కులు 
  • కథాకథనాల విషయంలో తగ్గిన కసరత్తు        
            

'కుల్ : ది లెగసీ ఆఫ్ ది రైసింగ్స్' .. హిందీలో రూపొందిన ఒక భారీ వెబ్ సిరీస్. ఏక్తా కపూర్ - శోభా కపూర్ సృష్టించిన ఈ సిరీస్ కి, సాహిర్ రజా దర్శకత్వం వహించాడు. ఫస్టు సీజన్ ను 8 ఎపిసోడ్స్ గా  మే 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు. 7 భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో రూపొందించిన ఈ సిరీస్ కథేమిటనేది ఒకసారి పరిశీలన చేద్దాం. 

కథ: అది ఒకప్పుడు వైభవంతో వెలిగిన ఓ ప్యాలెస్. ఇప్పుడు అది సమర్థులైన వారసులు లేక వెలవెలబోతూ ఉంటుంది. రాజా చంద్రప్రతాప్ (రాహుల్ వోహ్రా) తన కుటుంబంతో కలిసి అక్కడ నివసిస్తూ ఉంటాడు. ఆయన పెద్ద కూతురు ఇంద్రాణి (నిమ్రత్ కౌర్) చిన్న కూతురు కావ్య (రిధి డోగ్రా) కొడుకు అభిమన్యు (అమోల్ పరాశర్). ఇక వీళ్ళందరికీ కంటే పెద్దవాడైన బ్రిజ్ (గౌరవ్ అరోరా)ను రాజావారు తన పెద్ద కొడుకుగా భావిస్తూ ఉంటాడు. అయితే అతను అక్రమ సంతానం కావడం వలన, మిగతా వారసులు చులకనగా చూస్తుంటారు. 

రాజావారి వారసుల అందరి దృష్టి ఇప్పుడు ఆ ప్యాలెస్ ను అమ్మేయడంపై ఉంటుంది. అందుకు సంబంధించిన  బేరసారాలు జరుగుతూ ఉంటాయి. ప్యాలెస్ ను అమ్మేయడం రాజావారికి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. కానీ ఆయన మాటను పట్టించుకునే వారు ఉండరు. ఇంద్రాణి .. ఆమె భర్త విక్రమ్ రాజకీయాలలో తమ ప్రభావం చూపించడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. తన అవసరాల కోసం కావ్య .. తన విలాసాల గురించి అభిమన్యు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎలాంటి వాటా లేకుండా 'బ్రిజ్'ను బయటికి పంపించాలనేది అభిమన్యు ప్లాన్. 

ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకరోజున తెల్లవారేసరికి రాజావారు హత్య చేయబడతాడు. ఆయన మెడపై బలమైన గాయం చూసి అంతా షాక్ అవుతారు. ఈ విషయం బయటికి రాకుండా అంత్యక్రియలు జరిపించాలని చూస్తారు. కానీ అందుకు సీబీఐ ఆఫీసర్ శరత్ (అంకిత్ ) అడ్డుపడతాడు. నేరస్థులు ఎవరనేది తేలవలసిందేనంటూ, తనదైన స్టైల్లో రంగంలోకి దిగుతాడు. రాజావారిని ఎవరు హత్య చేస్తారు? రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఇంద్రాణి కోరిక నెరవేరుతుందా? తానే వారసుడిగా కొనసాగాలనే అభిమన్యు 'కల' నిజమవుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: 'కుల్' అంటే కుటుంబం .. లేదా వంశం అనే అర్థాలు కనిపిస్తాయి. అలా ఒక రాజకుటుంబం చుట్టూ తిరిగే కథ ఇది. 'రెక్కలు తెగిన రాబందువు పిట్టపిల్లకు లోకువ' అనే ఒక సామెత మాదిరిగా, వయసైపోయిన రాజావారంటే ఎవరికి మాత్రం భయం ఉంటుంది. ఆయన ఆదేశాలు .. ఆవేశాలను ఎవరు పట్టించుకుంటారు? అలాంటి రాజావారి అధికారం కోసం .. ఆయన ఆస్తుల కోసం పోరాడే వారసుల కథ ఇది. 
    
ప్రధానమైన కథ అంతా కూడా ప్యాలెస్ లోనే జరుగుతూ ఉంటుంది .. ప్యాలెస్ గురించే నడుస్తూ ఉంటుంది. ప్యాలెస్ లోని మనుషుల మధ్య కోపాలు .. పగలు .. ద్వేషాల మధ్య సన్నివేశాలు పరిగెడుతూ ఉంటాయి. ప్యాలెస్ లోని వ్యక్తుల స్వార్థం .. వ్యామోహం .. అక్రమ సంబంధాలను టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. కథలో ప్రధానమైన పాత్ర ప్యాలెస్ దేనని చెప్పాలి. ఈ కథ కోసం ఎంచుకున్న ప్యాలెస్ ఈ సిరీస్ కి హైలైట్ అని చెప్పుకోవాలి. 

రాజకుటుంబాలు .. రహస్యాలు .. బలాలు .. బలహీనతలకు సంబంధించిన కథలను చూడటం ఆసక్తికరంగానే ఉంటుంది. గతంలో ఇలాంటి కథలు వచ్చాయి గదా అని కొత్తగా వచ్చిన వాటిని చూడకుండా వదిలేయలేము. అలా ఈ సిరీస్ పట్ల కూడా కుతూహలాన్ని కనబరచడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాజకుటుంబంలో రహస్యాలు తక్కువ .. సృష్టించే రణరంగం ఎక్కువ అనే చెప్పాలి.   
  
పనితీరు: ఈ కథా పరిధి చాలా పెద్దది. ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన చాలా పాత్రలు కలిసి ఇక్కడ పరిగెడుతూ ఉంటాయి. దర్శకుడు రాజరికాన్ని .. అందుకు తగినట్టుగా రాజకుటుంబీకులను చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కాకపోతే ఆ పాత్రలను ఆశించిన స్థాయిలో డిజైన్ చేయలేదు. ఎవరి పాత్రలోను ప్రేక్షకుడు ఆశించే పవర్ కనిపించదు. రాజకుటుంబాలలో కనిపించే ఎత్తులు పైయ్యెత్తులు ఈ కథలో మిస్సయ్యాయి.  

ప్యాలెస్ .. రాచరిక సంబంధమైన నేపథ్యం విజువల్స్ పరంగా మెప్పిస్తాయి. కానీ ఆ ప్యాలెస్ లో  జరిగే సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే చాలా సాదాసీదాగా సాగుతుంది. ఎలాంటి ట్విస్టులు లేకుండా .. ఎలాంటి ఎమోషన్స్ కనెక్ట్ చేయలేక నిదానంగా .. నింపాదిగా .. చప్పగా ఈ సిరీస్ కొనసాగుతూ ఉంటుంది. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.

ముగింపు: ఇది ఒక రాజకుటుంబానికి సంబంధించిన ప్యాలెస్ లో జరిగే పోరాటం .. ప్యాలెస్ కోసం జరిగే పోరాటం. కథ ఎప్పుడైతే రాజకీయాల వైపు టర్న్ తీసుకుంటుందో, అక్కడి నుంచే గ్రాఫ్ తగ్గడం మొదలవుతుంది. ఇంద్రాణి .. అభిమన్యు .. బ్రిజ్ పాత్రలను బలంగా డిజైన్ చేసుకుని ఉంటే, ఈ సిరీస్ వేరేలా ఉండేది. ఖర్చు పరంగా .. విజువల్స్ పరంగా ఈ సిరీస్ కి వంకబెట్టవలసిన అవసరం లేదు. ఎటొచ్చి కథాకథనాలలోని బలహీనతనే అసంతృప్తిని కలిగిస్తుంది.

Movie Name: Kull: The Legacy Of The Raisingghs

Release Date: 2025-05-02
Cast: Nimrat Kaur, Ridhi Dogra, Gaurav Arora, Amol Parashar, Ankith,
Director: Sahir Raza
Producer: Baljith Chadda- Gagan Anand
Music: -
Banner: Balaji
Review By: Peddinti

Kull: The Legacy Of The Raisingghs Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews