'షష్టిపూర్తి' సినిమా రివ్యూ

  • రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో 'షష్టిపూర్తి'  
  • స్లోగా సాగిన కథ, కథనాలు 
  • ఇళయరాజా సంగీతమే ప్రధాన బలం
సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఒకవైపు స్టార్‌ హీరోల చిత్రాల్లో నటిస్తూనే మరో వైపు కొత్త తారలు నటించిన చిత్రాల్లో కూడా ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నాడు. ఆ కోవలోనే ఆయన ముఖ్యపాత్రలో  నటించిన చిత్రం 'షష్టిపూర్తి'. రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పవన్‌ ప్రభ దర్శకుడు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.  కుటుంబ కథా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనేది తెలుసుకుందాం.. 

కథ: చిన్నప్పటి నుంచి నీతి, నిజాయితీ, అబద్దం ఆడకపోవడం వంటి మంచి అలవాట్లతో పెరిగిన శ్రీరామ్‌, తల్లిదండ్రులైన  దివాకర్‌ (రాజేంద్రప్రసాద్‌), భువన (అర్చన)లకు  దూరంగా ఉంటూ (రూపేష్‌) ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తుంటాడు. అలాంటి రూపేష్‌ జీవితంలోకి జానకి (ఆకాంక్ష సింగ్‌) ప్రవేశిస్తుంది. ఆ ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే ప్రియురాలి మాట కోసం శ్రీరామ్‌ ఏం చేశాడు? 

నిజాయితీగా ఉండే శ్రీరామ్‌ లక్షలు ఎలా సంపాందించాడు? ఆయనలో మార్పుకు గల కారణాలు ఏమిటి?  గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుకోని తల్లిదండ్రుల కోసం షష్టిపూర్తి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ క్రమంలో జరిగిన అనూహ్య సంఘటనలేమిటి? రాజేంద్ర ప్రసాద్, అర్చనలు మాట్లాడుకోక పోవడానికి కారణం ఏమిటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఇది కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కానీ ఓ సింపుల్‌ విషయాన్ని ఓ లవ్‌స్టోరికి  లింక్‌ చేస్తూ దర్శకుడు భావోద్వేగ సన్నివేశాలతో చెప్పాలనుకున్న ప్రయత్నం కనిపించింది. నేడు సమాజంలో కనుమరుగవతున్న కుటుంబ బంధాలను, తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న అంతరాలను ఆధారం చేసుకుని దర్శకుడు ఈ కథను తయారుచేసుకున్నాడు. అయితే దర్శకుడు కథకు తగిన విధంగా బలమైన,ఎమోషన్‌ సన్నివేశాలను రాసుకోవడంలో తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేలో కూడా లోపం కనిపిస్తుంది. 

ఇలాంటి  సున్నితమైన భావోద్వేగాల కథతో ప్రేక్షకుల మెప్పు పొందాలంటే కథలో వేగం ఉండాలి. కథతో కనెక్ట్‌ అయ్యే ఎమోషన్‌ ఉండాలి. హీరో, హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీని పండించడంలో పెట్టిన శ్రద్ద, ఎమోషన్స్‌ మీద పెట్టలేదనిపించింది. కథలోని మెయిన్‌ పాయింట్‌ను టచ్‌ చేయడానికి సమయం ఎక్కువగా తీసుకోవడంతో సినిమాను సాగదీశాడనే భావన కలుగుతుంది. ఫస్ట్‌హాఫ్‌ ముగిసే సరికి, సెకండాఫ్‌ చూడాలనే ఆసక్తిని కలగజేయకపోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతుంది. 

చెప్పుకోదగ్గ కొత్త సన్నివేశాలు సినిమాలో ఏమీ లేకపోవడం కూడా మైనసే అని చెప్పాలి. సెకండాఫ్‌లో చెప్పాలనుకున్న అన్నీ విషయాలు ఒకేసారి రివీల్‌  కావడంతో హడావుడిగా అనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌పై, పాత్రలు తీర్చిదిద్దిన విధానంపై మరింత వర్కవుట్‌ చేసి, స్క్రీన్‌ప్లేను బలంగా రాసుకుని ఉంటే ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉండేది. 

నటీనటుల పనితీరు
: తొలి చిత్ర నటుడిగా రూపేష్‌ కనిపించకపోయినా నటనలో ఇంకాస్త మెరుగుపడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకోవాలంటే నటనలో ఆయన ఇంకాస్త బెటర్‌ అవ్వాలి.  ఆకాంక్ష సింగ్‌ అందంగా కనిపించడంతో పాటు నటనకు ఆస్కారమున్న పాత్రలో ఫర్వాలేదనిపించింది. రాజేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు బిగ్గెస్ట్‌ ప్లస్‌. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలంగా చెప్పొచ్చు. 

ఇళయరాజా సంగీతం ఈ సినిమాను ఉన్నతంగా నిలిపింది. తోటతరణి ఆర్ట్‌ వర్క్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన మార్క్‌ కనిపించింది. నిర్మాణ విలువలు,  రామ్‌రెడ్డి ఫోటోగ్రఫీ సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. 

ముగింపు: కుటుంబ బంధాలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ సినిమాలు ఇష్టపడే వారిని 'షష్టిపూర్తి' ఓ మోస్తరుగా సంతృప్తి పరిచే అవకాశం ఉంది.

Movie Name: Shashtipoorthi

Release Date: 2025-05-30
Cast: Rajendra Prasad, Archana, Rupeysh, Aakanksha Singh
Director: Pavan Prabha
Producer: Rupeysh
Music: Maestro Ilaiyaraaja
Banner: MAA AAIE Productions
Review By: Madhu

Shashtipoorthi Rating: 2.25 out of 5

Trailer

More Movie Reviews