'వడక్కన్' (ఆహా) మూవీ రివ్యూ!

  • మార్చి 7న విడుదలైన సినిమా 
  • నిన్నటి నుంచి తెలుగులో అందుబాటులోకి 
  • నిదానంగా సాగే ఫస్టాఫ్ 
  • ఫరవాలేదనిపించే సెకండాఫ్

కథ విషయంలో .. ట్రీట్మెంట్ విషయంలో మలయాళ మేకర్స్ ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ వెళుతూ ఉంటారు. అలా మలయాళం నుంచి వచ్చిన సినిమానే 'వడక్కన్'. కన్నడ కిశోర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, మార్చి 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. సాంకేతిక పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా, నిన్నటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎంతవరకూ ఆకట్టుకుందనేది చూద్దాం. 

కథ: పారానార్మల్ సైకాలజిస్ట్ గా రామన్ (కిశోర్)కి మంచి పేరు ఉంటుంది. ఒక రోజున ఆయనకి మాజీ లవర్ మేఘ కాల్ చేస్తుంది. తన భర్త 'రవివర్మతో' పాటు ఓ ఆరుగురు ఫ్రెండ్స్ ఓ రియాలిటీ షో కోసం ఐలాండ్ కి వెళ్లారనీ, అక్కడి నుంచి వాళ్లెవరూ తిరిగి రాలేదని చెబుతుంది. వాళ్లకి సంబంధించిన సమాచారాన్ని ఆయన మాత్రమే కనిపెట్టగలడని అంటుంది. ఈ విషయంలో తనకి హెల్ప్ చేయమని కోరుతుంది. 

రామన్ ఆ ఐలాండ్ గురించి సమాచారాన్ని సేకరించడం మొదలుపెడతాడు. 400 ఏళ్లుగా ఆ ఐలాండ్ లో అడుగుపెట్టడానికి ఎవరూ సాహసించలేదనీ, వెళ్లినవారు తిరిగిరాలేదని తెలుసుకుంటాడు. ఆంగ్లేయులకు ముందు ఆ గిరిజన ప్రాంతంలో ఒక సంఘటన జరిగిందనీ, అందువల్లనే ఆ తరువాత అక్కడ ఆంగ్లేయులు ఉండలేకపోయారని తెలుసుకుంటాడు. ఆంగ్లేయులు నిర్మించిన ఆ బంగాళాలోనే రియాలిటీ షో జరిగిందని తెలుసుకుంటాడు. 

ఆ ఐలాండ్ లో ఏం జరిగి ఉంటుందనేది తెలుసుకోవడం కోసం, మేఘ .. తన అసిస్టెంట్ 'ఎనా'ను తీసుకుని రామన్ అక్కడికి వెళతాడు. దట్టమైన ఆ ఫారెస్టు ప్రాంతంలోని పాడుబడిన బంగ్లాలోకి అడుగుపెడతాడు. వాళ్లకి అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అడవిలోకి వెళ్లిన రియాలిటీ షో టీమ్ ఏమైంది? గిరిజనుల కాలంలో అక్కడ ఏం జరిగింది? అనే ఉత్కంఠ భరితమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. 

విశ్లేషణ
: అడవిలోని ఒక గిరిజన ప్రాంతం .. ఆ తరువాత కాలంలో ఆ ప్రదేశంలో ఆంగ్లేయ అధికారులు భవనాన్ని నిర్మించడం .. ఆ తరువాత కొంతకాలానికే ఆ భవనం ఖాళీ కావడం .. అందులోకి రియాలిటీ షో సిబ్బంది దిగడం .. వంటి అంశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. పారానార్మల్ ప్రస్తావనతో హీరో రంగంలోకి దిగడంతో కథ ఊపందుకుంటుంది. 

ఈ కథకి రియాలిటీ షో ఎపిపోడ్ కీలకం. ఇదే ఎపిసోడ్ ఈ సినిమాకి మైనస్ గా మారిందని చెప్పచ్చు. కథకి రియాలిటీ షో ఎపిసోడ్ ఎంతవరకూ అవసరం? .. ఈ ఎపిసోడ్ నిడివి ఎంత ఉండాలి? అనే విషయంపై దర్శకుడు దృష్టిపెడితే బాగుండేది. మనం సినిమా చూస్తున్నామా? .. రియాలిటీ షో చూస్తున్నామా? అనే స్థాయిలో దర్శకుడు ఈ ఎపిసోడ్ ను సాగదీశాడు. ఆ తరువాత చకచకా ముగించాడు.

ఆసక్తి కరమైన ట్రాక్ నిడివిని తగ్గించి, అంతగా అవసరం లేని ట్రాక్ ను సాగదీయడం వలన ప్రేక్షకులకు కాస్త అసహనం కలుగుతుంది. గూడెం నేపథ్యంలోని ఫ్లాష్ బ్యాక్ .. ఆ బంగ్లాలోకి హీరో అడుగుపెట్టడం వంటి సన్నివేశాలను పెంచుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అలా చేసి ఉంటే తప్పకుండా ఈ సినిమా మరిన్ని మార్కులను సంపాదించుకుని ఉండేది. 

పనితీరు: కథాకథనాలతో కొత్తదనమేమీ కనిపించదు. గతంలో వచ్చిన కొన్ని సినిమాల ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. హాలీవుడ్ లో వచ్చిన కొన్ని హారర్ థ్రిల్లర్ సినిమాలను సైతం గుర్తుచేస్తుంది. కన్నడ కిశోర్ నటన ఆకట్టుకుంటుంది. కైకో నకారా కెమెరా పనితనం .. బిజిబల్ సంగీతం .. సూరజ్ ఎడిటింగ్ ఈ కంటెంట్  కి ఫుల్ గా సపోర్ట్ చేశాయి.

ముగింపు: ఏ సినిమా కైనా ఫస్టాఫ్ - సెకండాఫ్ రెండు కళ్ల వంటివే అని చెప్పాలి. అయితే ఈ సినిమా ఫస్టాఫ్ లో సన్నివేశాలను సాగదీయడమే సరిపోయింది. సెకండాఫ్ నిడివిలోనే కథ కాస్త నడుస్తుంది. టైట్ కంటెంట్ తో వచ్చినట్టయితే ఈ సినిమా మరింత బెటర్ గా ఉండేదేమో.  

Movie Name: Vadakkan

Release Date: 2025-06-06
Cast: Kishore, Sruthi Menon, Merin Philip, Kalesh, Meenakshi
Director: Sajeed
Producer: Jaideep Singh - Bhavyanidhi
Music: Bijibal
Banner: Off Beat Studios
Review By: Peddinti

Vadakkan Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews