'లెవన్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

  • నవీన్ చంద్ర హీరోగా 'లెవన్'
  • మేలో థియేటర్లకు వచ్చిన సినిమా
  • ఆకట్టుకునే నవీన్ చంద్ర నటన
  • నిడివి ఎక్కువైపోయిన పిల్లల ఫ్లాష్ బ్యాక్
  • వినోదపరమైన అంశాలపై కనిపించని దృష్టి  
        

ఈ మధ్య కాలంలో నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సినిమాలు .. వెబ్ సిరీస్ లు ఎక్కువగా చేస్తున్నాడు. అలా ఆయన చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా 'లెవన్' కనిపిస్తుంది. లోకేశ్ అజిల్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 16వ తేదీన థియేటర్లకు వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా, ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ఆడియన్స్ కి ఈ కథ ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూద్దాం.

కథ: విశాఖలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది పోలీస్ డిపార్టుమెంట్ కి అంతుబట్టదు. హత్య చేసిన వాళ్లందరినీ హంతకుడు ఆనవాళ్లు దొరక్కుండా దహనం చేసేస్తూ ఉంటాడు. ఈ కేసును పోలీస్ ఆఫీసర్ రంజిత్ కుమార్ (శశాంక్)హ్యాండిల్ చేస్తుంటాడు. అయితే అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంతో ఆయన కోమాలోకి వెళతాడు. దాంతో ఈ కేసును ఏసీపీ అరవింద్ ( నవీన్ చంద్ర)కి అప్పగిస్తారు. 

 మనోహర్ అనే మరో పోలీస్ ఆఫీసర్ తో కలిసి, సైకో కిల్లర్ ను పట్టుకోవడానికి అరవింద్ రంగంలోకి దిగుతాడు. సంజనా అనే ఒక యువతి లవ్ అంటూ వెంటపడుతున్నా పట్టించుకోకుండా, తన డ్యూటీ పైనే అరవింద్ పూర్తి దృష్టిపెడతాడు. ఒక వైపు నుంచి ఆయన అలా గాలిస్తూ ఉండగానే, మరో వైపు నుంచి హంతకుడు హత్యలు చేస్తూ వెళుతుంటాడు. మీడియా  కారణంగా, పై అధికారులు అరవింద్ పై ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. 

దాంతో అరవింద్ మరింత వేగం పెంచుతాడు. హంతకుడు ట్విన్స్ ను టార్గెట్ చేస్తున్నాడనీ, ట్విన్స్ లో ఒకరిని చంపుతున్నాడని గ్రహిస్తాడు. హంతకుడు ఎవరు? అతను ట్విన్స్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? వాళ్లలో ఒకరిని చంపడానికి కారణాలు ఏమిటి? అది తెలుసుకున్న అరవింద్ ఏం చేస్తాడు? మరికొన్ని హత్యలు జరగకుండా ఆయన ఆపగలుగుతాడా? జరుగుతున్న హత్యలకు .. 11 అనే నెంబర్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ. అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠను రేకెత్తిస్తూ ఈ  తరహా కథలు కొనసాగవలసి ఉంటుంది. మరి ఆ లక్షణాలు ఈ కథలో ఉన్నాయా అంటే .. ఉన్నాయి. కాకపోతే ఆశించిన స్థాయిలో లేవని చెప్పవలసి ఉంటుంది. తెరపై హత్యలు జరుగుతూ పోతుంటాయి . ఎవరు చేస్తున్నారు .. ఎందుకు చేస్తున్నారు? వీటితో ముడిపడిన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? హంతకుడు ఎలా పట్టుబడతాడు? అనేది ఈ తరహా కథల బలాన్ని నిర్ణయిస్తూ ఉంటాయి.  

 అయితే ఈ కథలో కిల్లర్ కిడ్నాప్ చేసే దృశ్యాలు .. హత్య చేసే దృశ్యాలు ఏ మాత్రం టెన్షన్ పెట్టవు .. భయపెట్టవు. ఆ స్థాయిలో ఈ సన్నివేశాలను డిజైన్ చేయలేదు. ఊపిరి బిగబట్టి చూడవలసిన సన్నివేశాలు .. తెరపై అలా తాపీగా జరిగిపోతూ ఉంటాయి. ఇక పోలీస్ ఆఫీసర్స్ వైపు నుంచి కూడా పెద్దగా హడావిడి కనిపించదు. అసలే ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగడం లేదని తెరపై పోలీస్ ఆఫీసర్ .. ఇటు ప్రేక్షకుడు ఫీలవుతుంటే, హీరోయిన్ ప్రేమ - పెళ్లి అంటూ వెంటపడటం వంటి సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి.

ఈ కథలోని అత్యంత కీలకమైన అంశం, సైకో టార్గెట్ చేసిన లిస్టులో ఎవరున్నారో తెలుసుకోవడం .. వారిని కాపాడటం. అయితే అందుకు సంబంధించిన సంఘటనలు కూడా తెరపై నింపాదిగానే నడిచాయి. ఈ తరహా కథలు .. నవల చదువుతున్నట్టుగా కాదు, స్పాట్ లో మనం ఉండి చూస్తున్నట్టుగా అనిపించాలి. లేదంటే కొంత నిరాశ .. మరికొంత అసంతృప్తి తప్పదు. ఈ సినిమా విషయంలోను అదే అనిపిస్తుంది. 

పనితీరు: పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేయడంలో నవీన్ చంద్ర ఆరితేరాడనే చెప్పాలి. ఈ సినిమాలో ఆయన యాక్షన్ ఆకట్టుకుంటుంది. నవీన్ చంద్రపై మనసు పారేసుకున్న యువతి పాత్ర కోసం,  కాస్త గ్లామర్ లుక్ ఉన్నవారిని ఎపిక్ చేస్తే బాగుండేదేమో. అలాగే ఆడుకాలం నరేన్ పాత్రకి కాస్త పవర్ యాడ్ చేయవలసింది. 

దర్శకుడు కథలో మలుపులకు ప్రాధాన్యతను ఇవ్వడం బాగానే ఉంది. కానీ ఆ మలుపులు ప్రేక్షకులను టెన్షన్ పెట్టేలా డిజైన్ చేసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేది. కార్తీక్ అశోకన్ ఫొటోగ్రఫీ .. ఇమాన్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. శ్రీకాంత్ ఎడిటింగ్ విషయానికి వస్తే, స్కూల్ ఎపిసోడ్ నిడివి తగ్గిస్తే బాగుండేదని అనిపిస్తుంది. 

ముగింపు
: దర్శకుడు ఎంచుకున్న లైన్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మలుపులు కూడా ఆసక్తికరంగానే అనిపిస్తాయి. అయితే ఆయా పాత్రలను డిజైన్ చేసిన తీరు .. ఆయా సన్నివేశాల ట్రీట్మెంట్ విషయంలోను ..  వినోదపరమైన అంశాలను జోడించే విధానంలోను .. ఇంకాస్త కసరత్తు జరిగి ఉంటే, మరింత బెటర్ అవుట్ పుట్ వచ్చేదేమో అనిపిస్తుంది. 


Movie Name: Eleven

Release Date: 2025-06-13
Cast: Naveen Chandra, Reyaa Hari, Shashank, Abhirami, Dileepan, Aadukalam Naren
Director: Lokkesh Ajils
Producer: Ajmal Khan - Reyaa Hari
Music: D Imman
Banner: AR Entertainment
Review By: Peddinti

Eleven Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews