'కన్నప్ప'- మూవీ రివ్యూ!

  • భారీ బడ్జెట్ తో రూపొందిన 'కన్నప్ప'
  • యాక్షన్ సీన్స్ నిడివి పెంచిన దర్శకుడు  
  • భక్తిరసంతోను మెప్పించిన విష్ణు 
  • హైలైట్ గా నిలిచిన ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. లొకేషన్స్ 
  • ప్రభాస్ ఎపిసోడ్ .. క్లైమాక్స్ ప్రత్యేక ఆకర్షణ
అప్పుడెప్పుడో కృష్ణంరాజు తన సొంత బ్యానర్ పై 'భక్త కన్నప్ప' సినిమాను నిర్మించి, హీరోగాను .. నిర్మాతగాను విజయాన్ని సాధించారు. ఆ తరువాత ఆయన ఎన్ని సినిమాలు చేసినప్పటికీ, 'భక్త కన్నప్ప' ఒక మైలురాయిలా నిలిచిపోయింది. చాలా కాలం తరువాత మంచు విష్ణు ఈ కథను ఎంచుకున్నాడు. 'కన్నప్ప' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. 'కన్నప్ప'గా విష్ణు ఎంతవరకూ మెప్పించాడనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: తిన్నడు (మంచు విష్ణు) అడవిని ఆనుకుని ఉన్న ఒక గూడెంలో పెరిగి పెద్దవాడవుతాడు. చిన్నప్పటి నుంచి కూడా అడవిలోని అమ్మోరికి జంతుబలులు .. నరబలులు ఇవ్వడాన్ని నిరసిస్తూ వస్తాడు. తిన్నడు మంచి విలుకాడు .. బలశాలి కావడం వలన, ఆ గూడెం ప్రజలంతా అతణ్ణి నాయకుడిగా ఎంచుకుంటారు. అతను 'నెమలి' (ప్రీతి ముకుందన్) ప్రేమలో పడతాడు. తన కండబలంతో గెలిచి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. 

అదే అడవిలోని ఒక ప్రదేశంలో పరమశివుడు స్వయంభువుగా ఆవిర్భవించిన 'వాయులింగం' ఉంటుంది. ఆ వాయులింగాన్ని పూజించే అర్హత తనకి మాత్రమే ఉందని చెబుతూ, మరెవరినీ దాని దరిదాపులలోకి రానీయకుండా చూస్తుంటాడు మహాదేవశాస్త్రి (మోహన్ బాబు). మహిమాన్వితమైన ఆ వాయులింగాన్ని అపహరించడానికి కాలాముఖుడు (అర్పిత్) తన సైనిక బలంతో బయల్దేరతాడు. అప్పటివరకూ శత్రుత్వం కొనసాగిస్తూ వస్తున్న ఐదు గూడాలు, కాలాముఖుడిని ఎదుర్కోవడానికి ఏకం కావాలనుకుంటాయి.

నెమలి శివభక్తురాలు. అయితే శివుడి గురించి ఆమె చెప్పే మాటలన్నీ కూడా, తిన్నడు ఎప్పటికప్పుడు కొట్టేపారేస్తూ ఉంటాడు. అలాంటి తిన్నడికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? కాలాముఖుడికి తాను ఎలా బుద్ధి చెబుతాడు? మహాదేవశాస్త్రి కళ్లు ఎలా తెరిపిస్తాడు?  'కన్నప్ప'గా ఎలా మారతాడు? అనేది కథ.

విశ్లేషణ: 'కన్నప్ప' ఈనాటివాడు కాదనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి కన్నప్ప కథను ఈ జనరేషన్ కి నచ్చేలా తెరకెక్కించడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి ఒక సాహసం చేసిన నిర్మాతగా విష్ణు కనిపిస్తాడు. ఆయన ఈ కథను న్యూజిలాండ్ కి తీసుకుని వెళ్లడం విమర్శలు తెచ్చిపెట్టినా, విష్ణు వెనకడుగు వేయలేదు. ఖర్చును గురించిన ఆలోచన చేయలేదు. 

 'కన్నప్ప' అనగానే, ఆయనకీ .. శివుడికి మధ్య జరిగే సన్నివేశాలే ప్రధానంగా ఉంటాయని ప్రేక్షకులు అనుకుంటారు. తిన్నడిగా శివుడిని నిందించడం .. కన్నప్పగా ప్రేమించడం చుట్టూనే ఈ కథ తిరుగుతుందని భావిస్తారు. కానీ గూడాల మధ్య అంతర్గత పోరాటం .. వాయులింగాన్ని అపహరించడానికి వచ్చేవారిని అడ్డుకోవడం వంటి సన్నివేశాలతోనే కథలో మూడు వంతులు గడిచిపోతుంది.

తిన్నడు యాక్షన్ సన్నివేశాలు పక్కన పెట్టి శివుడిపై దృష్టి పెట్టడానికి చాలా సమయం పడుతుంది. ఎప్పుడైతే శివుడి స్పర్శతో ఆయనలో మార్పు వస్తుందో, అప్పటివరకూ ఆడియన్స్ లో ఉన్న అసహనం తగ్గుతుంది. అక్కడి నుంచి ఆడియన్స్ ఆశించిన భక్తిరసంతో ముందుకు వెళుతుంది. ప్రభాస్ ఎపిసోడ్ సినిమాకి బాగా కలిసొచ్చింది. కాకపోతే ఆయన లుక్ విషయంలో మరింత కేర్ తీసుకోవలసింది. ప్రభాస్ చెప్పే డైలాగ్స్ కూడా సింపుల్ గా ఉంటూ కనెక్ట్ అవుతాయి.

శివుడిగా అక్షయ్ కుమార్ అతకనట్టుగా అనిపించినా, ఆ తరువాత అలవాటు పడతాము. మోహన్ లాల్ పాత్ర పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది. అలాగే మధుబాల .. బ్రహ్మానందం .. సప్తగిరి పాత్రలు కూడా అనవసరం అనిపిస్తాయి. మరీ పాతకాలంలో మాదిరిగా కాకపోయినా, కోయభాష విషయంలో కొంచెం వేరియేషన్ చూపించవలసింది.  

పనితీరు: ఇంటర్వెల్ ముందువరకూ తిన్నడు  .. ఆ తరువాత కన్నప్ప చుట్టూ కథ తిప్పితే బాగుండేదేమో. అలా కాకుండా ఎక్కవగా యాక్షన్ సీన్స్ కి ప్రాధాన్యతనిచ్చి, చివరిలో భక్తి వైపు మళ్లించారు. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ఈ సినిమాను చాలావరకూ కాపాడాయని చెప్పాలి. న్యూజిలాండ్ లోని లొకేషన్స్ చాలా అందంగా చూపించారుగానీ, మన నేటివిటీ మిస్సయిందేమో అనిపిస్తుంది. 

ఈ సినిమా కథాకథనాలకు ఒక భాగం కేటాయిస్తే, మిగతా మూడు భాగాలలో ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. లొకేషన్స్ కనిపిస్తాయి. ఈ మూడు అంశాలు కూడా  కథకు బలమైన సపోర్టును అందించాయి. పాటల చిత్రీకరణ చాలా బాగుంది. మొరటుదనం .. మొండితనం కలిగిన తిన్నడి పాత్రలో విష్ణు నటన ఆకట్టుకుంటుంది. ప్రభాస్ నటన ప్రభావితం చేస్తుంది. మహాదేవ శాస్త్రి పాత్రకి మోహన్ బాబు నిండుతనాన్ని తీసుకొచ్చారు. ప్రభాస్ పాత్ర విషయంలో .. క్లైమాక్స్ విషయంలో ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు.

ముగింపు: తిన్నడు .. కన్నప్పగా మారిపోయే సందర్భాన్ని తెరపైకి తీసుకుని రావడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. యాక్షన్ నిడివి తగ్గించి భక్తిరసానికి సంబంధించిన నిడివితో బ్యాలెన్స్ చేస్తే ఈ సినిమా మరిన్ని మార్కులు కొట్టేసేదేమో అనిపిస్తుంది. 

Movie Name: Kannappa

Release Date: 2025-06-27
Cast: Vishnu Manchu,Preity Mukhundhan,Mohan Babu, Sarathkumar, Mohanlal, Madhubala
Director: Mukesh Kumar Singh
Producer: Mohan Babu
Music: Stephen Devassy
Banner: AVA Entertainment
Review By: Peddinti

Kannappa Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews