ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ ప్రశంసలు కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న కష్టాలను రఘురామ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వివరించగా, ఆ వీడియోపై స్పందిస్తూ గణేశ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నటుడు రాజా రవీంద్ర నిర్వహించిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు పలు కీలక విషయాలను వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో తన పుట్టినరోజు నాడే తనను అరెస్టు చేశారని, ఆ సమయంలో తాను ప్రాణాలతో తిరిగి వస్తానని అనుకోలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం తాను గడుపుతున్న జీవితం భగవంతుడిచ్చిన 'బోనస్' అని వ్యాఖ్యానించారు. అప్పట్లో వైఎస్ జగన్‌పై తాను ఒంటరి పోరాటం చేశానని చెప్పారు. నరసాపురం ఎంపీగా ఉన్నప్పటికీ, 2020 ఫిబ్రవరి నుండి 2024 జనవరి వరకు తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమం మినహా, తన సొంత నియోజకవర్గానికి వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం రానందుకు తొలుత కొంత నిరాశ చెందినప్పటికీ, ఎమ్మెల్యేగా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు.

రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై స్పందించిన బండ్ల గణేశ్.. గత ప్రభుత్వ పాలనలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రాణాలకు తెగించి పోరాడారని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సైతం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం సాగించారని పేర్కొన్నారు. ఆ అలుపెరుగని పోరాటంలో రఘురామకృష్ణరాజు కూడా కీలక భాగస్వామి అని బండ్ల గణేశ్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.