విదేశీ విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీ కీలక సూచన... ఆ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లొద్దు!

  • అంతర్జాతీయ విద్యార్థులను హెచ్చరించిన హార్వర్డ్ యూనివర్సిటీ
  • బోస్టన్ లోగాన్ ఎయిర్‌పోర్ట్‌కు దూరంగా ఉండాలని సూచన
  • న్యూయార్క్ జేఎఫ్‌కే వంటి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని సలహా
  • సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి
  • ఇరాన్, చైనా విద్యార్థులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ
  • ట్రంప్ ప్రభుత్వంతో విభేదాలే ఈ హెచ్చరికలకు కారణమని వెల్లడి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికాకు వచ్చే తమ అంతర్జాతీయ విద్యార్థులకు ఒక కీలకమైన, అనూహ్యమైన సలహా ఇచ్చింది. అమెరికాలో ప్రవేశించేటప్పుడు బోస్టన్‌లోని లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బదులుగా న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే వంటి ఇతర విమానాశ్రయాలను ఎంచుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఇరాన్, చైనా దేశాల విద్యార్థులకు ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ట్రంప్ ప్రభుత్వంతో వర్సిటీకి విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

హార్వర్డ్ ఇంటర్నేషనల్ ఆఫీస్, హార్వర్డ్ లా స్కూల్ ఇమ్మిగ్రేషన్ సపోర్ట్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఒక ప్రైవేట్ కాల్‌లో ఈ సూచనలు చేసినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. బోస్టన్ విమానాశ్రయంలో విద్యార్థులపై ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీలు తీవ్రతరం కావడమే ఈ సలహాకు ప్రధాన కారణమని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ప్రయాణ సమయంలో విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోని కంటెంట్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించాయి. కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారులు ఎలక్ట్రానిక్ పరికరాలను తనిఖీ చేసే అధికారం కలిగి ఉన్నారని, అందులోని సమాచారం ఆధారంగా ప్రవేశాన్ని నిరాకరించవచ్చని స్పష్టం చేశాయి.

ముఖ్యంగా పాలస్తీనాకు అనుకూల, యూదులకు వ్యతిరేక లేదా అమెరికాను కించపరిచేలా ఉన్న పోస్టులు సమస్యలు సృష్టించవచ్చని ప్రతినిధులు విద్యార్థులకు వివరించారు. అనుమానం రాకుండా ఉండేందుకు ప్రయాణానికి ముందు పరికరాలను పూర్తిగా ఖాళీ (wipe clean) చేయడం కూడా అనుమానాలకు తావివ్వవచ్చని వారు తెలిపారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులు చదివే విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశం, పరిశోధన నిధుల రద్దు వంటి అంశాలపై హార్వర్డ్ యూనివర్సిటీకి, ట్రంప్ ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్సిటీ తమ విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.


More Telugu News