ఎల్ఎస్డీ ఒక్కటే కాదు... ప్రపంచాన్ని ఊపేస్తున్న డ్రగ్స్ మరెన్నో...!

టాలీవుడ్ నటీనటులు ఎల్ఎస్డీ అనే మత్తు మందులో మునిగి తేలుతున్నట్టు సంచలన వార్తలు వచ్చాయి. ప్రముఖుల పేర్లు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు టాలీవుడ్ ఇలా మత్తులో చిత్తవుతోందంటూ చాలా మంది ఆశ్చర్యపోయారు. మత్తుమందులపై మరోసారి ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎల్ఎస్డీతోపాటు ఇతర మత్తుమందులు, వాటి అనర్థాల గురించి తెలుసుకుదాం.


ఎక్కువగా వినియోగంలో ఉన్న డ్రగ్స్
ఎల్ఎస్డీ, కొకైన్, హెరాయిన్, ఎక్సటసీ, గంజాయి, కెటమైన్, మెథాంఫిటమైన్, యాంఫిటమైన్, నైట్రైట్స్, పోప్పర్స్, మ్యాజిక్ మష్ రూమ్స్ మొదలైనవి.

representational imageఎల్ఎస్డీ
లిసర్జిక్ యాసిడ్ డైఎతిలమైడ్ అన్నది ఎల్ఎస్డీ పూర్తి నామం. ఉల్లాసాన్ని, మత్తును కలిగించే డ్రగ్. సైకిడెలిక్ డ్రగ్ గా చెబుతారు. దీన్ని నేరుగా మింగడం లేదా నాలుక కింద పెట్టుకుంటారు. తెలుపు రంగు, పారదర్శక రంగులో ఉండే దీనికి ఎటువంటి వాసనా ఉండదు. కేవలం 20-30 మైక్రో గ్రాములు తీసుకుంటే మత్తులో జోగుతారు. 1938లో స్విట్జర్లాండ్ కు చెందిన ఆల్బర్ట్ హాఫ్ మన్ ఎర్గోటమైన్ అనే కెమికల్ నుంచి ఎల్ఎస్డీని తయారు చేశాడు. 1947 ప్రాంతాల్లో దీన్ని సైకియాట్రిక్ చికిత్సలో మందుగా వినియోగించారు. కానీ, ఆ తర్వాత ఈ డ్రగ్ ను మత్తుమందుగా వాడడం పెరగడంతో నిషేధించారు. 1960-1970ల మధ్య భాగంలో దీనికి ప్రాచుర్యం బాగా పెరిగింది. వినోదాన్నిచ్చే డ్రగ్ గా దీనికి పేరు. ఆధ్యాత్మిక భావాలనూ పేరేపిస్తుందని గుర్తించారు. దీని వాడకంతో వ్యసనపరులుగా మారతారు. దీర్ఘకాలంలో దీని డోసేజ్ పెంచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ పట్టుబట్టి మానేస్తే తిరిగి సాధారణ స్థితికి చేరడం సాధ్యమే.

దీని ప్రభావాలు
ఈ డ్రగ్ తీసుకున్న తర్వాత కంట్లోని గుడ్డుభాగం వాచిపోతుంది. ఆకలి తగ్గుతుంది. పూర్తిగా నిద్రపోలేకపోవడం (నిద్రలేమి) వంటివి కనిపిస్తాయి. తీసుకున్న 30 నిమిషాల తర్వాత దృశ్యాలు, శబ్దాలకు సంబంధించిన భ్రాంతులు మొదలవుతాయి. నోరు ఎండిపోయినట్టు, చమట పట్టడం జరుగుతుంది. ఎంత మొత్తం డ్రగ్ తీసుకున్నారన్న దానిపై ఇవి ఆధారపడి ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చడం లేదా రక్తంలోకి ఎక్కించుకుంటే ప్రభావం వెంటనే మొదలవుతుంది. నాలుగు గంటల నుంచి 12 గంటల పాటు ఈ ప్రభావం ఉంటుంది. మొదటి మూడు గంటలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మరో ఎనిమిది గంటల వరకు తక్కువ ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలం పాటు వాడితే అయోమయం, భావోద్వేగాల అస్థిరత, మానసిక అనారోగ్యం, పారనోయ సమస్యలు ఎదురవుతాయి. అధిక మోతాదులో తీసుకుంటే ప్యానిక్ అటాక్స్ కు కూడా లోనవుతారు.

representational imageకెటమైన్
దీన్ని మనుషుల్లో, జంతువుల్లోనూ అనస్తీషియా (మత్తుమందు)గా ఉపయోగిస్తుంటారు. ఉల్లాసాన్నిచ్చే డ్రగ్ గానూ దీనికి గుర్తింపు ఉంది. స్వచ్ఛమైన పారదర్శక ద్రవ పదార్థంగా, తెల్లటి పొడి రూపంలోనూ ఇది ఉంటుంది. ఇంజెక్ట్ చేసుకోవడం లేదా డ్రింక్ తో కలుపుకుని తాగడం, పొగాకు, మరిజునాతో కలిపి పొగలా సేవించడం చేస్తారు. ఈ డ్రగ్ తీసుకున్న వారిలో శరీరానికి, మనసుకు మధ్య ఉన్న లింక్ తాత్కాలికంగా తెగిపోతుంది. భ్రమల లోకంలోకి వెళతారు. నిద్రలోకి వెళ్లడం, గందరగోళానికి గురవడం జరుగుతుంది. వారి గురించి వారికే గుర్తుండని స్థితిలోకి వెళతారు. ఈ డగ్ర్ సరిపడకపోతే వాంతులు కూడా అవుతాయి. కెటమైన్ మోతాదు ఎక్కువైన కొద్దీ వ్యక్తుల శ్వాస నిదానిస్తుంది. స్పృహ కోల్పోవడం, మరణానికి కూడా గురికావచ్చు.
 
representational imageహెరాయిన్
ప్రపంచంలో 87 శాతం హెరాయిన్ అఫ్ఘానిస్తాన్ లోనే పండుతోంది. తెలుపు, బ్రౌన్ రంగులో పొడి రూపంలో ఉంటుంది. బ్లాక్ టార్ అనే హెరాయిన్ రకం నల్లగా ఉంటుంది. ఇంజెక్ట్ చేసుకోవడం, పొగ రూపంలో తీసుకోవడం, పీల్చుకోవడం అనే మార్గాల్లో దీన్ని తీసుకుంటారు. కేన్సర్ రోగుల్లో తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చే గుణం దీనికి ఉంది. ఉల్లాసాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. దీర్ఘకాలం పాటు వాడితే శ్వాస వ్యవస్థ పనితీరు దెబ్బతిని మరణానికి గురవుతారు. గర్భం కోల్పోవడం, న్యూమోనియా, లివర్, కిడ్నీ వ్యాధుల ముప్పూ హెరాయిన్ వాడకంతో పెరుగుతుంది. అధిక మోతాదు తీసుకుంటే శ్వాస కష్టమవుతుంది. రక్తపోటు పడిపోతుంది. మగత, చర్మం చల్లబడడం జరుగుతాయి. చివరికి కోమాలోకి జారుకునే అవకాశం ఉంది. వాడిన కొన్నిగంటల తర్వాత దీని ప్రభావాలు నెమ్మదిస్తాయి. కొందరిలో రెండు మూడు రోజుల పాటు తీవ్రంగా ఉండి ఆ తర్వాత నిదానిస్తాయి. చాలా దేశాల్లో హెరాయిన్ తయారీ, వినియోగం, విక్రయంపై నిషేధం అమల్లో ఉంది.

representational imageకొకైన్
ఇది కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్నిచ్చే డ్రగ్. ఇది రక్తపోటు, గుండె స్పందనల రేటును పెంచుతుంది. ఎంతో శక్తివచ్చినట్టు అనిపిస్తుంది. నోటి నుంచి 1.2 గ్రాములు, రక్త నాళాల ద్వారా, పీల్చడం ద్వారా 700-800 మిల్లీగ్రాములు తీసుకుంటే ప్రాణాలు కోల్పోతారు. ఇది కేవలం అంచనా మాత్రమే. కొందరిలో ఇంతకన్నా తక్కువ డోసేజ్ తీసుకున్నా ప్రాణ ప్రమాదం ఉంటుందని గుర్తించారు. దీర్ఘకాలం పాటు వాడిన వారిలో ముక్కు కారుతూ ఉండడం, వాసన చూసే, రుచి చూసే సామర్థ్యం క్షీణించడం, హర్ట్ ఎటాక్, పక్షవాతం ముప్పు ఎక్కువ అవుతుంది. తెల్లటి పౌడర్ రూపంలో ఇది ఉంటుంది.

కేనాబిస్/మరిజువానా
కేనాబిస్ అనేది మొక్క. మన దగ్గర గంజాయి అంటారు. ఈ మొక్క నుంచి తీసిన భాగాలనే మరిజువానా అంటారు. ఆల్కహాల్, పొగాకు తర్వాత అత్యధికంగా వినియోగమవుతున్న వ్యసన పదార్థం ఇది. అత్యధికంగా వినియోగమవుతున్న చట్ట విరుద్ధ మత్తు మందు. మరిజువానా, ఆకులు, పూలను ఎండబెట్టి పొగతాగడం, ఆహార పదార్థాల్లో కలపడం, టీలా చేసుకుని తాగడం, చేస్తారు. కొంత మంది దీన్ని పొగాకుతో కలపి వాడుతుంటారు. దీన్ని తీసుకుంటే విశ్రాంతి భావన, మగతలోకి జారుకుంటారు. దీర్ఘకాలం పాటు వాడితే శ్వాస వ్వవస్థ పనితీరులో మార్పు వస్తుంది. లంగ్ కేన్సర్, బ్రాంకైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

ఎక్సటసీ
ఎండీఎంఏ గానూ ఇది ప్రాచుర్యంలో ఉన్న డ్రగ్. మెథిలెనిడాక్సీ మెథాంఫిటమైన్ తో కలసి ఉండే డ్రగ్ ఇది. ఇది తీసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుందని, ఎంజాయ్ మెంట్ కోసం దీన్ని తీసుకుంటున్నామని వాడే వారు చెబుతారు. దీన్ని తీసుకుంటే పది మందిలో ఉన్నప్పుడు మరింత సౌకర్యమైన భావన కలుగుతుంది. ఆరు గంటల పాటు దీని ప్రభావం ఉంటుంది. ఇది చాలా ప్రాచుర్యం చెందిన క్లబ్ డ్రగ్. తెలుపు, పసుపు, బ్రౌన్ రంగు ట్యాబ్లెట్ లేదా క్యాప్సుల్ రూపంలో విక్రయిస్తుంటారు. పౌడర్ రూపంలోనూ లభిస్తుంది. దీన్ని లవ్ డ్రగ్ గానూ చెబుతారు. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుంది. స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్సటసీ వాడితే శరీరంలో నీటి శాతం పడిపోతుంది. మెమరీని కూడా నష్టపోవాల్సి వస్తుంది.

మెథాంఫిటమైన్
మెథాంఫిటమైన్ లైదా మెథిల్ యాంఫిటమైన్ ఏదైనా ఒకటే. ఇది అత్యధికంగా వ్యవసనానికి గురి చేసే నార్కోటిక్ డ్రగ్. వైద్యులు కొన్ని సందర్భాల్లో సిరఫారసు చేసే డ్రగ్. అత్యధిక దుష్ప్రభావాల నేపథ్యంలో దీన్ని అరుదుగా సూచిస్తారు. ఎఫ్ డీఏ షెడ్యూల్ 2 నార్కోటిక్ డ్రగ్ ఇది. కేంద్ర నాడీ మండల వ్యవస్థను ఉత్తేజానికి గురిచేసే డ్రగ్ ఇది. తీసుకున్న వెంటనే ఉల్లాసం, ఉత్తేజ భావన కలుగుతుంది. డోపమైన్ స్థాయులు అధికంగా రక్తంలో విడుదల కావడమే ఇందుకు కారణం. ఇంజెక్ట్ చేసుకున్నా, పీల్చినా వేగంగా దాని ప్రభావం చూపిస్తుంది.

వైద్య అవసరాలకు అంటే ఒబెసిటీతో బాధపడేవారికి వైద్యులు దీన్ని 5ఎంజీ మోతాదులో సిఫారసు చేస్తారు. అప్రమత్తత ఎక్కువవుతుంది. దాంతో నిద్ర తగ్గుతుంది. చరుకుదనం పెరుగుతుంది. ఆకలి మందగిస్తుంది. దూకుడైన ప్రవర్తన, చిరాకు, ఆందోళన, శ్వాస వేగంగా తీసుకోవడం, రక్తపోటు, గుండె స్పందన పెరగడం జరుగుతాయి. గుండె స్పందనలు కూడా గతి తప్పుతాయి. దీర్ఘకాలం పాటు వాడితే మెదడులొ డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి  జరిగి మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది.

యాంఫిటమైన్
దీని రసాయనిక నిర్మాణం అడ్రెనలిన్ ను పోలి ఉంటుంది. ఉత్తేజాన్నిచ్చే డ్రగ్. తెల్లని బిళ్లలు, పలుకులు, పౌడర్ రూపంలో లభిస్తుంది. ఇది తీసుకుంటే శక్తి పెరిగినట్టు, విశ్వాసం, ధైర్యం పెరిగినట్టు అనిపిస్తుంది. ఇలా 12 గంటల పాటు ఉంటుంది. దీర్ఘకాలం పాటు వాడితే గుండె పనితీరును దెబ్బతీస్తుంది. రక్తపోటు కూడా పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ ముప్పు పొంచి ఉంటుంది.  

మ్యాజిక్ మష్ రూమ్స్
ప్రపంచవ్యాప్తంగా 90  రకాల మ్యాజిక్ మష్ రూమ్స్ (పుట్టగొడుగులు) జాతులు ఉన్నాయి. వీటిని తీసుకుంటే ఎల్ఎస్డీలో మాదిరిగానే ఉంటుంది. పచ్చివి తినడం, లేదా ఎండబెట్టినవి టీలో వేసుకుని తాగడం చేస్తారు. దీర్ఘకాలం పాటు వాడితే మెమరీ దెబ్బతింటుంది.

representational imageశరీరంలో ఎంత కాలం పాటు
సాధారణంగా డ్రగ్స్ తీసుకున్న తర్వాత రక్తంలో కలుస్తాయి. ఆ తర్వాత అవి శరీరంలోని ఇతర భాగాలనూ చేరతాయి. పొట్ట, శరీరంలోని ఇతర కణజాలంలో కొవ్వు కిందకు మారి నిల్వ ఉంటాయి. పేగుల్లో, వెంట్రుకల్లో, గోళ్లలోనూ వీటి ఆనవాళ్లు చాలా కాలం పాటు ఉంటాయి. చాలా డ్రగ్స్ ఫాట్ సొల్యుబుల్ పదార్థాలు. అంటే ఫ్యాట్ తో కలిసిపోయేవని అర్థం. ఎల్ఎస్డీ, హెరాయిన్ ఇలాంటివి అన్నీ కూడా ఫాట్ సొల్యుబుల్ తరహావే. వీటిని నీటిలో వేస్తే కరిగిపోవు. కనుక వీటిని తీసుకున్న తర్వాత (పీల్చడం, పొగ తాగడం, పిల్ రూపంలో, చప్పరించడం ) రక్తంలో కలిసిపోతాయి. రక్త ప్రవాహ మార్గానికి సమీపంలోని కొవ్వు నిల్వ ఉండే కణజాలాల వద్దకు కొద్ది మేర చేరతాయి. అలాగే హెయిర్ ఫాలికుల్స్ కూ వెళతాయి. అందుకే డ్రగ్స్ తీసుకున్న వారి వెంట్రుకలు, గోళ్లను పరిశీలిస్తుంటారు. వెంట్రుకల్లో డ్రగ్స్ ఆనవాళ్లు మూడు నెలల వరకు, గోళ్లలో మూడు నుంచి నాలుగు వారాల వరకు గుర్తించొచ్చు.

డ్రగ్స్ వర్గీకరణ
అమెరికా ఫెడరల్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అన్ని రకాల డ్రగ్స్ ను (వీటిలో చికిత్సకు వాడేవి కూడా) పలు రకాలుగా వర్గీకరించింది.
షెడ్యూల్ 1
వీటికి వైద్య ఔషధాల పరంగా గుర్తింపు లేదు. అధిక వ్యసన గుణాలను కలిగినవి. హెరాయిన్, ఎల్ఎస్డీ, ఎక్సటసీ, కేనాబిస్ ఈ తరహావే.
షెడ్యూల్ 2
ఔషధ పరంగా పరిమితంగా వాడేవి. వ్యసనానికి గురయ్యే ప్రభావం తక్కువ ఉన్న డ్రగ్స్ ఇవి. కొకైన్, మెథాడోన్, హైడ్రోకొడోన్, మెథాంఫిటమైన్ ఉదాహరణలు.
హెడ్యూల్ 3
వ్యసనానికి గురయ్యే ప్రభావం మధ్యస్థంగా ఉన్న డగ్స్ ఇవి. వీటిని కూడా వైద్య అవసరాలకు సూచిస్తుంటారు. వికడిన్, కోడీన్, కెటమైన్, అనబోలిక్ స్టిరాయిడ్స్ మొదలైనవి.
షెడ్యూల్ 4
ఔషధ పరంగా అనేక సందర్భాల్లో వాడే వాటిని ఈ కేటగిరీలో పేర్కొన్నారు. డ్రావోన్, సోమా, క్సనాక్స్, వాలియమ్, అంబీన్ బెంజడైజిపిన్ తదితరాలు.
షెడ్యూల్ 5
ఔషధ పరంగా వాడే వీటికి బానిసలు కావడం తక్కువే. దగ్గు ఉపశమనానికి వాడే కొడీన్ (200 మిల్లీగ్రాములు) ఈ విభాగంలోనిదే.

ఔషధాలే... కానీ మత్తుమందులు!
కొన్నింటిని వైద్య పరంగా ఎన్నో వ్యాధుల్లో చికిత్స కోసం సూచించడం జరుగుతుంది. అటువంటి వాటిని మత్తుమందులుగా వాడేవారూ ఉన్నారు.

representational imageయాంటీ డిప్రసెంట్స్
మానసిక కుంగుబాటును తగ్గించడానికి వైద్యులు యాంటీ డిప్రసెంట్ గ్రూపు మందులు సూచిస్తుంటారు. వీటిని తీసుకుంటే ఆందోళన, ఒత్తిడి వ్యాకులతల నుంచి ఉపశమనం లభిస్తుంది. మత్తునిస్తాయి గనుక వీటిని మానసిక అనారోగ్యం లేని వారు కూడా వాడుతుంటారు. దీంతో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయి.

యాంటీ యాంగ్జయిటీ డ్రగ్స్
ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సూచించే ఈ మందులను నిద్రమాత్రలుగా కూడా పిలుస్తుంటారు. సాధారణంగా ఆందోళనలో ఉన్నప్పుడు గుండె రేటు పెరుగుతుంది. ఈ డ్రగ్స్ తీసుకుంటే మెదడులో ఆందోళనకు దారితీసే వాటిని సప్రెస్ చేస్తాయి. వైద్యులు సూచిస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని తీసుకోరాదు. ఎందుకంటే స్వల్ప కాలం పాటు వాడినా వీటివల్ల దుష్ప్రభావాలు ఉంటాయి.

బార్బిటురేట్స్
ఆందోళనను నివారించే డ్రగ్స్, ట్రాంక్విలైజర్లుగా, మత్తు కోసం వైద్యులు సూచించే డ్రగ్స్ ఇవి. ప్రధానంగా ఈ మందులను మత్తు రావడం కోసమే వినియోగిస్తారు. వీటిని వాడడం మొదలు పెడితే వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. షెడ్యూల్ 3 నుంచి షెడ్యూల్ 4 వరకు వివిధ రకాల డ్రగ్స్ ఇందులో ఉన్నాయి.

హల్యూసిినేషన్స్
భ్రమలు (ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు) కలిగించే డ్రగ్స్ ఇవి. ఎల్ఎస్డీ, సిలోసైబిన్, మెస్కాలిన్ అన్నవి చాలా పేరొందిన భ్రమలు కలిగించే డ్రగ్స్. వైద్య పరంగా వీటికి ఎటువంటి గుర్తింపు లేదు.

మత్తుమందులకు కేంద్రాలు
అప్ఘానిస్తాన్, బహమాస్, బెలిజ్, బర్మా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వెడార్, గ్వాటెమాల, హైతి, హోండూరస్, భారత్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగ్వ, పాకిస్థాన్, పనామా, పెరూ, వెనుజులా ఇవన్నీ డ్రగ్స్ అక్రమ ఉత్పత్తి లేదా రవాణాలో పాత్ర కలిగిన దేశాలని 2014లో అమెరికా ప్రకటించింది.

బానిస దేశాలు
ఎన్నో రకాల మత్తుమందులను ప్రపంచంలోని వివిధ దేశాలకు మెక్సికో ఎగుమతి చేస్తోంది. మెథ్ అనే డ్రగ్ ఉత్పత్తి ఎక్కువ. ఈ దేశంలో 3,60,000 మంది ఈ డ్రగ్ ను వాడుతున్నారు. బ్రెజిల్ లో ఆక్సి అనే మత్తు మందు వాడకం ఉంది. కొకైన్ కంటే ఇది పవర్ ఫుల్. అమెరికాలో వైద్యులు రాసే ప్రెస్క్రిప్షన్ సెడేటివ్ మందుల వినియోగంం ఎక్కువ. కెనాడలో మరిజువానా ఎక్కువగా వినియోగంలో ఉంది. అఫ్ఘానిస్థాన్, ఇరాన్ లో హెరాయిన్ వినియోగం ఉంది. 


More Articles