పెద్దల కోసం భద్రతతో కూడిన సరికొత్త పెన్షన్ పాలసీ... 'వయ వందన యోజన'!
వృద్ధాప్యంలో భద్రతతో కూడిన స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలకే పెద్దలు ఎక్కువగా ఓటేస్తారు. ఈ తరహాకు చెందిన ఓ సంప్రదాయ పెన్షన్ పాలసీని కేంద్ర సర్కారు ‘ప్రధానమంత్రి వయవందన యోజన’ పేరుతో తీసుకొచ్చింది. ఇందులో ఉన్న సానుకూల, ప్రతికూలతలపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
మన దేశంలో అవ్యవస్థీకృత రంగంలోని వారు, స్వయం ఉపాధితో జీవితాన్ని నెట్టుకొచ్చిన వారికి 60 ఏళ్ల తర్వాత తక్షణం నెలవారీ పెన్షన్ ఇచ్చే పాలసీలు మార్కెట్లో పరిమితంగానే ఉన్నాయి. ఎన్ పీఎస్, యూనిట్ ఆధారిత పెన్షన్ పథకాలు, బీమా కంపెనీలు అందించే ఇతర పెన్షన్ పథకాలన్నీ కూడా భవిష్యత్తులో రిటైర్ అయ్యే వారి కోసం. ఇక యాన్యుటీ అంటూ పెట్టుబడి పెట్టిన మొత్తంపై మరుసటి నెల నుంచే ఆదాయాన్నిచ్చే పథకాలూ ఉన్నాయి. కాకపోతే వీటిపై రాబడి తక్కువే. నెలవారీ ఆధాయాన్నిచ్చే పథకాల్లో ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒక్కటే 8.3 శాతం రాబడినిస్తుంది. మిగతావన్నీ8 శాతంలోపు వడ్డీ రేటున్నవే. మరి ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం వయవందన యోజన అంటూ 8 శాతం వడ్డీ రేటుతో పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం నిర్వహణ బాధ్యతను ఎల్ఐసీ చూస్తోంది.
60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు అర్హులే. గరిష్ట వయ పరిమితి అంటూ లేదు. 60 ఏళ్ల తర్వాత ఏ వయసు వారైనా పెట్టుబడి పెట్టి ఆదాయం పొందొచ్చు. 10 ఏళ్ల కాల వ్యవధి. అప్పటి వరకు 8 శాతం వార్షిక వడ్డీ ప్రాతిపదికన నెలవారీ చెల్లింపులు చేస్తారు. జీఎస్టీ కింద దీన్ని మినహాయించారు. ఈ ఏడాది మే 4న దీన్ని అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పటికే ఎల్ఐసీ 58 వేలకు పైగా పాలసీలను జారీ చేయడంతోపాటు రూ.2,700 కోట్లను వసూలు చేసింది. కాకపోతే అధికారికంగా విడుదల చేసింది మాత్రం కొద్ది రోజుల క్రితమే. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ పాలసీని కొనుగోలు చేయవచ్చు. వచ్చే ఏడాది 2018 మే 3 వరకే ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇందులో చేరేందుకు అవకాశం ఉండదు. నెలవారీ, మూడు నెలలకోసారి, అర్ధ సంవత్సరం, ఏడాదికోసారి పెన్షన్ పొందే సౌలభ్యం ఉంది.
ప్రతీ నెలా పెన్షన్
నెలవారీ పెన్షన్ పొందాలంటే కనీసం రూ.1,44,578 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ఠంగా రూ.7,22,892 పెట్టుబడి పెట్టుకోవచ్చు. అప్పుడు ప్రతీ నెలా కనిష్ఠ పెట్టుబడిపై రూ.1,000 రూపాయలు, గరిష్ఠ పెట్టుబడిపై రూ.5,000 పెన్షన్ గా అందుతుంది.
మూడు నెలలకోసారి పెన్షన్
కనీసం రూ.1,47,601 పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠంగా రూ.7,38,007 ఇన్వెస్ట్ చేయవచ్చు. అప్పుడు మూడు నెలలకోమారు కనిష్ఠ పెట్టుబడిపై రూ.3,000 గరిష్ఠ పెట్టుబడిపై రూ.15,000 పెన్షన్ వస్తుంది.
ఆరు నెలలకోసారి
కనిష్ఠంగా రూ.1,49,068, గరిష్ఠంగా రూ.7,45,342 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రతీ ఆరు నెలలకు కనిష్ఠ మొత్తంపై రూ.6,000, గరిష్ఠ మొత్తంపై రూ.30,000 పెన్షన్ గా చెల్లిస్తారు.
ఏడాదికోసారి
కనిష్ఠంగా రూ.1,50,000, గరిష్ఠంగా రూ.7,50,000తో పాలసీ తీసుకోవచ్చు. అప్పుడు కనిష్ఠ మొత్తంపై రూ.12,000, గరిష్ఠ మొత్తంపై రూ.60,000 పెన్షన్ అందుకోవచ్చు.
మరింత సరళంగా చెప్పుకోవాలంటే ప్రతీ రూ.1,000 పెట్టుబడిపై నెలవారీ అయితే రూ.80, మూడు నెలలకోసారి కోరుకుంటే రూ.80.50, ఆరు నెలలకోసారి తీసుకుంటే రూ.81.30, ఏడాదికోసారి తీసుకుంటే రూ.83 ఆదాయంగా లభిస్తుంది.
కొన్ని పరిమితులు
ఇక్కడ పేర్కొన్న గరిష్ఠ పెన్షన్ ఒక కుటుంబం మొత్తానికి అని అర్థం చేసుకోవాలి. పెన్షనర్, వారి జీవిత భాగస్వామి, పెన్షనర్ పై ఆధారపడిన వారిని కలిపి ఓ కుటుంబంగా పరిగణిస్తారు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురి పేర్లపై ఇన్వెస్ట్ చేయకుండా ఈ పరిమితి విధించారు. పెన్షన్ ను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. పాలసీ కాల వ్యవధి ముగిసేలోపు (10 ఏళ్లలోపు) పాలసీదారుడు మరణిస్తే పెట్టుబడి మొత్తాన్ని నామినీ లేదా వారసులకు చెల్లించేస్తారు. పెన్షన్ ను ఎప్పటికప్పుడు చెల్లిస్తుంటారు గనుక గడువు తీరిన తర్వాత అసలు మాత్రమే చెల్లిస్తారు. కాల వ్యవధి తీరేలోపే ఈ పథకం నుంచి వైదొలగాలంటే ప్రత్యేక కారణాల్లో అనుమతిస్తారు. తీవ్ర అనారోగ్యానికి లోనై చికిత్స తీసుకోవాలనుకునే వారు పెట్టుబడి మొత్తంలో 98 శాతాన్ని వెనక్కి తీసేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత అవసరం అనుకుంటే రుణం తీసుకునేందుకు అవకాశం ఉంది. పెట్టుబడి మొత్తంలో 75 శాతాన్ని రుణంగా ఇస్తారు. రుణంపై 10 శాతం వడ్డీ పడుతుంది. పెట్టుబడి పెట్టి, పాలసీ తీసుకున్న తర్వాత అందులోని నిబంధనలు, ఇతర అంశాలు నచ్చకపోతే వెనక్కిచ్చేయవచ్చు. ఆన్ లైన్ లో అయితే 30 రోజులు, ఆఫ్ లైన్ లో అయితే 15 రోజుల్లోపల ఈ అవకాశం ఉంది. ఈ పథకంలో పెట్టే పెట్టుబడి, వడ్డీ రాబడికీ ఎటువంటి పన్ను ప్రయోజనాలు లేవు.
ప్రయోజనమేనా?
రాబడికి హామీతోపాటు 8 శాతం వడ్డీ రేటు అన్నది ఫర్వాలేదనే చెప్పుకోవాలి. దీనికంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో మాత్రమే పెట్టుబడిపై 8.3 శాతం వడ్డీ అమల్లో ఉంది. మిగిలిన పథకాలన్నీ కూడా తక్కువ వడ్డీ రేటున్నవే. ఇందులో ప్రతీ నెలా గరిష్ఠ పెన్షన్ రూ.5,000 మాత్రమే. రూ.7.5 లక్షలకు మించి పెట్టుబడికి అవకాశం లేదు. ఇది ఓ కుటుంబానికి పూర్తిగా సరిపోయే అమౌంట్ కాదు. ముఖ్యంగా రిటైర్ అయిన వారికి ఈ ఆదాయం అన్ని అవసరాలనూ తీర్చలేదు. దీనికంటే కూడా మంచి డెట్ మ్యూచుల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి నెలవారీ క్రమానుగత ఉపసంహరణ రూపంలో ఆదాయం పొందడం నయమని ముంబైకి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ సురేష్ శడగోపన్ అభిప్రాయపడ్డారు. నెలకు తక్కువ మొత్తంలో అవసరాలున్నవారికే ఇది అనుకూలమన్నారు.