హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ప్రీమియం సూపర్ బైకులు ఇవే

ఒకప్పుడు ఖరీదైన బైకు అంటే రాయల్ ఎన్ ఫీల్డే గుర్తుకు వచ్చేది. కానీ, నేడు ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల ప్రీమియం బైకులు దేశీయ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకుంటూ చెప్పుకోతగ్గ సంఖ్యలో బైకులను అమ్ముకుంటున్నాయి. వీటిలో ఎక్కువగా విక్రయమవుతున్న ప్రీమియం బైకులు ఇవే...


టాప్ - 5
గత ఆర్థిక సంవత్సరం (2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకు)లో 8,696 సూపర్ బైక్స్ విక్రయాలు నమోదయ్యాయి. సూపర్ బైక్స్ అంటే ఇంజన్ సామర్థ్యం 500సీసీ, అంతకంటే ఎక్కువ ఉండి, రూ.5 లక్షలకు పైగా ధర ఉన్న బైకులు. వీటిలో అగ్ర స్థానంలో నిలిచింది హార్లే డేవిడ్స్ సన్ స్ట్రీట్ 750. ఈ మోడల్ బైకులు 2,113 యూనిట్లు గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత డీఎస్ కే బెనెల్లి టీఎంటీ 600ఐ. ఈ బైక్ 640 యూనిట్లు అమ్ముడుపోయాయి. 474 వాహన విక్రయాలతో హార్లే డేవిడ్సన్ ఐరన్ 883 మోడల్ మూడో స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఉన్నది కవాసకి నింజా 650 మోడల్. ఈ వాహనం 458 యూనిట్లు విక్రయమయ్యాయి. ట్రింఫ్ స్ట్రీట్ ట్విన్ 237 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానంలో ఉంది.

మరీ ముఖ్యంగా 1,000సీసీ నుంచి 1,600సీసీ లోపు బైక్స్ విక్రయాలు పెరగడం ఆసక్తికరం. అదే సమయంలో 800సీసీ నుంచి 1,000 సీసీ మధ్యనున్న మోడళ్ల విక్రయాలు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే తగ్గాయి. ట్రింఫ్ మోటారు సైకిళ్లకూ ఆదరణ పెరిగింది. ట్రింఫ్ స్ట్రీట్ ట్విన్ ఐదో స్థానంలో ఉంటే, ఈ కంపెనీకే చెందిన టైగర్ 800 మోడల్ 216 బైకుల విక్రయాలతో గత ఆర్థిక సంవత్సరంలో ఆరో స్థానంలో ఉంది. సుజుకి హయబుస 209 యూనిట్ల విక్రయాలతో ఏడో స్థానంలో నిలిచింది.  

హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750
సూపర్ బైక్ మార్కెట్లో లీడర్ నిస్సందేహంగా హార్లే డేవిడ్సనే. ఎందుకంటే టాప్ - 5 సూపర్ బైక్స్ లో రెండు హార్లే మోడళ్లే ఉన్నాయి. అందులో స్ట్రీట్ 750 ఒకటి కాగా, ఐరన్ 883 రెండోది. స్ట్రీట్ 750 ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర 4.98లక్షలు. లిక్విడ్ కూల్డ్ 749సీసీ వీ ట్విన్ ఇంజన్ ఇందులో ఉంటుంది. 3,750 ఆర్పీఎం వద్ద 59 ఎన్ఎం టార్క్యూ విడుదల అవుతుంది. 8,000 ఆర్పీఎంతో 53 బీహెచ్ పీ శక్తి గలది. గరిష్ట వేగం 200 కిలోమీటర్లు. పెట్రోల్ తో నడిచే ఈ బైక్ ఒక లీటర్ ఇంధనంతో 17 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఆరు గేర్లు, డిస్క్ బ్రేకులు, టెలిస్కోపిక్ ఫోర్క్స్, గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జార్బర్లు ఫీచర్లున్న దీని బరువు 223 కిలోలు.

డీఎస్ కే బెనెల్లి టీఎంటీ 600 ఐ 
ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.5.82 లక్షలు. మొదటి సారి సూపర్ బైక్ నడిపేవారికి అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందని చెబుతారు. ఇన్ లైన్ ఫోర్, లిక్విడ్ కూల్డ్ 600సీసీ ఇంజన్, 11,500 ఆర్పీఎంతో 85 బీహెచ్ పీ సామర్థ్యం ఉన్నది. గరిష్ట వేగం గంటకు 230 కిలోమీటర్లు.  మైలేజీ లీటర్ కు 18 కిలోమీటర్లు. ఆరు గేర్లు, డిస్క్ బ్రేకులు, హైడ్రాలిక్ మోనోషాక్ అబ్జార్బర్లు ఉన్న ఈ బైక్ బరువు 231 కిలోలు.

హార్లే డేవిడ్సన్ ఐరన్ 883
ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.8 లక్షలు పైన ఉంది. మైలేజీ లీటర్ కు 17 కిలోమీటర్లు. ఇంజన్ సామర్థ్యం 883సీసీ. రెండు సిలిండర్లతో గరిష్ట శక్తి సామర్థ్యం 5,500 ఆర్పీఎం వద్ద 50 బీహెచ్ పీ. గరిష్ఠ వేగం 200 కిలోమీటర్లు. పెట్రోల్ తో నడిచే ఈ మోడల్ లో  డిస్క్ బ్రేకులు, ఐదు గేర్లున్నాయి. బరువు 247 కిలోలు.

కవాసకి నింజా 650
లాంగ్ డ్రైవ్ కు అనువైనది. 649 సీసీ పారల్లెల్ ట్విన్ ఇంజన్ గలదు. ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.5.69 లక్షలు. డిస్క్ బ్రేకులు, అలాయ్ వీల్స్, ఆరు గేర్లు, సింగిల్ ఆఫ్ సెట్ లేడౌన్ షాక్ అబ్జార్బర్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ స్టార్ట్, తదితర ఫీచర్లున్నాయి. గరిష్ట వేగం 212 కిలోమీటర్లు. లీటర్ పెట్రోల్ తో 21 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.  

ట్రింఫ్ స్ట్రీట్ ట్విన్
ఈ కంపెనీలో ఇది ప్రారంభ మోడల్. ఎక్స్ షోరూమ్ ధర రూ.7 లక్షలు. 900సీసీ సామర్థ్యం గలది. లిక్విడ్ కూల్డ్, పారల్లెల్ ట్విన్ ఇంజన్ గలదు. అల్యూమినియం సిల్వర్, క్రాన్ బెర్రీ రెడ్, మ్యాటె బ్లాక్, జెట్ బ్లాక్ తదితర రంగుల్లో లభిస్తోంది. ఐదు గేర్లు, డిస్క్ బ్రేకులు, క్రోమ్డ్ స్ప్రింగ్ ట్విన్ షాక్స్ ఉన్నాయి. గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. బైక్ బరువు 230 కిలోలు. లీటర్ పెట్రోల్ ఇంధనంపై మైలేజీ 27 కిలోమీటర్లు.

ట్రింఫ్ టైగర్ 800ఎక్స్ సీ
ఇందులో 800సీసీ సామర్థ్యంగల ఇంజన్ ఉంది. గరిష్ట వేగం 210 కిలోమీటర్లు. డిజటల్ టాకోమీటర్, ఆరు గేర్లు, డిస్క్ బ్రేకులు, లీటర్ పెట్రోల్ కు 21 కిలోమీటర్ల మైలేజీ, షోవా మోనోషాక్ హైడ్రాలిక్ అడ్జస్టబుల్ షాక్స్, నిర్వహణ రహిత బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి. బండి బరువు 213 కిలోలు.

సుజుకి హయబుస
హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధర రూ.16 లక్షలు సుమారు. ఇంజన్ సామర్థ్యం 1340సీసీ, నాలుగు సిలిండర్లున్నాయి. గరిష్ట వేగం 312 కిలోమీటర్లు. అనలాగ్ టాకో మీటర్, ఆరు గేర్లు, డిస్క్ బ్రేకులు, లింక్ టైప్ కాయిల్ స్ర్పింగ్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. లీటర్ కు మైలేజీ 17 కిలోమీటర్లు. వాహన బరువు 266 కిలోలు.  

ఇవి కూడా...
బైక్ ప్రియులు నచ్చే సూపర్ బైక్ లో కవాసకి జెడ్ 800 కూడా ఒకటి. దీని ధర సుమారు రూ.8 లక్షలు. లీటర్ పెట్రోల్ పై 16 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. 800సీసీ ఇంజన్, ఆరుగేర్లు ఉన్నాయి. డుకాటి పనిగేల్ 959కూడా పాప్యులర్ సూపర్ బైక్స్ లో స్థానం సంపాదించుకున్నదే. దీని ధర రూ.14 లక్షలు. ఈ బైక్ ఇంజన్ సామర్థ్యం 955సీసీ. లీటర్ పెట్రోల్ పై 17 కిలోమీటర్ల మైలేజీనిస్తోంది. డిస్క్ బ్రేకులు, ఆరు గేర్లు, డిస్క్ బ్రేకులు ఉన్నాయి. గరిష్ట వేగం 264 కిలోమీటర్లు. వాహన బరువు 195 కిలోలు.


More Articles