మీ ఆధార్ డేటా భద్రంగా ఉందా...? దుర్వినియోగం కాకుండా ఇలా లాక్ చేసుకోండి...!
ఆధార్ నేడు అన్నింటికీ ఆధారమైన అత్యంత ముఖ్యమైన, విలువైన గుర్తింపు పత్రం. అందులోనూ ఈ మధ్య 'ఈ కేవైసీ' అంటూ ఎలక్ట్రానిక్ రూపంలోనే మన ఆధార్ వివరాలు ఇచ్చే వ్యవస్థ వచ్చేసింది. ఇంతటి ముఖ్యమైన ఆధార్ వివరాలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పడితే? లేని పోని సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఆధార్ ను చాలా భద్రంగా చూసుకోవాలి. అదెలాగన్నది చూద్దాం...
ఆధార్ వివరాలు చాలా గోప్యంగా ఉంచడం ఎంతో అవసరం. చాలా మంది వ్యక్తుల ఆధార్ వివరాలు లీకయ్యాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టులోనూ కేసు విచారణ నడుస్తోంది. వ్యక్తి గోప్యత హక్కులో భాగంగా ఆధార్ వివరాల్ని చూడాలని, వాటిని లీక్ కాకుండా చూడాలన్నదే ఆ పిటిషన్ సారాంశం. ఈ నేపథ్యంలో టెక్నాలజీ యుగంలో విలువైన ఎలక్ట్రానిక్ ఆధార్ వివరాలు దుర్వినియోగం కాకుండా, వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం.
ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న సమయంలో మన వేలి ముద్రలు, కంటి పాపలను స్కాన్ చేయడం గుర్తుండే ఉంటుంది. మన వ్యక్తిగత వివరాలన్నింటికీ ఈ రెండే ప్రధాన గుర్తింపులు. వేలి ముద్రలు, కనుపాపలు అన్నవి ప్రతీ వారికీ విభిన్నంగా ఉంటాయి. ఒకరికి మరొకరితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవవు. అందుకే గుర్తింపునకు ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ కేవైసీ విధానంలో ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాత మన వివరాల్ని పొందేది వీటి ఆధారంగానే. బ్యాంకులు, టెలికం ఆపరేటర్లు ప్రస్తుతం ఈ కేవైసీ విధానాన్ని పాటిస్తున్నాయి.
ఈ కేవైసీ
ఆధార్ కు నమోదు చేసుకునే సమయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ మన పేరు, చిరునామా, పుట్టిన తేదీ, వయసు, జెండర్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ ఇలా సమస్త సమాచారంతోపాటు ఐరిస్ (కనుపాపలు), ఫింగర్ ప్రింట్స్ (వేలి ముద్రలు), వ్యక్తి ఫొటోను తీసుకుని తన డేటా బ్యాంకులో భద్రపరుస్తుంది. ఈ డేటాకు సంబంధించి ఆధార్ నంబర్ ను కేటాయిస్తుంది. ఈ డేటాలోని వివరాలను పొందేందుకు వేలి ముద్రలు, కనుపాపలే కీలకం.
బ్యాంకు ఖాతా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు జిరాక్స్ అవసరం లేదు. ఆధార్ నంబర్ కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ డేటా బ్యాంకులో ఉన్న మీ వివరాల్ని బ్యాంకు తీసుకుంటుంది. అంటే జిరాక్స్ కాపీకి బదులు, మీ ఆధార్ వివరాల్ని ఎలక్ట్రానిక్ రూపంలో బ్యాంకే స్వయంగా పొందుతుంది. ఇలా మన వివరాల్ని బ్యాంకు తీసుకునేందుకు వీలుగా వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని బ్యాంకులు ఇంకా ఈ విధానాన్ని ప్రారంభించలేదు. కొన్ని మాత్రం బయోమెట్రిక్ ఈ కేవైసీ విధానాన్ని మొదలు పెట్టేశాయి. బ్యాంకులు తమ దగ్గర చిన్న యంత్రాలను ఉంచుకుంటాయి. ఆ యంత్రంలో వేలిని ఉంచితే స్కాన్ చేసి ఆధార్ డేటాబేస్ లోని వేలిముద్రలతో సరిపోల్చి చూస్తుంది. మ్యాచ్ అయితే మీ వివరాలు బ్యాంకు డేటాలోకి షేర్ అవుతాయి. దీనివల్ల పేపర్ పత్రాల ఇబ్బందులు తప్పుతాయి.
అలాగే, కొత్తగా సిమ్ కార్డు తీసుకునేందుకు ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నంబర్ ఆధారంగా వేలి ముద్రలు తీసుకుని, ఆధార్ డేటాలోని మీ వివరాల్ని టెలికం సంస్థలు పొందుతాయి. ఆ వివరాల్ని తమ డేటాలో ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచుకుంటాయి. బ్యాంకు ఖాతా అయినా, మొబైల్ సిమ్ కార్డు అయినా, మరెక్కడైనా కానీయండి. ఈ కేవైసీ కోసం వేలిముద్రలు, కనుపాపలు ఇచ్చిన వెంటనే మీ మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. అలాగే, ఈ మెయిల్ కు సందేశం వస్తుంది. ‘‘ఈ కేేవైసీ ధ్రువీకరణ కోసం మీ ఆధార్ నంబర్ ను విజయవంతంగా ఫలానా చోట, ఫలానా సమయంలో ఇవ్వడం పూర్తయింది’’ అంటూ అందులో సమాచారం ఉంటుంది. మొబైల్ నంబర్ కూ ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ధ్రువీకరణ ఇవ్వకపోతే వెంటనే 1947కు కాల్ చేయాలని, [email protected] కు మెయిల్ చేయాలని అందులో సూచన ఉంటుంది.
దుర్వినియోగానికి అవకాశాలు
ఆధార్ జిరాక్స్ కాపీని ఇచ్చారనుకోండి. దాన్ని వేరొకరు జిరాక్స్ తీసుకుని వాడుకునేందుకు అవకాశం ఉంది. అదే ఈ కేవైసీలో భాగంగా ఇచ్చే ఎలక్ట్రానిక్ ఆధార్ దుర్వినియోగం అయ్యేందుకు అవకాశం లేదా...? అంటే ఉందనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేవైసీలో భాగంగా వేలి ముద్రలు ఇస్తాం. ఆ వేలిముద్రలను స్కాన్ చేసే యంత్రం కంప్యూటర్ కు కనెక్ట్ చేసి ఉంటుంది. ఈకేవైసీ ఆథెంటికేషన్ కోసం తీసుకునే వేలిముద్రలను కాపీ చేసుకుని రహస్యంగా భద్రపరిచి కస్టమర్ వెళ్లిన తర్వాత వాటిని ఆథెంటికేషన్ కోసం దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. అందుకే, ఇలా లీకయ్యేందుకు, దుర్వినియోగానికి అవకాశం లేకుండా యూనిక్ ఐడెంటిఫకేషన్ అథారిటీ లాక్, అన్ లాక్ సదుపాయాలను తీసుకొచ్చింది.
లాక్, అన్ లాక్
ఎంతో విలువైన వ్యక్తిగత డేటా కనుక దుర్వినియోగం జరగకుండా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ లాక్, అన్ లాక్ సదుపాయాల్ని ప్రవేశపెట్టింది. ఆన్ లైన్ ద్వారా ఈ సదుపాయాల్ని వినియోగించుకోవచ్చు. మీ బయోమెట్రిక్ వివరాల్ని లాక్ చేశారనుకోండి. వేలిముద్రలు, కనుపాపల్ని ఆథెంటికేషన్ కోసం మీతోపాటు ఇతరులు ఎవరూ వాడుకునేందుకు అవకాశం ఉండదు. తిరిగి వాడుకోవాలనుకుంటే మీరు స్వయంగా ఆన్ లాక్ చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ సదుపాయం ఉన్నవారికే ఈ అవకాశం. ఇందుకోసం ఆథార్ డేటా బేస్ లో మీ మొబైల్ నంబర్ కూడా నమోదై ఉండాలి. నమోదు అయిలేకపోతే ముందుగా ఆథార్ నంబర్ కు మొబైల్ నంబర్ ను లింక్ చేసుకోవాలి. ఎందుకంటే లాక్, అన్ లాక్ చేసే సమయంలో వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) మీ మొబైల్ నంబర్ కు వస్తుంది. ఈ ఓటీపీ ఇస్తేనే లాక్, అన్ లాక్ అవుతుంది. మొబైల్ నంబర్ నమోదు చేసుకునేందుకు సమీపంలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లి దరఖాస్తు ఇస్తే సరిపోతుంది.
ఒక్కసారి ఇలా లాక్ చేసిన తర్వాత మీ ఆథార్ కు భద్రత లభించినట్టే. ఆథార్ వివరాలు కావాల్సినప్పుడు అన్ లాక్ చేయడం, వివరాలను ఇచ్చిన వెంటనే అన్ లాక్ చేసుకుంటుండాలి. అన్ లాక్ చేసిన 10 నిమిషాలకు ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. ఎందుకంటే మీరు మరిచిపోయినా మీ కార్డు వివరాలు భద్రంగా ఉండేందుకు దీన్ని ఇలా సెట్ చేశారు. ఒకసారి మీరు లాక్ చేశారంటే ఇక ఆపై ఎప్పుడైనా టెంపరర్లీ అన్ లాక్ మాత్రమే చేయగలరు. వద్దనుకుంటే లాకింగ్ సిస్టమ్ ను డేజేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.లాకింగ్ వల్ల ఉపయోగం ఏమిటంటే మీరు మొబైల్ సిమ్ కార్డు కోసం ఆథార్ ఈ కేవైసీ ఇచ్చారనుకోండి. మీ వేలి ముద్రల సాయంతో మీ వివరాలను తీసుకుంటారు. ఇలా వేలిముద్రలను అక్కడుంటే ఏజెంట్లు ఒకవేళ మీకు తెలియకుండా కాపీ చేసి పెట్టుకుని తర్వాత వినియోగించుకుందామనుకుంటే వారి దొంగ యత్నాలు చెల్లవు. ఎందుకంటే వెంటనే మీరు మీ కార్డును లాక్ చేసేస్తారు గనుక. లాక్ చేస్తే, కాపీ చేసుకున్న మీ వేలిముద్రల సాయంతో మీ వివరాల్ని పొందుతామనుకుంటే తిరిగి అన్ లాక్ చేయాలని అడుగుతుంది.
ఆథార్ కార్డు లాక్ చేయడం ఇలా...
ఆథార్ లాక్ సదుపాయం కోసం https://resident.uidai.gov.in/biometric-lock# ఈ లింక్ ను సందర్శించాలి. అనంతరం అక్కడ ఆథార్ నంబర్ బాక్స్ లో ఆథార్ నంబర్ ను పేర్కొని, కిందనున్న ఎంటర్ సెక్యూరిటీ కోడ్ కాలమ్ లో పక్కన కనిపించే నాలుగంకెలను టైప్ చేసి కింద ‘సెండ్ ఓటీపి’ని ఓకే చేయాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని పక్కనున్న ఓటీపీ బాక్స్ లో ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీ 30 నిమిషాల పాటే చెల్లుబాటు అవుతుంది. ఆలోపే దాన్ని ఓటీపీ బాక్స్ లో ఇచ్చి లాగిన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వచ్చే పేజీలో ఎంటర్ సెక్యూరిటీ కోడ్ బాక్స్ లో పక్కన కనిపించే నాలుగంకెలను ఎంటర్ చేసి ‘ఎనేబుల్’ బటన్ ను క్లిక్ చేయాలి. దాంతో ‘అభినందనలు. మీ బయోమెట్రిక్ లాక్ అయింది’ అంటూ సందేశం కనిపిస్తుంది.
అన్ లాక్
ఆథార్ కార్డును లాక్ చేసిన తర్వాత, ఎక్కడైనా ఈకేవైసీ కింద ఆథార్ వివరాలు ఇవ్వాలంటే ముందు అన్ లాక్ చేసుకోవాలి. ఇందుకోసం https://resident.uidai.gov.in/biometric-lock# ఈ లింక్ సాయంతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ సైట్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఆథార్ నంబర్ బాక్స్ లో ఆథార్ నంబర్ ను ఇచ్చిన తర్వాత, కింద బాక్స్ లో దాని పక్కన కనిపించే సెక్యూరిటీ కోడ్ ను నమోదు చేయాలి. సెండ్ ఓటీపీ బటన్ ను క్లిక్ చేయాలి. మీ మొబైల్ కు వచ్చే ఓటీపీని పక్కన కనిపించే బాక్స్ లో ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి. తర్వాత పేజీకి వెళుతుంది. అక్కడ కనిపించే బాక్స్ లో పక్కనే కనిపిస్తున్న నాలుగంకెల సెక్యూరిటీ కోడ్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికింద కనిపించే అన్ లాక్ బటన్ ను ఓకే చేయాల్సి ఉంటుంది. దాంతో అది అన్ లాక్ అయిపోతుంది. ఇది 10 నిమిషాల పాటే అన్ లాక్ అయి ఉంటుందని గుర్తుంచుకోండి. ఆ లోపే ఆథార్ ఆథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పది నిమిషాల తర్వాత ఆటోమేటిక్ గా లాక్ అయపోతుంది. కావాలంటే మరోసారి అన్ లాక్ చేసుకోవాల్సిందే.
ఇక్కడ డిజేబుల్ అనే మరో ఆప్షన్ గమనించే ఉంటారు... అన్ లాక్ చేసుకునే సమయంలో అన్ లాక్ బటన్ పక్కన డిజేబుల్ బటన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ లాకింగ్ సదుపాయం పూర్తి స్థాయిలో వద్దనుకుంటే అప్పడు డిజేబుల్ ఆప్షన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాంతో మీ ఆధార్ వివరాలు దుర్వినియోగానికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది.