నామినేషన్ చాలా ముఖ్యం... ఈ యాప్ వేసుకోండి... నామినీలకు అదే కబురు పెడుతుంది!

పెట్టుబడి ఏదైనా, నామినేషన్ ఇవ్వడం నేడు చాలా కీలకంగా మారింది. ఆర్థిక వ్యవహారాల్లో నామినీకి చాలా ప్రాధాన్యం ఉంది. ఒక వ్యక్తి తదనంతరం (మరణించిన తర్వాత) అతని పేరిట ఉన్న ఆస్తులన్నింటినీ క్లెయిమ్ చేసి, వాటిని చట్టబద్ధమైన హక్కులు కలిగిన వారసులకు పంపిణీ చేసే బాధ్యతలను నామినీ (నియమించబడిన)గా పేర్కొన్న వ్యక్తి చూస్తారు. నామినీ ఉంటే అతని కుటుంబ సభ్యులు నిశ్చింతగా ఉండొచ్చు. లేదంటే క్లెయిమ్ సమయంలో వ్యయ ప్రయాసలతో పాటు సమయం వృధా అవుతుంది.


representational imageబ్యాంకులు, జీవిత బీమా సంస్థలు, పోస్టాఫీసు, ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం, ఆదాయపన్ను శాఖ, మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఆర్థిక సంస్థల వద్ద రూ.35,000 కోట్లు నిరర్థకంగా పడి ఉన్నాయి. గడువు తీరిన ఫిక్స్ డ్ డిపాజిట్లు, పీపీఎఫ్ బ్యాలన్స్ లు, బీమా పాలసీ గడువు తీరిన తర్వాత తీసుకోని మెచ్యూరిటీ మొత్తం, మ్యూచువల్ ఫండ్స్, కంపెనీలు ప్రకటించిన డివిడెండ్ల రూపంలో ఈ నిధులు మూలుగుతున్నాయి. ఒక్క ఎల్ఐసీ వద్దే క్లెయిమ్ చేయని నిధులు రూ.5,000 కోట్ల వరకూ ఉన్నాయంటే ఆశ్చర్యపోక మానదు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ వద్ద ఇలా క్లెయిమ్ చేయని నిధులు రూ.27,000 కోట్లు ఉన్నాయి.

ఎన్నో కారణాలు
ఇన్ని వేల కోట్ల రూపాయలు అలా ఆర్థిక సంస్థల దగ్గరే ఉండిపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. తమ పెట్టుబడులు, బీమా పాలసీల విషయంలో నామినేషన్ ఇవ్వకపోవడం, నామినేషన్ ఇచ్చినా ఆ వివరాలను నామినీలకు చెప్పకపోవడం... ఈ తరహా వ్యక్తులు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు పెట్టుబడుల వ్యవహారాలు తెలియక క్లెయిమ్ చేయకపోవడం వంటి వివిధ కారణాలున్నాయి.

కొంత మంది ఎప్పటికప్పుడు నామినేషన్ వివరాలను అప్ డేట్ చేస్తుంటారు. కొందరు ముందు చూపుతో విల్లు కూడా రాస్తుంటారు. దీనివల్ల వారి తదనంతరం పెట్టుబడులు, ఆర్థిక ప్రయోజనాల క్లెయిమ్ సులభతరమవుతుంది. అందుకే పెట్టుబడులకు సంబంధించి అన్ని వివరాలు, నామినీగా ఎవరి పేరును రిజిస్టర్ చేశారో ఆ వివరాలను ఓ రికార్డుగా భద్రపరచాలి. దాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలి.

representational imageఈ పని చేసి పెట్టే యాప్స్ ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ ప్రపంచం. అన్నింటికీ ఆదే కీలకంగా మారిపోతోంది. ఈ క్రమంలో పెట్టుబడులు, పాలసీలు, ఇతర ఆర్థిక సాధనాలు, వాటికి సంబంధించిన నామినీల వివరాలను భద్రపరచుకునేందుకు యాప్స్ కూడా వచ్చేశాయి. వీటిలో నామినీ యాప్ మొబైల్ అప్లికేషన్ కూడా ఒకటి. మీ ఆర్థిక విషయాలను నామినీలతో అనుసంధానిస్తుంది. ఉదాహరణకు బ్యాంకులో ఎఫ్ డీ చేశారు. నామినీగా ఎవరిని సూచించారో వారికి మీ డిపాజిట్ వివరాలను ఈ యాప్ సాయంతో షేర్ చేసుకోవచ్చు. అలాగే, టర్మ్ పాలసీ తీసుకున్నారనుకోండి. నామినీగా జీవిత భాగస్వామిని పేర్కొంటే... అప్పుడు ఈ యాప్ లో ఆ టర్మ్ పాలసీ నంబర్, కంపెనీ పేరు, ఇతర వివరాలను భద్రపరుచుకోవడమే కాకుండా ఆ వివరాలను మీ జీవిత భాగస్వామికి యాప్ ద్వారా పంపుకోవచ్చు. ఇందులో బీమా సంస్థ పాత్ర ఉండదు.

నామినీ యాప్ లో ప్రొడక్ట్స్, నామినీస్, నామినేటెడ్ ప్రొడక్ట్స్ పేరుతో విభాగాలు ఉన్నాయి. ప్రొడక్ట్స్ లో పెట్టుబడుల వివరాలను సేవ్ చేసుకోవచ్చు. ఇందులో ఖాతాలు, డిపాజిట్లు, ఇన్సూరెన్స్, రుణాలు, పెట్టుబడులు, ప్లాన్లు, స్కీములు, ప్రైవేటు లావాదేవీలు, మిస్ లేనియస్ అంటూ వివిధ కేటగిరీలున్నాయి. బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లలో సేవింగ్స్, కరెంటు ఖాతాలు, ఫిక్స్ డ్ డిపాజిట్, బ్యాంకు లాకర్, డీమ్యాట్ ఖాతా ఇలాంటి వివరాలన్నీ నమోదు చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ విభాగంలో టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా పాలసీ, హెల్త్ పాలసీ, మోటారు వాహన బీమా పాలసీ వివరాలు భద్రపరచుకోవచ్చు. రుణాల విభాగంలో హోమ్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ తదితర వివరాలను, పెట్టుబడుల్లో మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఈపీఎఫ్ వివరాలు, ప్లాన్లు, స్కీముల్లో చిట్ ఫండ్స్, చిన్నారుల పేరిట ప్లాన్ల వివరాలు సేవ్ చేసుకోవచ్చు. ప్రైవేటు ట్రాన్సాక్షన్స్ అంటే వ్యక్తిగతంగా ఒకరి వద్ద తీసుకున్న రుణం.

representational image
నమోదు ఎలా...?
యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత పైన చెప్పుకున్న ఏ ఉత్పాదనల వివరాలను అయినా ఆయా కేటగిరీల్లో సేవ్ చేసుకోవచ్చు. ఇందు కోసం యాడ్ నామినీని ఓకే చేసుకోవాలి. నామినీ పూర్తి పేరు, వారితో ఉన్న అనుబంధం, నామినీ ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, కావాలంటే గార్డియన్ వివరాలూ ఇచ్చుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ నుంచి ఫైనాన్షియల్ ఉత్పత్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా యాప్ లోకి అప్ లోడ్ చేసుకోవచ్చు. అంటే గూగుల్ డ్రైవ్ లో మీ బీమా పాలసీ పత్రాలున్నాయనుకోండి. వాటిని అప్ లోడ్ చేసుకోవచ్చు.  నిబంధనల ప్రకారం మీకు సంబంధించిన యాప్ లోకి అప్ లోడ్ చేసే ఏ డాక్యుమెంట్ గానీ, కీలక సమాచారం గానీ ఇతరులు పొందరు. కేవలం ఫైల్ నంబర్ సమాచారాన్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి నామినీ వివరాలను నమోదు చేసిన తర్వాత నామినీకి ఆ వివరాలు ఎస్ఎంఎస్, మెయిల్ రూపంలో వెళతాయి. ఈ సమయంలో మీరు ఏ ఉత్పాదనకు సంబంధించి నామినీ వివరాలు ఇచ్చారో అవన్నీ షేర్ చేయడం జరగదు. ప్రాథమిక వివరాలు మాత్రమే అందించడం జరుగుతుంది.

representational imageమార్పులు....
నామినీ వివరాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. కొత్తగా మరొకరిని నామినీగా నియమించుకోవచ్చు. అప్పుడు పాత నామినీకి తమ పేరును తొలగించినట్టు సమాచారం కూడా వెళుతుంది. కానీ, కొత్తగా ఎవర్ని నామినీగా నియమించింది వారికి తెలియజేయరు. యాప్ లో సేవ్ చేసిన ప్రొడక్ట్స్ ను కూడా కావాలనుకున్నప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. నామినీ కూడా ఇదే యాప్ వాడుతుంటే ఈ సమాచారం వారికి కూడా చేరవేస్తారు. నామినీ వివరాలన్నీ నామినేటెడ్ ప్రొడక్ట్స్ విభాగంలో ఉంటాయి. బీమా ప్రీమియం చెల్లించాల్సిన గడువు తేదీని ఇస్తే ముందుగా అప్రమత్తం కూడా చేస్తుంది. దీంతో ఈ యాప్ ఉండడం వల్ల అన్ని ఆర్థిక సాధనాల వివరాలు, నామినీ వివరాలు ఒక్కచోటే అందుబాటులో ఉంటాయి. కాకపోతే నామినీ యాప్ ను వాడే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ ను తప్పకుండా చదివి, ఆమోదయోగ్యమా, కాదా అన్నది నిర్ణయించుకోవాలి.

బ్యాంకు ఖాతాలకు నామినేషన్ ఎలా?
ఖాతాదారుడు మరణించిన తర్వాత అతని ఖాతాలో ఉన్న నగదు, లాకర్లు, అందులో ఉంచిన వాటిని నామినీకి ఇవ్వాలంటే ఎవరో ఒకర్ని నామినీగా పేర్కొనాల్సి ఉంటుంది. వారసత్వపు ధ్రువీకరణ పత్రాలు, కోర్టు ఆర్డర్ కాపీలు ఈ విధమైన తలనొప్పులన్నీ వద్దనుకుంటే నామినీ వివరాలను నమోదు చేసుకోవాలి. ఇందుకోసం ఫామ్ డీఏ1 ఉంటుంది. బ్యాంకు బ్రాంచ్ నుంచి లేదా ఆన్ లైన్ లో బ్యాంకు వెబ్ సైట్ నుంచి అయినా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అందులో ఖాతాదారుని వివరాలు, డిపాజిట్ వివరాలు, నామినీ వివరాలను పేర్కొనాలి. దానిపై ఖాతాదారుడు సంతకం చేయాలి. జాయింట్ అకౌంట్ అయితే అందరూ సంతకం చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాకు ఒక్క నామినీనే సూచించడానికి అవకాశం ఉంది. కాకపోతే వివిధ ఖాతాలకు, వివిధ వ్యక్తులను నామినీగా పేర్కొనవచ్చు.

నామినేషన్ తొలగింపు
బ్యాంకు రికార్డుల్లో ప్రస్తుతం ఉన్న నామినీ వివరాలను తొలగించాలంటే అందుకు ఫామ్ డీఏ2ను ఇవ్వాల్సి ఉంటుంది.


More Articles