బంగారం ఎందుకు... బంగారం లాంటి బాండ్ ఉండగా...!

భారతీయులకు బంగారం అంటే ఎంతో ప్రీతి, మక్కువ. ఏ మతంతోనూ సంబంధం లేకుండా ప్రతీ ఇంట్లోనూ బంగారం మాత్రం తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఆభరణాల రూపంలో దీన్ని ధరించేందుకు ఇష్టపడని వారుండరు. అందుకే మన దేశంలో బంగారానికి అంత డిమాండ్. ఈ డిమాండ్ ఎప్పుడూ తగ్గిన సందర్భం లేదు. బంగారం అంటే కేవలం ఆభరణాలే కాదు, పెట్టుబడులకు ఓ ఆకర్షణీయ సాధనంగా భావించి, దీనిపై పెట్టుబడి పెట్టేవారు కూడా ఉన్నారు. ఇటువంటి వారి కోసమే భారత ప్రభుత్వం సార్వభౌమ గోల్డ్ బాండ్లను తీసుకొచ్చింది.


మనదేశంలో ఏటా 300 టన్నుల బంగారం అమ్ముడవుతోంది. మరి ఇదంతా ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నదే. వీటిని తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వ ధ్యేయం. పెట్టుబడి కోసం బంగారాన్ని కొనడాన్ని నివారించి, ఆ పెట్టుబడులను బంగారం బాండ్లపైకి మళ్లించే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ఆవిష్కరించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్ బీఐ వీటిని జారీ చేస్తుంది. వీటికి భారత ప్రభుత్వ హామీ ఉంటుంది. ఈ అవకాశం కేవలం దేశ ప్రజలకే. విదేశాల్లోఉంటున్న వారు కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా ఒక గ్రాము బంగారం, గరిష్టంగా 500 గ్రాముల బంగారం బాండ్లనే కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. డీమ్యాట్ రూపంలో లేదంటే పేపర్ రూపంలో బాండ్లను కలిగి ఉండొచ్చు.

ఏటా పలు మార్లు పరిమిత రోజుల పాటే బాండ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎనిమిది విడతలు బంగారం బాండ్ల జారీని ప్రభుత్వం పూర్తి చేసింది. ఎప్పుడూ కాకుండా అప్పుడప్పుడూ కొత్త బంగారం బాండ్లను ప్రభుత్వం విక్రయానికి ఉంచుతోంది. ఇష్యూ సమయంలో మార్కెట్  ధరల ఆధారంగా గ్రాము బంగారం బాండ్ ధరను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. బంగారం బాండ్లను అన్ని వాణిజ్య బ్యాంకులు,  ఎన్ బీఎఫ్ సీ సంస్థలు, పోస్టాఫీసుల నుంచి కొనుగోలు చేయవచ్చు. స్టాక్ బ్రోకింగ్ సంస్థలు కూడా వీటిని కొనేందుకు వీలు కల్పిస్తున్నాయి. ఆన్ లైన్ లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల వెబ్ సైట్లకు వెళ్లి అక్కడి నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. బాండ్ల కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఐదు, ఆరు, ఏడవ ఏట చివర్లో బాండ్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. స్టాక్ ఎక్సేంజ్ లలో ఈ బాండ్లు ట్రేడవుతుంటాయి. ఇక్కడే విక్రయం, కొనుగోలు చేసుకోవచ్చు. డీమ్యాట్ ఖాతాలో ఉంటాయి గనుక డబ్బులు అత్యవసరమైతే వేరే వారికి విక్రయించి వారి ఖాతాకు బంగారాన్ని ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. ఈ బాండ్లను డీమ్యాట్ రూపంలో కలిగి ఉండేందుకు వీలుంది.

representational imageఅనుకూలతలు
ఈ బాండ్లను రుణాలకు హామీగా ఉంచుకోవచ్చు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రుణాలు పొందే వెసులుబాటు ఉంటుంది. బంగారంపై రుణాలకు ఏ నిబంధనలు వర్తిస్తాయో వీటికీ అంతే. పెట్టుబడుల కోసం బంగారాన్ని ఎంచుకునే వారికి ఫిజికల్ బంగారానికి బదులు గోల్డ్ బాండ్లు నయమన్నది నిపుణులు సూచన. ఇందులో పెట్టుబడుల ద్వారా వచ్చే మూలధన లాభాలపై పన్ను వేయరు. పెట్టుబడి కోసం ఫిజికల్ గా బంగానాన్ని కొంటే దాన్ని దాచుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉంచితే రక్షణ ఉండదు. బ్యాంకు లాకర్ తీసుకుని అందులో ఉంచాలి. కానీ, బాండ్లను కొంటే ఈ విధమైన ఇబ్బందులు తప్పుతాయి. గడువు తీరిన తర్వాత బంగారం మార్కెట్ ధర ఎంతుంటే, ఆ మేరకు చెల్లింపులు జరుగుతాయి.

రెండు రకాలుగా అంటే బాండ్లను కొన్న తర్వాత బంగారం ధర పెరిగితే ఆ మేరకు తిరిగి చెల్లింపులు చేస్తారు. అలాగే, బాండ్లను జారీ చేసిన సమయంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై 2.75 శాతం వడ్డీని ఆరు నెలలకోసారి చెల్లిస్తారు. ఒక్కరే కాదు ఇతరులతో కలసి కూడా జాయింట్ గా బాండ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ బాండ్లను ఇతరులకు కానుకగా ఇవ్వొచ్చు. ఇతరుల పేరు మీదకు బదిలీ కూడా చేసుకునే అవకాశం ఉంది. నగదు, చెక్కులు, డీడీలు, ఎలక్ట్రానిక్ రూపంలో చెల్లింపుల ద్వారా బాండ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అయితే, నగదు చెల్లింపులకు రూ.20,000 వరకే పరిమితి ఉంది. గార్డియన్ లేదా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉన్న పిల్లల పేర్లపైనా వీటిని తీసుకోవచ్చు.

కేవైసీ పత్రాలు
బంగారం బాండ్ల కోసం కేవైసీ వివరాలను పూర్తి చేయడం తప్పనిసరి. కేవైసీ ఆధారాలుగా ఆధార్ కార్డు, పాన్ ఉంటే సరిపోతుంది.

రిస్క్
ఈ బాండ్లలో పెట్టుబడులకు, వడ్డీకి కూడా కేంద్ర ప్రభుత్వ హామీ ఉంది. కానీ, బంగారం రేట్లన్నవి మార్కెట్ పరిస్థితులపై ఆధారపడేవి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పతనమైతే అప్పుడు బాండ్ల విలువ కూడా తగ్గిపోతుంది. కనీసం 2 గ్రాములు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


More Articles