అది '24 గంటల' కడుపునొప్పేమో... చెక్ చేసుకోండి!

కడుపులో చిన్న భాగం... అందులో తేడా వచ్చిందంటే ఎన్నో సమస్యలు మొదలవుతాయి. 24 గంటల కడుపు నొప్పి అని దీన్నే అంటుంటారు. పెద్ద పేగుకు తోకలా అనుసంధానమై ఉండే అపెండిక్స్ లో ఏర్పడే సమస్య, దాని పర్యవసనాలు, చికిత్స తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

representational imageఅపెండిసైటిస్ అంటే...?
అపెండిక్స్ లో పూడిక, బ్యాక్టీరియా కారణంగా అపెండిక్స్ లోపలి గోడలు వాచిపోవడం వల్ల ఏర్పడే సమస్యే అపెండిసైటిస్. అపెండిక్స్ అన్నది మూడున్నర అంగుళాల నుంచి నాలుగు అంగుళాల మేర పొడవు ఉండే ఓ చిన్న ట్యూబు. అపెండిక్స్ లోపలి పొరలు కొంత మ్యూకస్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ మ్యూకస్ పెద్ద పేగు మొదటి భాగం సెకమ్ లోకి ప్రవహిస్తుంటుంది. ఇది సెకమ్ లోకి పోకుండా ఆగిపోతే లేదా పెద్ద పేగులోని మలం అపెండిక్స్ లోకి ప్రవేశించినా అపెండిసైటిస్ సమస్యకు దారితీస్తుంది. అలాగే, ఏదేనీ కారణం వల్ల అపెండిక్స్ లో పూడిక ఏర్పడినప్పుడు లోపల ఉండే బ్యాక్టీరియా అపెండిక్స్ గోడలపై దాడి చేస్తుంది. దానివల్ల కూడా వాపు ఏర్పడి అపెండిసైటిస్ కు దారితీస్తుంది. అలాగే, కేన్సర్ లోనూ ఈ సమస్య రావచ్చు. అపెండిసైటిస్ సమస్యలో నూటికి 50 శాతం ఇతర లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. అవి... కడుపులో ఎక్కడైనా, వీపు భాగంలో నొప్పి తీవ్రంగా రావడం, మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, విసర్జన చేయలేకపోవడం, మలబద్ధకం, గ్యాస్, తిమ్మిర్లు వంటి సమస్యలు. వీటిలో ఏది కనిపించినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించాలి.

లక్షణాలు
అపెండిసైటిస్ ప్రారంభంలో ఆకలి తగ్గడం, వికారం, వాంతులు, ఆరోగ్యం బాగాలేదన్న భావన కనిపిస్తాయి. తర్వాత దశలో బొడ్డు సమీపంలో లేదా పొట్ట పైభాగంలో నొప్పి కొద్దిగా మొదలవుతుంది. అక్కడి నుంచి పొట్ట కింది భాగంలోకి పాకి, మరింత తీవ్రతరం అవుతుంది. కడుపు ఉబ్బరం (వాపు) కనిపిస్తుంది. జ్వరం 99 - 102 డిగ్రీల వరకు వస్తుంది. నొప్పి ఎక్కడని అడిగితే మొదట్లో బొడ్డు చుట్టూ ఉన్నట్టు చెబుతారు కానీ, కచ్చితంగా ఫలానా చోట అన్న స్పష్టత ఉండదు. నొప్పి మొదలైన తర్వాత 24 గంటల వ్యవధిలో తార స్థాయికి చేరుతుంది. అందుకే 24 గంటల కడుపునొప్పిగానూ దీన్ని చెబుతారు.

representational imageసమస్య నిర్ధారణ
అపెండిసైటిస్ సమస్యను ఎవరికి వారు స్వయంగా గుర్తించడం అన్నది కష్టమే. ఎందుకంటే మూత్రకోశ ఇన్ఫెక్షన్, గాల్ బ్లాడర్ సమస్యలు, క్రాన్స్ వ్యాధి, గ్యాస్ట్రిక్ సమస్య, పేగులో ఇన్ఫెక్షన్, ఓవరీ సమస్యల్లోనూ ఈ తరహా లక్షణాలు కనిపిస్తాయి. అపెండిక్స్ వాపును తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ లేదా సీటీ స్కానింగ్ పరీక్షలు... మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఉందా అన్నది నిర్ధారించుకునేందుకు గాను మూత్ర పరీక్ష, పురీష నాళ పరిశీలన, రక్తపరీక్షలు అవసరమవుతాయి. వీటితో సమస్య బయటపడుతుంది. వీటికంటే ముందు వైద్యులు శారీరక పరిశీలన ద్వారా ఓ అంచనాకు వస్తారు. అపెండిసైటిస్ ప్రారంభంలో తెల్లరక్త కణాలు సాధారణంగానే ఉంటాయి. కానీ, ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వీటి సంఖ్య పెరిగిపోతుంది. సమస్యను గుర్తించేందుకు ఇది కూడా ఉపయోగపడుతుంది. అపెండిసైటిస్ సమస్యలో మూత్రంలో ఎర్ర, తెల్ల రక్త కణాలు, బ్యాక్టీరియా కనిపిస్తాయి. అపెండిక్స్ కు ఇన్ఫెక్షన్, వాపు వస్తే అవి సమీపంలోనే ఉన్న యూరిన్ బ్లాడర్ కు విస్తరించే అవకాశం ఉంటుంది. కడుపు భాగాన్ని ఎక్స్ రే తీయించుకోవాలని కూడా వైద్యులు సూచించే అవకాశం ఉంది.

ఆలస్యం చేస్తే ప్రాణాంతకం
అపెండిసైటిస్ అన్నది వైద్యపరంగా సత్వరమే చికిత్స చేయాల్సిన సమస్య. అది కూడా దాదాపు చాలా కేసుల్లో సర్జరీ ద్వారా అపెండిక్స్ ను తొలగిస్తుంటారు. ఈ సమస్యకు ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ప్రామాణిక చికిత్స ఇదే. నిర్లక్ష్యం చేస్తే అపెండిక్స్ ట్యూబు పగిలిపోతుంది. లేదంటే చిల్లులు పడతాయి. దీంతో హానికారక పదార్థాలు ఉదరకోశంలోకి వెళ్లిపోతాయి. దీనివల్ల తీవ్రమైన వాపుతో కూడిన పెరిటోనైటిస్ అనే సమస్య ఏర్పడుతుంది. సత్వరమే శస్త్ర చికిత్స ద్వారా అపెండిక్స్ తొలగించకపోతే ప్రాణాంతకం అవుతుంది. సమస్య ఆరంభంలో గుర్తిస్తే సర్జరీ అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ ద్వారా సమస్యను నివారించొచ్చని కొన్ని పరిశోధనలు తేల్చి చెప్పాయి. అమెరికాలో దాదాపు అన్ని కేసుల్లో అపెండిక్స్ ను తొలగిస్తుండగా... యూరోప్ లో మాత్రం అపెండిక్స్ తీవ్రంగా లేని కేసుల్లో యాంటీబయోటిక్స్ తో చికిత్స చేస్తున్నారు.

representational imageఅపెండెక్టమీ
శస్త్రచికిత్సకు ముందే పెరిటోనైటిస్ సమస్య రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్స్ మాత్రలను ఇస్తారు. నాలుగు అంగుళాల కోత పెట్టి సర్జరీ చేయడం ఒక పద్ధతి. లాప్రోస్కోపీ విధానంలో (చిన్న ట్యూబులాంటి పరికరాన్ని, కెమెరాను పొట్టలోకి పంపి)నూ చికిత్స చేయవచ్చు. ఈ విధానంలో కడుపు వద్ద చిన్న గాటు పెట్టి లోపలికి ట్యూబును పంపడం వల్ల మైక్రో కెమెరా ద్వారా అపెండిక్స్ ను, సమీపంలోని ఇతర భాగాలను వైద్యులు స్పష్టంగా చూడగలరు. దాంతో అపెండిసైటిస్ సమస్య ఉందని తెలిస్తే లాప్రోస్కోపీ పరికరం ద్వారానే అపెండిక్స్ ను బయటకు తీస్తారు. కాకపోతే ఇందుకోసం లోకల్ గా మత్తుమందు ఇవ్వాల్సి వస్తుంది. సర్జరీ తర్వాత 12 గంటలకే లేచి అటూ ఇటూ కదలొచ్చు. సాధారణ దినచర్యలకు రావడానికి మాత్రం రెండు నుంచి మూడు వారాలు పడుతుంది. తర్వాత ఏ విధమైన జాగ్రత్తలు అవసరం లేదు.

నివారణ
అపెండిసైటిస్ సమస్య ఉందన్న అనుమానం ఉంటే ఫిజీషియన్ (ఎండీ)ను లేదా ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాలి. అపెండిసైటిస్ ఉందని గుర్తిస్తే సంబంధిత నిపుణులకు సిఫారసు చేస్తారు. అపెండిసైటిస్ రాకుండా నివారణ మార్గాలేవీ లేవు. కాకపోతే అధిక పీచు పదార్థాలను తినే వారిలో ఈ సమస్య తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు.

అపెండిక్స్ తో ప్రయోజనం ఉందా?
అపెండిక్స్ ట్యూబులోని గోడల్లో లింఫాటిక్ కణజాలం ఉంటుంది. ఇది మన శరీర రోగ నిరోధక వ్యవస్థలో భాగం. చిన్నారులు, వృద్ధుల్లో అపెండిక్స్ కీలక పాత్ర పోషిస్తుందన్న దానిపై స్పష్టత లేదు. యుక్త వయసులో ఉన్న వారికి మాత్రం రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. అపెండిక్స్ ను తొలగించడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వస్తాయన్న దాఖలాలు లేవు. ఇది లేకపోయినా నిక్షేపంలా జీవించొచ్చు. వాస్తవానికి దీన్ని ఉపయోగం లేని అవయవంగా భావిస్తుండగా... మంచి బ్యాక్టీరియాకు ఇది కేంద్రమని పలు పరిశోధనలు పేర్కొన్నాయి. ఎప్పుడైనా జీర్ణ వ్యవస్థ ఇన్ఫెక్షన్ బారిన పడితే ఆ తర్వాత దాన్ని రీబూట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపాయి.


More Articles