ఎయిర్ ప్యూరిఫయర్ నిజంగా అవసరమేనా?

స్వచ్ఛమైన ప్రాణవాయువు కరవవుతోంది. చుట్టూ ఉన్న గాలి కాలుష్యమయమే. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ఒకవైపు, పచ్చదనం తగ్గుతూ వెళ్లడం మరోవైపు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. కనీసం ఇంట్లో నాలుగ్గోడల మధ్య కూడా స్వచ్ఛమైన గాలి పీల్చుకునే పరిస్థితి లేదు. దీంతో కాలుష్యాలు  మనిషి ఆయువును తీసేస్తున్నాయి. మరి ఎయిర్ ప్యూరిఫయర్లు వీటికి పరిష్కారమేనా...? ఇవి స్వచ్ఛమైన గాలితో దీర్ఘాయువును ఇవ్వగలవా...? నిపుణులు ఏం చెబుతున్నారన్నది చూద్దాం.


ఇంటిలోపల గాలిలోని కాలుష్యాలను శుద్ధి చేసే పరికరమే ఎయిర్ ప్యూరిఫయర్. దుమ్ము, పుప్పొడి, వాయు కాలుష్యాలైన హైడ్రో కార్బన్లు, దుర్వాసనలను ఇది తొలగించగలదని వాటిని తయారు చేసే కంపెనీలు చెప్పే మాట. అలెర్జీ, ఆస్తమాతో ఇబ్బంది పడేవారికి వీటితో ఉపయోగమని చెబుతుంటారు. పొగతాగేవారి నుంచి వెలువడే పొగను సమర్థవంతంగా నిర్వీర్యం చేస్తుందని చెబుతారు.

పనితీరు ఇలా...
గాలి ఎయిర్ ప్యూరిఫయర్ లో ఉండే మూడు లేయర్ల ఫిల్టర్ల ద్వారా శుద్ధి అవుతుంది. మొదటి ఫిల్టర్ (ప్రీ ఫిల్టర్) పెద్ద పార్టికల్స్ ను ఆపేస్తుంది. మధ్యలో ఉండే కార్బన్ యాక్టివేటెడ్ ఫిల్టర్ వాయు సంబంధిత కాలుష్యాలను తొలగిస్తుంది. మూడోది హై ఎఫీషియన్సీ పార్టిక్యులేట్ అరెస్టెన్స్. ఈ ఫిల్టర్ అతి సూక్ష్మమైన పార్టిక్యులేట్స్ ను కూడా గ్రహిస్తుంది.

representational imageఎంత కచ్చితత్వం?
ఎయిర్ ప్యూరిఫయర్ల ఫలితాలను నిర్ధారించే శాస్త్రీయ పరిశోధనలు అధికారికంగా ఇంత వరకు నిర్వహించలేదని చెబుతారు. డిల్లీకి చెందిన పల్మనాలజిస్ట్ డాక్టర్ వివేక్ నాంజియా మాట్లాడుతూ... ఈ మెషిన్లు గాలిని శుభ్రం చేసే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ మౌలానా అజాద్ మెడికల్ కళాశాల సెంటర్ ఫర్ ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్ మెంటల్ హెల్త్ డైరెక్టర్ టీకే జోషి ఎయిర్ ప్యూపిఫయర్ల గురించి మాట్లాడుతూ... ‘‘వీటి ప్రయోజనాలు ప్రధానంగా పార్టిక్యులేట్స్ కే పరిమితమయ్యాయి. అయితే మరి కొన్ని ప్రయోజనాలు కూడా ఉండొచ్చు. వాటి గురించి చెప్పే ముందు మరింత శాస్త్ర సంబంధిత అధ్యయనాలు అవసరం’’ అని జోషి పేర్కొన్నారు.  

టెక్నాలజీలు...
ఎయిర్ ప్యూరిఫయర్లలో వివిధ రకాల టెక్నాలజీలు ఉన్నాయి. కొన్ని ఫొటోకేటలైటిక్ ఆక్సిడేషన్ లేదా లైట్ బేస్డ్ ట్రిగ్గర్లు, కొన్ని నెగెటివ్ అయాన్లను విడుదల చేయడం ద్వారా పాజిటివ్ గా చార్జ్ అయిన పార్టిక్యులేట్స్ ను గ్రహించడం చేస్తాయి. కొన్ని యూవీ రే టెక్నాలజీ, ఓజోన్ ఫిల్టరేషన్స్ తో పనిచేస్తాయి.

representational imageప్రతికూలతలు ఏవైనా ఉన్నాయా?
అయానిక్ ఎయిర్ ప్యూరిఫయర్లు ఓజోన్ ను ఉప ఉత్పత్తిగా విడుదల చేస్తాయి. మన వాతావరణంలో ఓజోన్ ఒక భాగమైనప్పటికీ ఇది ఊపరితిత్తులకు ఇబ్బంది కలిగిస్తుందని, గొంతులో ఇరిటేషన్ కు, ఛాతీలో అసౌకర్యానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. కొన్ని తయారీ సంస్థలు ఓజోన్ ఆరోగ్యానికి మంచివనే చెబుతున్నాయి. ఫిలిప్స్ అయితే అయానిక్ ఎయిర్ ప్యూరిఫయర్లను విక్రయించడం లేదు. అందుకే అయానిక్ ఎయిర్ ప్యూరిఫయర్లను కొనుగోలు చేసే ముందు తగినంత విచారించి నిర్ణయం తీసుకోవాలి. అదే సమయంలో అంతర్జాతీయంగా పలు అధ్యయనాలు సైతం ఎయిర్ ప్యూరిఫయర్లు గాలిని శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ప్రతికూల అయాన్లను, ఓజోన్ ను విడుదల చేస్తాయని వీటితో ఆరోగ్యానికి హాని అని పేర్కొన్నాయి. మన దేశంలో చాలా వరకు కంపెనీలు ఓజోన్ టెక్నాలజీని వాడుతున్నాయి. డాక్టర్ సీగెల్ మాత్రం ఓజోన్ ను విడుదల చేసే ఎయిర్ ప్యూరిఫయర్లను వాడొద్దనే సూచిస్తున్నారు. మనదేశంలో వీటికి సంబంధించిన ప్రమాణాలే లేవని ఆయన చెప్పారు.

ప్రమాణాలు, నియంత్రణలు కరవు
ఫిలిప్స్, యూరేకా ఫోర్బ్స్, స్విడిష్ కంపెనీ బ్లూ ఎయిర్ సంస్థల నుంచి రూ.10,000-75,000 మధ్య ధరల్లో ఎయిర్ ప్యూరిఫయర్లున్నాయి. వీటి విషయంలో అమెరికా, యూరోప్ మాదిరిగా మన దగ్గర నియంత్రణ లేదు. దీంతో అంతర్జాతీయ నియంత్రణ సంస్థల నుంచి తయారీ సంస్థలు గుర్తింపు పొందాల్సి వస్తోంది. అమెరికాలో ఈపీఏ, యూరోప్ లో అయితే పరిశ్రమ సంఘమైన యూరోపియన్ అలెర్జీ అసోసియేషన్ ఎయిర్ ప్యూరిఫయర్ల కచ్చితత్వాన్ని తెలుసుకునేందుకు కొన్ని ప్రమాణాలను నిర్వచించాయి. క్లీన్ ఎయిర్ డెలివరీ రేటు (సీఏడీఆర్) అంటే మెషిన్ ఎంత మేర గాలిని శుద్ధి చేసి విడుదల చేయగలదన్నది. అమెరికాకు చెందిన ఈపీఏ హెచ్ఈపీఏ ఫిల్టర్ ను ధ్రువీకరించింది. ఎందుకంటే ఇది మాత్రమే గాలిలోని 0.3 మైక్రోమీటర్ ఇన్ డయామీటర్ పార్టికల్స్ ను ఫిల్టర్ చేయగలదు. యూరోప్ లో హెచ్ఈపీఏ ఫిల్టర్లను 9 నుంచి 17 గ్రేడుల వరకు వర్గీకరించారు. ఎంత శాతం పార్టికల్స్ ను అవి గాలి నుంచి తొలగించగలవన్న దాని ఆధారంగా గ్రేడ్స్ ఇచ్చారు. ఇవి 85 నుంచి 99.999 శాతం వరకు పార్టికల్స్ ను తొలగించగలవు.

representational imageచాలా వరకు అంతర్జాతీయ అధ్యయనాలు ఎయిర్ ప్యూరిఫయర్ల వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటన్నవి కాకుండా వాయు నాణ్యతను కొంత మెరుగుపరుస్తాయని మాత్రమే పేర్కొన్నాయి. డాక్టర్ ఆప్టే అభిప్రాయం ప్రకారం... ‘‘ఇంట్లోకి ప్రవేశించే కాలుష్య రేటుకు మించి పరిశుభ్రమైన గాలిని అందించే మెషిన్ అయి ఉండాలి. అప్పుడే దాని ప్రభావం ఉంటుంది’’ అని వివరించారు. హెచ్ఈపీఏ ఫిల్టర్లు ఉండి, అధిక సీఏడీఆర్ ఉన్న ఫిల్టర్లను కొనుగోలు చేయవచ్చని సూచించారు. సెంటర్ ఫర్ ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్ మెంటల్ హెల్త్ కు చెందిన డాక్టర్ జోషి మాత్రం కంపెనీలు ఏం చెప్పినా, కార్బన్ ఫిల్టర్లు బెంజీన్, ఇతర హైడ్రోకార్బన్లు, ఎన్వో2లను తగ్గించలేవన్నారు.

మరోవైపు హెచ్ఈపీఏ ఫిల్టర్లు దుమ్మును గ్రహిస్తుంటాయి. దీంతో కొన్ని నెలలకోసారి ఫిల్టర్లను మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చుకోకుండా వాడితే వాటి వల్ల మరింత హాని ఉంటుందని డాక్టర్ జోషి సూచించారు. హెచ్ఈపీఏ ఫిల్టర్లున్న ప్యూరిఫయర్ల ఖరీదు రూ.10,000కు పైనే ఉంది. వీటిలో ఫిల్టర్లు ఖరీదైనవి. వీటిని ఆరు నెలలకోసారి అయినా మార్చుకోవాలి. దీంతో చాలా మంది వీటికి దూరంగా ఉంటున్నారు. కనుక ఎయిర్ ప్యూరిఫయర్లను కొనే శక్తిలేని వారు బయటి వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉండే సమయంలో ఇంటి తలుపులు, కిటీకీలు తెరవకుండా ఉండి, బయట వాతావరణం మెరుగ్గా ఉన్న సమయాల్లో తెరిచి ఉంచుకోవాలని డాక్టర్ సీగెల్ సూచన.

అభిప్రాయలు...
ఢిల్లీకి చెందిన వికాస్ సింఘాల్ అనే ఎగ్జిక్యూటివ్ ఆ మధ్య రూ.30,000 పెట్టి ఎయిర్ ప్యూరిఫయర్ కొన్నాడు. తల్లి ఆస్తమాతో బాధపడుతుండడంతో దాన్ని కొని ఆమె ఉన్న గదిలో ఉంచాడు. కొన్ని రోజుల్లో ఆమెకు ఉపశమనం రావడం గమనించినట్టు చెప్పాడు. ఢిల్లీకే చెందిన ఓ వ్యాపార వేత్త తన ఐదేళ్ల కుమారుడు గురకతో బాధపడుతున్నాడని ఎయిర్ ప్యూరిఫయర్ కొన్నాడు. అలాగే, ఆయన భార్య శీతాకాలంలో దగ్గుతో బాధపడేది. ఎయిర్ ప్యూరిఫయర్ కొన్న తర్వాత ఈ రెండు సమస్యలు తగ్గిపోయాయన్నది ఆయన అనుభవం. అందుకే పైన నిపుణులు చెప్పినట్టు హెచ్ఈపీఏ ఫిల్టర్లున్నవి, ఓజోన్ తరహా అయోనైజేషన్ ఫిల్టరేషన్ టెక్నాలజీ లేని మెషిన్లను తమ బడ్జెట్ లో ఉన్న వాటిని వాడుకోవడం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని తెలుస్తోంది. ఇళ్లల్లో వాడుకునే ఎయిర్ ప్యూరిఫయర్లే కాదు, పరిశ్రమల్లో వాడే రకం ప్యూరిఫయర్లు కూడా ఉన్నాయి.


More Articles