మాటలతో చెల్లింపులు... గూగుల్ తేజ్ యాప్ పనిచేస్తుందిలా...!

దాదాపు 90 శాతానికి పైగా స్మార్ట్ ఫోన్లు గూగుల్ ఆండ్రాయిడ్ తో పనిచేస్తున్నవే. తన పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణల బలంతో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఈ ప్రపంచాన్ని ఏలేస్తోంది. అటువంటి సంస్థ తాజాగా మన దేశంలో తేజ్ పేరుతో ఒక యాప్ ను విడుదల చేసింది. ఇది పేమెంట్ యాప్. షాపింగ్ చెల్లింపులు, నగదు బదిలీకి వీలు కల్పించేదే యాప్. తేజ్ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. ఇంకా అన్ని వ్యాపార సంస్థలూ తేజ్ ప్లాట్ ఫామ్ పైకి రాలేదు. ప్రస్తుతానికి పీవీఆర్ సినిమాస్, రెడ్ బస్, డిష్ టీవీ, జెట్ ఎయిర్ వేస్, డామినోస్, షాపిఫిమ్, బిల్ డెస్క్, పేయూ తదితర సంస్థలు తేజ్ ప్లాట్ ఫామ్ లో చేరాయి. గూగుల్ కు ఉన్న బలమైన మార్కెటింగ్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన బలాలతో త్వరలోనే ఈ యాప్ వినియోగం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


representational imageతేజ్ యాప్ కు మీ బ్యాంకు ఖాతా (ఒకటి లేదా ఎన్ని ఉన్నా గానీ) యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరికైనా చెల్లించాలంటే బ్యాంకు ఖాతా నుంచే నేరుగా నగదు వెళ్లిపోతుంది. అంతేకానీ, యాప్ లోకి నగదును లోడ్ చేసుకోవక్కర్లేదు. దీంతో బ్యాంకు ఖాతాలోనే నగదు భద్రంగా ఉంటుంది. మీకు అవసరమైన సందర్భంలో ఆదేశమిచ్చిన వెంటనే తేజ్ ద్వారా బయటకు వెళుతుంది. దీనివల్ల బ్యాంక్ బ్యాలన్స్ పై వడ్డీ నష్టపోవక్కర్లేదు.

 ఈ యాప్ సాయంతో స్నేహితులకు నగదు పంపుకోవచ్చు. ఇతరుల నుంచి అప్పటికప్పుడే నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి నగదు స్వీకరించొచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ సాయంతో పనిచేసే తేజ్ యాప్ ను యూపీఐ ప్లాట్ ఫామ్ తో అనుసంధానమై ఉన్న 55 బ్యాంకుల ఖాతాదారులు వినియోగించుకోవచ్చు. మన దేశంలో పేటీఎం పేమెంట్ యాప్ ఎక్కువ వినియోగంలో ఉంది. తర్వాత ఫోన్ పే ఒకటి. వీటికి తేజ్ గట్టి పోటీనివ్వనుంది. అన్ని ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లపై తేజ్ యాప్ పనిచేస్తుంది.

బ్యాంకు ఖాతాతో లింక్
యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత బ్యాంకు ఖాతా వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుంది. వివరాలు ఇచ్చిన తర్వాత బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ నుంచి టెక్ట్స్ మెస్సేజ్ పంపడం ద్వారా తమ వివరాల్ని ధ్రువీకరించాలి. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత యూపీఐ పిన్ నంబర్ సెట్ చేసుకోవాలి. ఇకపై ఏ లావాదేవీ చేయాలన్నా ఈ పిన్ నంబర్ చాలా కీలకం అవుతుంది.  

representational imageధ్వని తరంగాలతో చెల్లింపులు
అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాల సాయంతో చెల్లింపులు చేయడం తేజ్ యాప్ ప్రత్యేకత. దీనికి క్యాష్ మోడ్ అని గూగుల్ నామకరణం చేసింది. ఇంత వరకూ ఈ సదుపాయం, ఈ టెక్నాలజీ మరే పేమెంట్ యాప్ కు లేదు. ఈ తరహా టెక్నాలజీ, నవ్యతలే గూగుల్ బలాలుగా చెప్పుకోవాలి.

ఈ విధానంలో చెల్లింపులు, నగదు బదిలీలు ఎలా జరుగుతాయంటే... రాధకు గోపీ రూ.100 చెల్లించాలనుకుంటే.... అప్పుడు రాధ, గోపీ ఇద్దరి ఫోన్లలోనూ తేజ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని ఉండాలి. ఇద్దరూ తేజ్ యాప్ ను ఓపెన్ చేసి తమ ఫోన్లను సమీపంలో ఉంచాలి. గోపీ పేమెంట్ ఆప్షన్ ఎంచుకుని, నగదు మొత్తాన్ని ఫీడ్ చేసి పిన్ ఎంటర్ చేస్తే చాలు. అలాగే, రాధ సైతం పిన్ నంబర్ తన తేజ్ యాప్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని స్వీకరించేందుకు సూచన. దీంతో అల్ట్రాసోనిక్ తరంగాలు సమీపంలోని తేజ్ యాప్ వినియోగదారుడ్ని గుర్తిస్తాయి. ఏక కాలంలో పంపేవారు, సమీపంలో స్వీకరించే వారిని తేజ్ యాప్ గుర్తిస్తుంది. ఆ వెంటనే గోపీ ఖాతా నుంచి రాధ ఖాతాకు రూ.100 వెళ్లిపోతాయి. ఈ సదుపాయాన్నే ఆడియో క్యూఆర్ అని పిలుస్తున్నారు. ఈ టెక్నాలజీతో ఎంఐసీ, స్పీకర్ సాయంతోనూ చెల్లింపులు చేసుకోవచ్చు. ఆడియో క్యూఆర్ టెక్నాలజీ అన్నది గూగుల్ ఆవిష్కరణ. దీనిపై కంపెనీకి పేటెంట్ ఉంది.

ఇక మీకు దూరంలో ఉన్న వారికి, ఫోన్ కాంటాక్టుల జాబితాలోని వారికీ నగదు పంపుకునే సదుపాయం ఉంది. కాంటాక్టుల్లో ఎవరైతే తేజ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఉంటారో, సంబంధిత వ్యక్తుల ఫోన్ నంబర్ ఇచ్చినా తేజ్ డబ్బులు పంపించేస్తుంది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి చెల్లింపులు చేసుకునేందుకూ వీలుంది. ప్రతీ వ్యక్తితో మీరు చేసిన లావాదేవీల వివరాలను చాట్ రూపంలో తేజ్ తెలియజేస్తుంది.

సాధారణంగా తమ బ్యాంకు ఖాతా నుంచి ఇతరులకు నగదు బదిలీ చేయాలనుకుంటే అవతలి వారి బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్ సీ కోడ్ తో వారిని ముందుగా తమ బ్యాంకు ఖాతాలో బెనిఫీషియరీగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ తేజ్ లో ఈ తలనొప్పులు లేవు. సులభంగా ఎవరికి, ఎప్పుడైనా నగదు పంపుకోవచ్చు. భవిష్యత్తులో క్రెడిట్ కార్డులు, వ్యాలెట్లతోనూ చెల్లించే సదుపాయాన్ని తేజ్ ప్లాట్ ఫామ్ పై కల్పించనున్నట్టు గూగుల్ తెలిపింది.

representational imageభద్రత ఎక్కువే
ఈ విధానంలో బ్యాంకు ఖాతా, ఇతర సున్నిత సమాచారంతో పని లేదు. దీన్ని మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన క్యూఆర్ కోడ్ టెక్నాలజీగా గూగుల్ పేర్కొంది. ఎందుకంటే ఇందులో తేజ్ షీల్డ్ అనే సదుపాయం కూడా ఉంది. ఇది ఒకటికి మించి సంకేతాలతో స్పామ్, హ్యాకింగ్ ను గుర్తిస్తుంది. ప్రతీ యూజర్ గుర్తింపు మరొకరి చేతిలో పడకుండా రక్షణ కల్పిస్తుంది. ఇంకా మరింత రక్షణ కోసం గాను యాప్ ఇన్ స్టాల్ సమయంలోనే తమ ఖాతాకు పాస్ కోడ్ లేదా ఫింగర్ ప్రింట్ లేదా గూగుల్ ప్యాటర్న్ లాక్ ను యూజర్లు క్రియేట్ చేసుకోవచ్చు.  

ప్రాంతీయ భాషల్లో
తేజ్ ను తెలుగులోనూ వినియోగించుకోవచ్చు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, గుజరాతీ, బెంగాలి, మరాఠి ఇలా 9 భారతీయ భాషల్లో ఈ యాప్ ను తీసుకురావడం జరిగింది.
 
వ్యాపారులకూ...
తేజ్ యాప్ తో వ్యాపారులకూ సౌకర్యవంతమైన సేవలను అందించనున్నట్టు గూగుల్ తెలియజేసింది. వ్యాపారస్తులు చెల్లింపులను తేజ్ సాయంతో నేరుగా తమ బ్యాంకు ఖాతాలోకి స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన నగదు రహిత లావాదేవీలకు ఇది సాయపడనుంది. తేజ్ యాప్ సాయంతో కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలకు చెల్లింపులను నేరుగా బ్యాంకు ఖాతాలోకి స్వీకరించే వీలుంది. వాట్సాప్ లో కొందరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని చాట్ చేసుకున్నట్టుగానే... తేజ్ ప్లాట్ ఫామ్ పై కొందరు వ్యాపారులు కలసి ఒక సమూహంగా బిజినెస్ చానల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.

representational imageభారత్ లో 30 కోట్ల స్మార్ట్ ఫోన్ల యూజర్లు ఉండగా, వీరి సంఖ్య వేగంగా పెరుగుతోందని, ఇంటర్నెట్ అన్నది భారతీయుల జీవనంలో భాగంగా మారుతోందని గూగుల్ పేర్కొంది. స్మార్ట్ ఫోన్ ను స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య సందేశాలు, చాట్, వెబ్ సమాచారం, వార్తలు, వీడియోలు చూసేందుకే వినియోగిస్తున్నట్టు గూగుల్ తెలిపింది. నిజ జీవితంలో చాయ్ వాలాకు, కూరగాయలు, బస్సు చార్జీలు, హోటల్, రెస్టారెంట్లో, చివరికి ఆన్ లైన్లో చెల్లింపుల విషయానికొస్తే స్మార్ట్ ఫోన్ వినియోగం అంతగా లేదని స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపుల మార్కెట్ 2016లో 50 బిలియన్ డాలర్లు (రూ.3.2 లక్షల కోట్లు)గా ఉండగా 2020 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనాతో ఉంది. అందుకే భవిష్యత్తులో డిజిటల్ లావాదేవీల పరంగా భారీ అవకాశాలను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో గూగుల్  తేజ్ ను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.

ఇతర వ్యాలెట్లకు, తేజ్ కు మధ్య తేడా
తేజ్ యాప్ లో నగదును నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నగదు ఎప్పుడూ మీ బ్యాంకు ఖాతాలోనే ఉంటుంది. చెల్లింపుల సమయంలో ఖాతా నుంచే వెళుతుంది. దీంతో వడ్డీ నష్టపోరు. పైగా ప్రతీ లావాదేవీ యూపీఐ పిన్ ఇస్తే గానీ పూర్తి కాదు. దీంతో రక్షణ ఎక్కువ. అలాగే, నగదును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. దీంతో ఇదొక అదనపు భద్రత. చోరీ ముప్పు ఉండదు. ఈ యాప్ ఉంటే బ్యాంకు డెబిట్ కార్డున్నట్టే. అవసరమైన చోట బ్యాంకు ఖాతా నుంచే లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. తేజ్ యాప్ నుంచి భీమ్ ఇతర యూపీఐ యాప్ లతోనూ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. గూగుల్ పరిశోధనా, అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టే సంస్థ కావడంతో భవిష్యత్తులో తేజ్ మరింత పాప్యులర్ అవుతుందని పరిశీలకుల అభిప్రాయం.

పేటీఎం యాప్
ఇదొక ప్రముఖ మొబైల్ వ్యాలెట్. పేమెంట్ బ్యాంకుగా మారింది. వ్యాలెట్ లోకి డబ్బులు లోడ్ చేసుకుని నగదు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ తో బ్యాలన్స్ లోడ్ చేసుకోవచ్చు. అన్ని రకాల బిల్లుల చెల్లింపులకు, కొనుగోళ్లకు ఈ వ్యాలెట్ ఉపయోగపడుతుంది. లావాదేవీలపై క్యాష్ బ్యాక్ ఇతర సదుపాయాలు ఉండడం ఒక ఆకర్షణీయాంశం. ఈ క్యాష్ బ్యాక్ ను మరోక లావాదేవీకి వాడుకోవాలి. బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునేందుకు లేదు. ఆ ఆఫర్లు భీమ్ యాప్ లో ఉండవు. తేజ్ పై ఆఫర్లు ఉండేదీ లేనిది త్వరలో తెలుస్తుంది.

ఫోన్ పే
ఫోన్ పే కూడా తేజ్ మాదిరిగానే యూపీఐ ప్లాట్ ఫామ్ ఆధారంగానే పనిచేస్తుంది. ఫోన్ పే వ్యాలెట్ నుంచి, క్రెడిట్, డెబిట్ కార్డుల లేదా యూపీఐ ఆప్షన్లతో చెల్లింపులు చేసుకోవచ్చు. బిల్లుల చెల్లింపులు, రీచార్జీ తదితర సేవలను కూడా వినియోగించుకోవచ్చు. ఫోన్ పేతో చెల్లింపులపైనా క్యాష్ బ్యాక్ సదుపాయాలకు అవకాశం ఉంది.

భీమ్ యాప్
ఇది కేంద్ర సర్కారు తీసుకొచ్చిన డిజిటల్ చెల్లింపుల యాప్. తేజ్ మాదిరిగా యూపీఐ ఇంటర్ ఫేస్ ఆధారంగానే ఇది కూడా పనిచేస్తుంది. అంటే నేరుగా బ్యాంకు ఖాతా నుంచే ఈ యాప్ సాయంతో చెల్లింపులు చేయవచ్చు. భీమ్ రావు అంబేద్కర్ పేరు ఆధారంగా దీనికి భీమ్ అని నామకరణం చేశారు. ఇందులో లావాదేవీలపై ఎటువంటి చార్జీలు లేవు. ఈ యాప్ నుంచే తమ బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు. 12 అంకెల ఆధార్ నంబరే చెల్లింపుల ఐడీగా పనిచేస్తుంది. ఆఫ్ లైన్ చెల్లింపుల సదుపాయం సైతం ఉంది. అంటే ఇంటర్నెట్ లేకపోయినా చెల్లింపులు చేసుకోవచ్చు.


More Articles