స్పాంజ్ కేక్ చిటికెలో... ఓవెన్ అక్కర్లేదు... గుడ్లతోనూ, గుడ్లు లేకుండానూ...
స్పాంజ్ కేక్ మంచి పోషకాహారం. రుచిలోనూ దీని ప్రత్యేకత వేరు. పుట్టిన రోజు, పెళ్లి రోజుల్లో సాధారణంగా బేకరీల నుంచి కేక్ లు తెచ్చుకోవడం చాలా మందికి అలవాటు. అయితే, కాస్తంత ఆసక్తి, సమయం కేటాయిస్తే ఇంట్లోనే దీన్ని మంచి రుచికరంగా చేసుకోవచ్చు. శాకాహారులు సైతం గుడ్లతో పని లేకుండా స్పాంజ్ కేక్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా అన్నది చూద్దాం...
కావాల్సినవి
మైదా పిండి 200 గ్రాములు, పంచదార 200 గ్రాములు, గుడ్లు మూడు, సన్ ఫ్లవర్ నూనె 100 ఎంఎల్, బేకింగ్ సోడా టీస్పూను, సోడా బై కార్బొనేట్ చిటికెడు, వెనిల్ల ఎసెన్స్, ఇసుక కొంత అవసరం.
తయారీ
ముందు పంచదారను మిక్సర్ లో వేసి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. అదే జార్ లో మైదా పిండి వేయాలి. గుడ్లను బ్రేక్ చేసి అందులో ద్రవాన్ని జార్ లోని మిశ్రమంలో పోయాలి. నూనె, బేకింగ్ సోడా, సోడా బై కార్బ్, వెనిల్లా ఎసెన్స్ మూడు చుక్కలు వేసి కలపాలి. వెనిల్లా ఎసెన్స్ మార్కెట్లో లభిస్తుంది. తర్వాత మరో సారి మిక్సర్ స్విచాన్ చేసి మంచిగా కలిసేలా తిప్పాలి. ఇప్పుడు ఓ పళ్లెం తీసుకుని అందులో లోపలి భాగానికి నూనె రాయాలి. మిక్సర్ లోని జారుగా అయిన మిశ్రమాన్ని పళ్లెంలోకి వంపేయాలి.
ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో అడుగు భాగంలో ఇసుకు పోయాలి. పొయ్యి మీద కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. కుక్కర్ లోని ఇసుక వేడెక్కిన తర్వాత దానిపైన పళ్లెం ఉంచాలి. కుక్కర్ పై మూత పెట్టేయాలి. సన్నని మంటపై 20-30 నిమిషాల పాటు ఉంచిన తర్వాత లోపల పళ్లెంలోని మిశ్రమం గట్టిపడి పరిమాణం పెరుగుతుంది. దాన్ని బయటకు తీసుకుని పదునుగా ఉన్న గరిటె లేదా చాకుతో ముక్కలుగా కోసుకుంటే కేక్ రెడీ అయినట్టే.
అయితే, మైక్రోవేవ్ ఓవెన్ లో చేసిన దానికీ, ఇలా ఇంట్లో కుక్కర్ లో చేసుకున్న దానికీ స్వల్ప తేడా ఉంటుంది. ఓవెన్ లో చేసుకుంటే ఇంకొంచెం సాఫ్ట్ గా వస్తుంది. కానీ, ఓవెన్ లో నిర్ణీత ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ లో అయితే ఈ తలనొప్పి అక్కర్లేదు.
గుడ్లు లేకుండా కేక్
గుడ్లు లేకుండా చక్కని, రుచికరమైన కేక్ ను కూడా ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. దీని తయారీ కూడా పైన చెప్పుకున్న విధంగానే ఉంటుంది. కాకపోతే గుడ్లు అవసరం లేదు.
కావాల్సినవి
ఒకటిన్నర కప్పు మైదా పిండి, ఒక కప్పు పంచదార, అరకప్పు నూనె, వనిల్లా ఎసెన్స్ కొన్ని చుక్కులు, బేకింగ్ పౌడర్ ఒకటిన్నర టీ స్పూను, బేకింగ్ సోడా ఒక టీ స్పూను, యుగర్ట్ ఒక కప్పు అవసరం.
తయారీ
యుగర్ట్, పంచదార ఈ రెండింటినీ పాత్రలోకి తీసుకుని బాగా చిలుకుతూ కలపాలి. గాలి బుడగలు కనిపించే వరకూ కలపాలి. ఇప్పుడు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలిపేయాలి. ఐదు నిమిషాలు ఆగితే గాలి బుడగలు పైన తేలతాయి. ఇప్పుడు కుక్కర్ లో పట్టేంత పళ్లెం తీసుకుని లోపలి వైపు నూనె రాయాలి. తర్వాత అంతకుముందు కలుపుకున్న మిశ్రమాన్ని అందులో పోయాలి. ఐదు నిమిషాల తర్వాత వెనిల్లా ఎసెన్స్ కలుపుకోవాలి. ఆయిల్ కూడా కలుపుకుని ఆ తర్వాత మైదా పిండి కూడా జత చేసి మామూలుగా కలిపేయాలి. కుక్కర్లో అడుగు భాగంలో అంగుళం మేర ఇసుక నింపుకుని దానిపై పళ్లెం ఉంచాలి. తక్కువ మంటపై 30-40 నిమిషాల వరకూ ఉంచితే కేక్ సిద్ధమైనట్టే.