మాటలు విని తెలుగులో టైప్ చేసే అప్లికేషన్... మీ ఫోన్లో ఉందా?

టెక్నాలజీ దేన్నైనా సాధ్యం చేయగలదు. ఇంగ్లిష్ వినియోగం అంతగా విస్తరించినప్పటికీ కొన్ని భావాలను తెలుగులో చెబితే ఉండే ఆనందం, సౌకర్యం వేరు. మొబైల్స్ వినియోగం బాగా పెరిగి, వాట్సాప్, ఫేస్ బుక్ వేదికలుగా కాలక్షేప కబుర్లూ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వీటిలో తెలుగులో టైపింగ్ చేేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, తెలుగులో స్వయంగా టైపింగ్ చేసుకోవడమే కాదు, బాస్ లా ఒక్కో పదం చెబుతుంటే సెక్రటరీలా దానంతట అదే టైప్ చేసుకుంటూ వెళ్లే యాప్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి తెలుగు వారందరిలో అవగాహన పెరిగితే సామాజిక మాధ్యమాల్లో తెలుగుదనం విరాజిల్లుతుంది.


ఇందుకోసం మీ మొబైల్ లో గూగుల్ అనే అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకుని ఉండాలి. ఇన్ స్టాల్ అయి ఉంటే అది జీ అనే అక్షరంతో కనిపిస్తుంది. దాన్ని ఒకసారి అప్ డేట్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేస్తే పైన ఎడమ భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి. అందులో సెట్టింగ్స్ లో వాయిస్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. అందులో పై భాగంలో లాంగ్వేజెస్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. అందులో భాషను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా డిఫాల్ట్ గా ఇంగ్లిష్ యూకే ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటుంది. దాన్ని డీసెలక్ట్ చేసి అక్కడే కిందకు వెళితే తెలుగు ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలి.

ఆండ్రాయిడ్ మొబైల్స్ లో జిబోర్డ్ అనే అప్లికేషన్ ఉంటుంది. దీన్ని అప్ డేట్ చేసుకోవాలి. లేదంటే డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి. మీ ఫోన్లో సెట్టింగ్స్ లో లాంగ్వేజ్ ఇన్ పుట్ ఆప్షన్ కు వెళ్లాలి. అందులో డిఫాల్ట్ కీబోర్డు ఆప్షన్ ఉటుంది. దాన్ని క్లిక్ చేస్తే కింద వివిధ కీబోర్డులు కనిపిస్తాయి. అందులో తెలుగు జీబోర్డు అనే దాన్ని ఎంపిక చేసుకోవాలి. దీంతో సెట్టింగ్స్ పని పూర్తయినట్టు.

వాట్సాప్ లేదా ఫేస్ బుక్ మరొక చోట ఎక్కడయినా టైప్ చేయాలనుకున్నప్పుడు కీబోర్డు కనిపిస్తుంది. ఇందులో కీబోర్డు తెలుగులో ఉందా? లేదా? చూడాలి. తెలుగులోనే ఉంటే టైపింగ్ కు సిద్ధంగా ఉన్నట్టే. కీబోర్డు పై భాగంలో మౌస్ సింబల్ ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడ అయితే టైప్ చేయాలనుకుంటున్నారో అక్కడ వేలితో ఓ సారి టాప్ చేయాలి. ఇక ఇప్పుడు నిదానంగా ఒక పదం తర్వాత ఒక పదం మధ్య మధ్యలో ఒక్క సెకను ఆగి చెబుతూ వెళితే కీబోర్డే టైప్ చేస్తుంది. పరిశీలించి చూడండి మీకే తెలుస్తుంది. టైప్ పూర్తయిన తర్వాత కీబోర్డు పై భాగంలో మైక్ సింబల్ ను ఆఫ్ చేయాలి. మాట్లాడకుండా ఉంటే కొద్ది సేపటికి అదే ఆఫ్ అవుతుంది.

లేదంటే ఇలా...
మొబైల్ లోని సెట్టింగ్స్ లో లాంగ్వేజ్ కీబోర్డు ఇన్ పుట్ మెథడ్ కు వెళ్లి జీ బోర్డు క్లిక్ చేయాలి. ఆప్షన్లలో లాంగ్వేజెస్ ను ఎంచుకోవాలి. అక్కడ యూజ్ సిస్టమ్ లాంగ్వేజ్ ను డీయాక్టివేట్ చేయాలి. కిందకు వెళితే తెలుగు ఏబీసీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఒక్క స్టెప్ వెనక్కి వచ్చి జీబోర్డులోనే వాయిస్ టైపింగ్ ఆప్షన్ లోకి వెళ్లాలి. అందులో పైన ఉన్న లాంగ్వేజెస్ ఆప్షన్ లోకి వెళ్లాలి. అందులో కనిపించే భాషల్లో ఇంగ్లిష్ ఇండియా ఆప్షన్ సెలక్ట్ అయి ఉంటుంది. దాన్ని డీయాక్టివేట్ చేయాలి. కిందకు వెళితే తెలుగు కనిపిస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసి సేవ్ చేసుకోవాలి. టైప్ చేయాలనుకున్న చోట కీబోర్డు యాక్టివేట్ అయిన వెంటనే దాని  కింది భాగంలో కనిపించే గ్లోబ్ ను క్లిక్ చేయాలి.

 గ్లోబ్ ను క్లిక్ చేస్తే తెలుగు నుంచి ఇంగ్లిష్ కు ఇంగ్లిష్ సెలక్ట్ అయి ఉంటే తెలుగుకు మారిపోతుంది. ఒకవేళ కీబోర్డులో కింద స్పేస్ బార్ పై ఇంగ్లిష్ అని ఉంటే గ్లోబ్ ను ఒకసారి సెలక్ట్ చేయాలి. దాంతో తెలుగులోకి మారుతుంది. తర్వాత కీబోర్డులోనే పైన కనిపించే మైక్ సింబల్ ను ఆన్ చేసి నిదానంగా ఒక పదం తర్వాత ఒక పదం పెద్దగా పలుకుతుంటే తెలుగులో టైప్ అవుతూ ఉంటుంది. ఒకవేళ తెలుగులో వాయిస్ టైపింగ్ కాకుండా మీరు స్వయంగా టైప్ చేయాలనుకుంటే పైన మైక్ సింబల్ తో పని లేకుండా కీ బోర్డులో తెలుగు ఎనేబుల్ అయిన తర్వాత ఇంగ్లిష్ లో టైప్ చేస్తే తెలుగులో టైప్ అవుతుంది.  

తెలుగులో టైపింగ్
తెలుగులో టైప్ చేసేందుకు మరో విధానంలో గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి గూగుల్ ఇండిక్ కీబోర్డు తెలుగు టైప్ చేయండి. ఇండిక్ కీబోర్డుతోనే పలు యాప్స్ కనిపిస్తాయి. కాకపోతే పై భాగంలో ఉండే గూగుల్ కీబోర్డును సెలక్ట్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఇన్ స్టాల్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సెలక్ట్ ఇన్ పుట్ మెథడ్ అని కనిపిస్తుంది. దాన్ని ఓకే చేయాలి. రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఇంగ్లిష్ అండ్ ఇండిక్ లాంగ్వేజ్ ఎంచుకోవాలి. అలాగే సెట్టింగ్స్ లో లాంగ్వేజ్ అండ్ ఇన్ పుట్ లో గూగుల్ ఇండిక్ కీబోర్డు ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఇక వాట్సాప్ అయినా ఫేస్ బుక్ అయినా టైప్ చేయాలనుకున్నప్పుడు కీబోర్డు వస్తుందని తెలిసిందే. పై భాగంలో ఏబీసీ పక్కన ఏదో ఒక భాష ఉంటుంది. అక్కడ సెలక్ట్ చేస్తే భారతీయ భాషల లిస్ట్ ఉంటుంది. తెలుగును ఓకే చేయాలి. ఇప్పుడు ఇంగ్లిష్ లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది. ఉదాహరణకు niku అని టైప్ చేస్తే తెలుగులో నీకు అని పడుతుంది.


More Articles