కొలెస్టరాల్ మంచిదే... కానీ, ఎప్పుడు చెడుగా మారుతుందో తెలుసా?
కొవ్వును వైద్య పరిభాషలో కొలెస్టరాల్ గా చెబుతారు. నిజానికి కొవ్వు అన్నది మన శరీరానికి అవసరమైన ముఖ్య పదార్థాల్లో ఒకటి. దీని వల్ల ఎంతో ఉపయోగం, అవసరం మన శరీరానికి ఉంది. కానీ, అవసరానికి మించితే ఇది సైలెంట్ కిల్లర్ గాను మారుతుంది. గుండెపోటు సహా మరెన్నో ముప్పులకు దారితీస్తుంది. అసలు ఈ కొలెస్టరాల్ పని ఏంటి, ఎంత మేర అవసరం, ఎందుకు పెరుగుతుంది, నివారణకు ఏం చేయాలన్న విషయాలను తెలుసుకుంటే దీని కారణంగా వాటిల్లే ముప్పును నివారించుకోవచ్చు.
కొవ్వు ఏం చేస్తుంది?
నూనె ఆధారిత పదార్థం. మైనం మాదిరిగా ఉంటుంది. రక్తంలో కలిసిపోదు. ఈ కొవ్వును లిపో ప్రోటీన్లు శరీరంలోని అన్ని కణాలకు చేరుస్తాయి. కణాలకు గోడలుగా కొవ్వు పనిచేస్తుంది. తీసుకున్న ఆహార పదార్థాల జీర్ణానికి అవసరమైన రసాలను పేగుల్లో ఉత్పత్తి చేసేందుకు కొవ్వు కావాలి. శరీరంలో విటమిన్ డి, హార్మోన్లు తయారు చేసేందుకు ఇది అవసరం. అందుకే మనకు ఎంత కావాలో అంత మేర కొవ్వును మన శరీరమే సహజసిద్ధంగా తయారు చేస్తుంది. అయితే, మనం తీసుకునే ఆహారం ద్వారాను శరీరంలోకి కొవ్వు వచ్చి చేరుతుంది. సూర్యరశ్మి మన చర్మంపై పడినప్పుడు, చర్మంలో ఉండే కొలెస్టరాల్ ఆ కిరణాలను విటమిన్ డిగా మారుస్తుంది. అందుకే కొలెస్టరాల్ అవసరం ఎంతో ఉంది.
పరిమితి దాటితేనే...
మన శరీరం కొన్ని కోట్ల కణాల కలయికగా ఉంటుంది. ప్రతీ కణంలోనూ కొలెస్టరాల్ ఉంటుంది. కావాల్సినంత ఉంటే ఏ ఇబ్బంది లేదు. కానీ పరిమితి దాటినప్పుడే సమస్యలు వచ్చేది. శరీరంలో కొలెస్టరాల్ అధికమైతే గుండె నుంచి రక్తం తీసుకెళ్లే ధమనుల్లో అది పేరుకుపోతుంది. అప్పుడు ధమనులు గట్టిపడిపోతాయి. దీన్నే అథెరోస్క్లెరోసిస్ గా చెబుతారు. కొవ్వు కారణంగా రక్త సరఫరా సమస్యలు ఏర్పడతాయి. కొవ్వు వల్ల ధమనులు కుచించుకుపోయి రక్తం సాఫీగా సరఫరా జరగదు. దీంతో రక్తం గడ్డలు కట్టడం లేదా వాపు కారణంగా గుండెపోటుకు దారితీయడం జరుగుతుంది.
కొలెస్టరాల్ పలు రకాలు
కొలెస్టరాల్ ను ఎల్ డీఎల్, హెచ్ డీఎల్ అని రెండు రకాలుగా చెబుతారు. ఎల్ డీఎల్ అంటే, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్. దీన్నే చెడ్డ కొవ్వుగా అభివర్ణిస్తారు. నిజానికి ఇది చెడ్డదేమీ కాకపోయినా పరిమితి దాటితే ముప్పు తెచ్చి పెట్టేది ఇదే. అందుకే దీన్ని బ్యాడ్ కొలెస్టరాల్ గా పిలుస్తుంటారు. హైడెన్సిటీ లిపోప్రొటీన్స్ (హెచ్ డీఎల్)ను మంచి కొవ్వుగా చెబుతారు. ఎల్ డీఎల్ ఎక్కువైతే గుండె జబ్బులు, గుండెపోటు ముప్పు పెరుగుతున్నట్టుగా భావించాలి. హెచ్ డీఎల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం తక్కువ అన్నట్టు భావించొచ్చు. ఓ వ్యక్తి గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందా, లేదా అన్నది వైద్యులు నిర్ధారించేందుకు ఈ కొలెస్టరాల్ స్థాయిలు అత్యంత కీలకమైనవి. వీటితోపాటు ఇతర కొన్ని అంశాల ఆధారంగా వైద్యులు ఓ నిర్ధారణకు వస్తారు. రక్తపోటు, మధుమేహం, వయసు, పొగతాగడం, మద్యపాన సేవనం వంటి అలవాట్లు రిస్క్ ను అంచనా వేయడంలో ఉపయోగపడతాయి. మధుమేహం, లివర్ లేదా కిడ్నీ వ్యాధులు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, గర్భం దాల్చినప్పుడు హార్మోన్ల స్థాయిలు పెరగడం, థైరాయిడ్ గ్రంధి క్రియాశీలకంగా లేకపోవడం, కొన్ని రకాల ఔషధాలు (స్టెరాయిడ్స్) వాడకం వంటి సందర్భాల్లో అధిక కొలెస్టరాల్ కు దారితీయవచ్చు.
ఆహారం, జీవనంలో మార్పులు
జీనవ విధానంలో మార్పులు (ఆహారంలో మార్పులు, వ్యాయామం) చేసుకోవడం ద్వారా కొలెస్టరాల్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు. కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటే బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించవు.
ముఖ్యంగా కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోవాలి. జంతు ఉత్పత్తులు, మాంసం, చీజ్ వినియోగం తగ్గించుకుంటే సరిపోతుంది. కొన్ని రకాల మాంసంలో, కొవ్వు అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, చాక్లెట్లు, బేక్డ్ గూడ్స్, బాగా వేయించిన ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. బాగా వేయించిన, శుద్ధి చేసిన ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది.ఓట్స్, బార్లీ, ముడి ధాన్యాలు, బీన్స్, నట్స్, కనోలా, సన్ ఫ్లవర్ ఆయిల్, పండ్లలో యాపిల్, గ్రేప్స్, స్ట్రా బెర్రీస్, సిట్రస్ జాతికి చెందిన కమలా, బత్తాయి పండ్లు, సోయా, సోయా ఆధారిత ఉత్పత్తులు, చేపల్లో సాల్మన్, టునా, సార్డిన్స్ రకాలు, పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల హాని చేసే కొవ్వు తగ్గిపోతుందని ఎన్నో పరిశోధనల్లో రుజువైంది.
శాచురేటెడ్ ఫ్యాట్
ఆహార పదార్ధాల ద్వారా అందే కొవ్వును శాచురేటెడ్, అన్ శాచురెటడ్, మోనో శాచురేటెడ్, మోనో అన్ శాచురేటెడ్, పాలీ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్ అనే వివిధ రకాలుగా వర్గీకరించారు. ఇందులో శాచురేటెడ్ కొవ్వు ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎల్ డీఎల్ పెరుగుతుంది. అంతేకాదు హెచ్ డీఎల్ తగ్గుతుంది. నూనెలను అధిక ఉష్ణోగ్రతల వద్ద కాచినప్పుడు విడుదలయ్యే సాలిడ్ ఫ్యాట్స్ ను ట్రాన్స్ ఫ్యాట్ గా చెబుతారు. ఇవి కూడా ఆరోగ్యానికి హానికరం. అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురెటెడ్, మోనో అన్ శాచురేటెడ్ యాసిడ్స్ అన్నవి ఆరోగ్యానికి క్షేమకరం. ఇవి ఉన్న వాటిని తీసుకోవచ్చు.
శారీరక వ్యాయామం
రోజూ నిర్ణీత సమయం మేర శారీరక వ్యాయామం ఉండేలా చూసుకోవాలన్నది వైద్యుల సిఫారసు. కనీసం అరగంట వేగంగా నడిచినా సరిపోతుంది. అస్తమానం కూర్చునే కాకుండా మధ్య మధ్యలో లేచి తిరుగుతూ ఉండాలి. అధిక బరువు ఉంటే తగ్గాలి. ఎందుకంటే స్థూలకాయం కూడా కొలెస్టరాల్ పెరిగేందుకు కారణమవుతుంది. పొగ తాగడం, మద్యపానం అలవాట్లను మానివేయాలి. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలంటే ఇధి అవసరం. జీవన విధానంలో మార్పులు ఫలితాలనివ్వక, కొలెస్టరాల్ అధిక స్థాయిల్లోనే కొనసాగుతుంటే వైద్యులు స్టాటిన్స్ గ్రూపు ఔషధాలను సిఫారసు చేస్తారు. వీటిని వాడడం ద్వారా కొలెస్టరాల్ ను తగ్గించుకోవచ్చు.
ట్రై గ్లిజరైడ్స్
మన దేహంలోనే ట్రై గ్లిజరైడ్స్ అని కూడా ఉంటాయి. ఇది కూడా కొవ్వే. మనం తీసుకునే ఆహారం నుంచి వచ్చే అధిక శక్తిని ఇది నిల్వ చేస్తుంది. మనం చక్కెరలు, ధాన్యాలు తీసుకోవడం వల్ల ఇవి పెరుగుతుంటాయి. అలాగే, శారీరక కదలిక తక్కువగా ఉన్నా, సిగరెట్, మద్యం అలవాట్లు, అధిక బరువు ట్రైగ్లిజరైడ్స్ ను పెంచేవే. ట్రై గ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండి, అదే సమయంలో హెచ్ డీఎల్ తక్కువగా ఉండడం లేదా ఎల్డీఎల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు అధికంగా పేరుకుంటున్నట్టుగానే భావించాలి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తెచ్చిపెడుతుంది.
ఎంత మేర కొలెస్టరాల్
ఆరోగ్యవంతులైన వారు రోజులో 300 మిల్లీ గ్రాములకు మించి కొవ్వు తీసుకోరాదు. ఒకవేళ మధుమేహంతో ఉన్న వారు, అప్పటికే అధిక కొలెస్టరాల్, గుండె జబ్బులున్నవారు రోజులో తీసుకునే కొవ్వు పరిమాణాన్ని 200 మిల్లీ గ్రాములకు మించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒక గుడ్డులో 186 మిల్లీ గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇదంతా పచ్చసొన నుంచే అందుతుంది.
వైద్య పరీక్షలు
20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఐదేళ్లకోసారి అయినా కొలెస్టరాల్ (లిపిడ్ ప్రొఫైల్) టెస్ట్ చేయించుకోవాలని అమెరికన్ వైద్యుల సిఫారసు. కొలెస్టరాల్ కు సంబంధించి చేసే పరీక్షలో టోటల్ కొలెస్టరాల్ అనే రీడింగ్ కూడా ఉంటుంది. ఇది వేరే ఏమీ కాదండి. ఎల్డీఎల్, హెచ్ డీఎల్ ఈ రెండింటిని కలిపి చూపించేది. 200 ఎంజీ/డీఎల్ (మిల్లీగ్రామ్ ఫర్ డెసిలీటర్) 200 లోపు ఉంటే సరిపోతుంది. 220కి పైన 240 వరకు ఉంటే దాన్ని అధికంగా, ఆపైన ఉంటే అత్యధికంగా ఉన్నట్టు పరిగణిస్తారు. ఎల్ డీఎల్ కొలెస్టరాల్ 100 ఎంజీ/డీఎల్ లోపు ఉంటే మంచిది. 110-120 వరకు ఉన్నా నష్టం లేదు. 130 నుంచి 150 వరకు ఉంటే దాన్ని కొంచెం ఎక్కువగా ఉన్నట్టు, 190కి పైన చాలా అధికంగా ఉన్నట్టు భావిస్తారు. హెచ్ డీఎల్ కొలెస్టరాల్ ఎంజీ/డీఎల్ 40 లోపు ఉంటే మాత్రం చాలా రిస్క్ అని భావించాలి. 40 నుంచి 60 వరకు ఫర్వాలేదు. 60కి పైన ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం తక్కువగా ఉంటుందని గ్రహించాలి. ట్రై గ్లిజరైడ్స్ అయితే 150 వరకు ఉంటే సరిపోతుంది. 200 - 450 వరకు ఎక్కువగా, 500కిపైన చాలా ఎక్కువగా ఉన్నట్టు భావిస్తారు. గుండె జబ్బులున్న వారికి ఎల్ డీఎల్ 100కు లోపే ఉండేలా చూసుకోవాలన్నది వైద్యుల సిఫారసు. హెచ్ డీఎల్ కనీసం 45 పాయింట్ల కంటే తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
హెచ్ డీఎల్ ఏం చేస్తుంది?
హెచ్ డీఎల్ అన్నది శరీర కణజాలం, గుండె ధమనుల్లో అధికంగా ఉన్న కొవ్వును గ్రహించి లివర్ కు తీసుకెళుతుంది. ఇక్కడ దీన్ని లివర్ తిరిగి శుద్ధి చేసి మళ్లీ కణాలకు శక్తిగా అందిస్తుంది. అందుకే హెచ్ డీఎల్ ను మంచి కొలెస్టరాల్ గా, ఆరోగ్య హితకారిగా అభివర్ణిస్తుంటారు.