మీ స్మార్ట్ ఫోన్ స్లో అయిందా...? వేగంగా పరుగెట్టాలంటే కొన్ని చిట్కాలున్నాయ్!

స్మార్ట్ ఫోన్ కొత్తలో మంచి జోరుమీద ఉంటుంది. అప్లికేషన్లు వేగంగా కదులుతాయి. కానీ, కొన్ని నెలల వాడకం తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది. నిదానంగా ఓపెన్ అవుతూ వేగంగా స్పందించే తత్వం తగ్గిపోతుంది. దీంతో ఆ ఫోన్ వాడేవారిలో అసంతృప్తి మొదలవుతుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ను వేగంగా పరిగెత్తించాలంటే అందుకు నిపుణులు చెబుతున్న చిట్కాలు ఏంటన్నవి తెలుసుకుందాం.


యాప్స్, వాల్ పేపర్స్, విడ్జెట్స్
representational imageస్మార్ట్ ఫోన్లో స్టోరేజీ ఉందని చెప్పి నచ్చిన ప్రతి యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటూ వెళ్లడం చాలా మందికి అలవాటు. యాప్స్ ఎక్కువగా ఉంటే ఫోన్ వేగం తగ్గుతుంది. అందుకే ఎక్కువగా అవసరమయ్యే ముఖ్యమైన యాప్స్ కే పరిమితం కావాలి. మిగిలిన యాప్స్ అన్నింటినీ అన్ ఇన్ స్టాల్ చేసేయాలి. కొన్ని యాప్స్ ఫోన్ తో సహా ఇన్ బిల్ట్ గా లోడ్ అయి ఉంటాయి. వీటిని అన్ ఇన్ స్టాల్ చేయలేం. కావాలంటే డిసేబుల్ చేసుకోవచ్చు. లైవ్ వాల్ పేపర్లు, హోమ్ స్క్రీన్ పై విడ్గెట్ లు అధికంగా ఉంచుకోవద్దు. విడ్గెట్ లు ఫోన్ రీసోర్సెస్ ను అధికంగా వినియోగించుకుంటాయి. వీటి వల్ల ఫోన్ స్లో అవుతుంది. అందుకే స్టాటిక్ (కదలిక లేని) వాల్ పేపర్లను పెట్టుకోవాలి. విడ్గెట్ ల వాడకాన్ని పరిమితం చేయాలి.

బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్
representational imageఫోన్లోని కొన్ని యాప్స్ ఫోన్ తో పాటే ప్రారంభం అవుతుంటాయి. కొన్ని ఆన్ లైన్ సర్వీసులను వినియోగించుకుంటుంటాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ స్లో అయ్యేందుకు కారణం అవుతాయి. బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతున్న యాప్స్ గురించి తెలుసుకోవడానికి సెట్టింగ్స్ లో యాప్స్ కు వెళ్లాలి. అక్కడ రన్నింగ్ అనే దాన్ని ఎంచుకుంటే బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతున్న యాప్స్ లిస్ట్ కనిపిస్తుంది. యాండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ సహా పలు యాప్స్ రన్ అవుతుంటాయి. అందులో మీకు అవసరం లేనివి ఉంటే వాటిని వెంటనే అన్ ఇన్ స్టాల్ లేదా డిసేబుల్ చేసుకోవాలి.

అలాగే బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ సింకింగ్ అవుతున్నాయా? లేదా అన్నది గమనించాలి. వీటి సింక్రనైజేషన్ ను టర్న్ ఆఫ్ చేయాలి. దీనివల్ల డేటాతోపాటు సిస్టమ్ రీసోర్సెస్ కూడా ఆదా అవుతాయి. ఇందుకోసం సెట్టింగ్స్ లో డేటా యూసేజ్ కు వెళ్లాలి. కొన్నింటిలో వైర్ లెస్ అండ్ నెట్ వర్క్స్ లో యూసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో స్క్రోల్ డౌన్ చేస్తే ఏ యాప్స్ డేటాను ఎక్కువగా వాడుతున్నాయనే వివరాలు తెలుస్తాయి. విడిగా ఒక్కో యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి సింక్రనైజేషన్ ను టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు.

యాప్ కిల్లర్
అడ్వాన్స్డ్ టాస్క్ కిల్లర్ అనే ఒక యాప్ ఉంది. దీన్ని ఇన్ స్టాల్ చేసుకుంటే అధికంగా ర్యామ్ ను వినియోగించుకునే, ఫోన్ ను స్లో చేస్తున్న ఏ యాప్ ను అయినా సులభంగా కిల్ చేయవచ్చు.

క్యాచే డేటా క్లియర్ చేయాలి...
యాప్స్ ను వాడుతున్నప్పుడు క్యాచ్డ్ డేటా పోగుపడుతుంది. వాటిని క్లియర్ చేస్తుండాలి. క్యాచే అంటే ఏంటో తెలుసుకుంటే దీని గురించి మరింతగా అర్థం అవుతుంది. ఉదాహరణకు మీరు మొదటి సారి ఓ కొత్త ప్రాంతానికి వెళ్లారనుకోండి. ఆ మార్గమంతా మీ మెదడులోకి చేరిపోతుంది. దాంతో రెండో సారి ఆ ప్రాంతానికి వెళ్లేటప్పుడు తడుముకోకుండా వేగంగా చేరుకుంటారు. కారణం ఆ మార్గం గురించిన సమాచారం మీ మెదడులో క్యాచేగా ఉండిపోవడం వల్లే. అచ్చం ఇలాగే క్యాచ్డ్ డేటా పనిచేస్తుంది. మీరు ఓ వెబ్ సైట్ లేదా యాప్ ను యాక్సెస్ చేసినప్పుడు వాటికి సంబంధించిన సమాచారాన్ని మీ ఫోన్ క్యాచే ఫైల్స్ రూపంలో నిల్వ చేస్తుంది. తర్వాత మరోసారి అదే వెబ్ సైట్ లేదా యాప్ ను తెరిచే ప్రయత్నం చేసినప్పుడు అంతకుముందు నిల్వ ఉన్న సమాచారం ఆధారంగా వెంటనే ఓపెన్ చేస్తుంది.  
representational imageక్యాచ్డ్ డేటా నిల్వ చేయడానికి ప్రధాన కారణం సంబంధిత వెబ్ సైట్లు, యాప్స్ ను తిరిగి ఓపెన్ చేసినప్పుడు వేగంగా లోడ్ చేసేందుకే. ఇందుకోసం యాక్సెస్ చేసిన ప్రతీ సైట్, యాప్ సమాచారం క్యాచేలుగా లోడ్ అయి ఉంటుంది. ఇదంతా ఫోన్ మెమొరీపై భారాన్ని మోపుతుంది.

రెగ్యులర్ గా మీరు యాక్సెస్ చేసే వెబ్ సైట్లు, యాప్స్ కు సంబంధించిన క్యాచే డేటా నిల్వ ఉండడం ఉపయోగమే. అదే సమయంలో ఎప్పుడో ఒకసారి సందర్శించిన సైట్ల క్యాచే డేటా కూడా పోగయి ఉంటుంది కదా. అందుకే ఫోన్ స్లో అయితే ఈ క్యాచేలను క్లియర్ చేసేసుకోవాలి. దీనివల్ల తిరిగి ఫోన్ వేగాన్ని అందుకుంటుంది. క్యాచేను క్లియర్ చేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఇలా పాత క్యాచే డేటాను డిలీట్ చేసేస్తే ఆ తర్వాత తిరిగి రెగ్యులర్ యాప్స్, వెబ్ సైట్లను యాక్సెస్ చేసినప్పుడు ఓపెన్ అవడానికి కాస్తంత సమయం తీసుకుంటుంది.

అయితే, ఈ తేడా కేవలం సెకండ్లలోనే ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఎందుకు డిలీట్ చేయడం? అన్న సందేహం రావచ్చు. ఎందుకంటే క్యాచ్డ్ డేటా అన్నది మీకు అవసరమైన సైట్లదే కాదు, ఎప్పుడో ఒకసారి చూసిన సైట్ కు సంబంధించిన క్యాచే, గతంలో ఇన్ స్టాల్ చేసుకుని డిలీట్ చేసిన యాప్స్ తాలూకూ క్యాచే కూడా అనవసరంగా ఫోన్లో పోగై ఉండడం వల్ల స్లో అవుతుంది.

సెట్టింగ్స్ లో స్టోరేజీ లేదా మెమొరీ ఆప్షన్ కు వెళ్లితే అక్కడ ఒక్కో యాప్ ఎంత మేర డేటా వినియోగించుకుందీ జాబితా ఉంటుంది. ఒక దాన్ని సెలక్ట్ చేసుకున్న తర్వాత అందులో స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే క్యాచే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడే క్లియర్ క్యాచేను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా కొన్ని కంపెనీల మోడళ్లలో డిఫాల్ట్ గానే యాప్ క్యాచే క్లీనర్ యాప్స్ కూడా ఉంటున్నాయి. లేదంటే యాప్ క్యాచే క్లీనర్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటే ఒకేసారి అన్ని యాప్స్ లోని క్యాచే డేటాను డిలీట్ చేసుకోవచ్చు.

యానిమేషన్స్
representational imageయానిమేషన్స్ అన్నవి స్మార్ట్ ఫోన్ ను అందంగా కనిపించేందుకు ఉద్దేశించినవి. అంతకుకుమించి వీటి వల్ల ఉపయోగం లేదు. కనుక ఆండ్రాయిడ్ ఫోన్ స్లో అయిందన్న అనుభవాన్ని ఎదుర్కొనే వారు యానిమేషన్స్ ను టర్న్ ఆఫ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనివల్ల ఇతర ఫంక్షన్లకు ఎటువంటి విఘాతం కలగదు. యానిమేషన్స్ ను ఆఫ్ చేసుకోవాలంటే డెవలపర్స్ ఆప్షన్ కు వెళ్లాలి. ఇది ఫోన్ సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ కు వెళితే అక్కడ బిల్డ్ నంబర్ అన్న ఆప్షన్ ఉంటుంది. దాన్ని వరుసగా ఏడు సార్లు ట్యాప్ చేయాలి. అప్పుడు ఓపెన్ అవుతుంది. అందులో డెవలపర్ ఆప్షన్స్ ఉంటుంది. దీనిలోకి వెళితే యానిమేషన్స్ రిజల్యూషన్ ను తగ్గించుకోవడం లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. విండో యానిమేషన్ స్కేల్ డిఫాల్ట్ గా 1ఎక్స్ లో ఉంటుంది. దీన్ని 0.5ఎక్స్ కు తగ్గించుకోవచ్చు. దాంతో ఫోన్ కొంచెం స్పీడ్ పెరుగుతుంది. పూర్తిగా ఆఫ్ చేస్తే మరికొంత అదనపు వేగం అందుకుంటుంది.

డెవలపర్స్ లోనే ‘బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్’ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇందులో ‘నో బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్’, ఒక ప్రాసెస్, రెండు ప్రాసెస్ లు, మూడు ప్రాసెస్ లు, నాలుగు ప్రాసెస్ లు అని పలు ఆప్షన్లు కనిపిస్తాయి. అంటే ఏక కాలంలో మీ ఫోన్ బ్యాక్ గ్రౌండ్ లో ఎన్ని ప్రాసెస్ లు రన్ అవ్వాలన్నది మీ చేతుల్లోనే ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో తక్కువ ప్రాసెస్ లు ఆప్షన్ ఎంచుకున్నట్టయితే, మిగిలిన మెమొరీ ఇతర టాస్క్ లకు ఉపయోగపడుతుంది. దాంతో ఫోన్ సాఫీగా, వేగంగా పనిచేస్తుంది. ఒకవేళ బ్యాక్ గ్రౌండ్ లో అసలే ప్రాసెస్ వద్దనే ఆప్షన్ ఎంచుకుంటే అక్కడే ‘డోంట్ కీప్ యాక్టివిటీస్’ అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఓకే చేసుకుంటే మీరు ఏదైనా  చూసి క్లోజ్ చేసిన వెంటనే అది అయిపోతుంది.

అంతర్గత స్టోరేజీ
representational imageస్మార్ట్ ఫోన్లో ఇన్ బిల్ట్ గా ఉండే స్టోరేజీ పూర్తిగా నిండిపోయినా ఫోన్ నిదానిస్తుంది. ఎందుకంటే స్టోరేజీ సున్నాకి చేరితే కొన్ని ఫంక్షన్ల నిర్వహణ కష్టమైపోతుంది. ఫైల్స్ ను ఒక లొకేషన్ నుంచి మరో లొకేషన్ కు ట్రాన్స్ ఫర్ చేయడం కూడా నిదానిస్తుంది. ఎప్పుడూ కనీసం 10 నుంచి 20 శాతం ఇన్ బిల్ట్ స్టోరేజీ ఖాళీగా ఉంచుకోవాలి. ఇందుకోసం అవసరం లేని ఫైల్స్, యాప్స్ ను డిలీట్ చేసేయాలి. ఇన్ బిల్ట్ స్టోరేజీని కొంత ఖాళీగా ఉంచుకోవడంతోపాటు అదనపు స్టోరేజీ కావాలనుకుంటే మైక్రో ఎస్ డీ లాంటిదాన్ని వాడుకోవచ్చు. ఒకవేళ ఇన్ బిల్ట్ స్టోరేజీ పూర్తిగా నిండిపోతే మైక్రో ఎస్ డీ కార్డుకు కొంత డేటాను బదిలీ చేసుకోవాలి. లేదంటే ఇన్ బిల్ట్ గానే అధిక స్టోరేజీ ఉండే మోడల్ తీసుకోవాలి.

కస్టమ్ రామ్
ఇది అందరికీ కాదు. ఎక్కువ సమయం పాటు ఫోన్ ను ఉపయోగించేవారు, ఫోన్ చాలా వేగంగా ఉండాలని కోరుకునే వారి కోసమే. ఆండ్రాయిడ్ ఫోన్ స్లో అయితే కస్టమ్ రామ్ ను వినియోగించడం ద్వారా వేగంగా మార్చుకోవచ్చు. సాధారణంగా ఫోన్ తో పాటు వచ్చే యూఐ, ఫర్మ్ వేర్ కంటే కస్టమ్ రామ్ తక్కువ వనరులను వినియోగించుకుంటుంది. ఫోన్ పై ఎక్కువ భారం వేయదు. కస్టమ్ రామ్ అంటే ఫోన్ తయారీదారుడు కాకుండా మూడో పార్టీ అందజేసింది. దీన్ని ఇన్ స్టాల్ చేసుకునే విషయంలో నిపుణులను సంప్రదించడం మంచిది.

సాఫ్ట్ వేర్ అప్ టు డేట్
representational imageసిస్టమ్ లో సాఫ్ట్ వేర్ ఎప్పటికప్పుడు అప్ టు డేట్ (తాజా వెర్షన్ తో) ఉండాలి. సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ అన్నవి కొన్ని అదనపు ఫీచర్లతో వస్తుంటాయి. పనితీరుపై ప్రభావం చూపించే బగ్స్ ను తొలగించి అప్ డేట్ వెర్షన్ తీసుకురావడం జరుగుతుంది. అందుకే కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే అప్ డేట్ చేసుకోవాలి. ఇందుకోసం సెట్టింగ్స్ లో సిస్టమ్ అప్ డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎంచుకోవాలి.

ఫ్యాక్టరీ డేటా రీసెట్
ఇక్కడ చెప్పుకున్న అన్ని మెథడ్స్ ను ట్రై చేసిన తర్వాత కూడా ఫోన్ అలా స్లోగానే ఉంటే యూజర్ చేతిలో ఉన్న చివరి అస్త్రం ఫ్యాక్టరీ డేటా రీసెట్. మీ ఫోన్లో ఉన్న ముఖ్యమైన ఫైల్స్, డేటా అంతంటినీ ఎక్స్ టర్నల్ మెమొరీ కార్డు లేదా సిస్టమ్ లోకి కాపీ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ సెట్టింగ్స్ లో రీస్టోర్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ను ఓకే చేయాలి. దాంతో ఫోన్ కొన్నప్పుడు ఎలా వచ్చిందో తిరిగి అదే స్థాయికి వెళుతుంది. ఫోన్లో ఉన్న యాప్స్ సహా సమస్త సమాచారం డిలీట్ అయిపోతుంది.  దీనివల్ల ఫోన్ తిరిగి వేగం అందుకుంటుంది. ఇది చేసిన తర్వాత కూడా మీ ఫోన్ పనితీరు ఎడ్లబండి మాదిరిగానే అనిపిస్తే  మంచి కాన్ఫిగరేషన్ తో ఉన్న మొబైల్ ను కొనుగోలు చేయడమే పరిష్కారం.


More Articles