బ్యాంకుల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్... ప్రీమియం తక్కువే... మరి లాభం ఎంత?

వైద్య బీమా పాలసీ అవసరం నేడు ప్రతి ఒక్క కుటుంబానికీ ఉంది. వైద్య చికిత్సల ఖర్చులు తడిసి మోపెడు అవుతున్న రోజుల్లో అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే బీమా లేని సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. వైద్య బీమా పాలసీని నేరుగా బీమా సంస్థ నుంచి తీసుకుంటే ప్రయోజనమా? లేక బ్యాంకు శాఖల నుంచి తీసుకుంటే లాభదాయకమా? అన్న ప్రశ్న ఇటీవల తరచుగా ఎదురవుతోంది. దీనికి కారణం బ్యాంకులు బీమా పాలసీలను తక్కువ ప్రీమియానికి ఆఫర్ చేస్తుండడమే. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఏది లాభకరమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


నేడు దాదాపుగా అన్ని బ్యాంకులు వైద్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. ప్రీమియం, ఫీచర్ల పరంగా ఇవి చాలా ఆకర్షణీయంగానూ ఉంటున్నాయి. అలా అని ఈ పాలసీలు నిజంగా ప్రయోజనకరమా? అంటే సమాధానం కోసం మరిన్ని వివరాలను పరిశీలించాల్సిందే. బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ పాలసీలను అందించడం వెనుక రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి ఆయా పాలసీల ద్వారా కమిషన్ రాబట్టుకోవడం. రెండోది కొంచెం తక్కువ ప్రీమియానికే ఆఫర్ చేయడం ద్వారా ఉన్న కస్టమర్లను కాపాడుకోవడం, కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడం.  

లాభాలు
representational imageసాధారణంగా బ్యాంకులు ఆఫర్ చేసే వైద్య బీమా పాలసీల ప్రీమియం, బీమా సంస్థలు నుంచి తీసుకునే పాలసీల ప్రీమియం కంటే తక్కువగా ఉంటుంది. బ్యాంకులకు సాధారణంగా ఖాతాదారులు లక్షల్లో ఉంటారు. దీంతో ఇవి సాధారణ బీమా కంపెనీలతో టైఅప్ అయ్యి తమ ఖాతాదారులకు తక్కువ ప్రీమియానికే బీమాను అందించగలుగుతున్నాయి. బీమా సంస్థలు సైతం బ్యాంకులకు ఉన్న విస్తృత ఖాతాదారుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని తక్కువ ప్రీమియానికే వీటిని అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రీమియం తక్కువగా ఉండడానికి ఇదే ప్రధాన కారణం. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కొన్ని మరీ తక్కువ ప్రీమియానికే పాలసీలను ఆఫర్ చేస్తుండడం గమనార్హం.

ఉదాహరణకు 'సింద్ఆరోగ్య' పేరుతో సిండికేట్ బ్యాంకు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ తో టైఅప్ అయి పాలసీని అందిస్తోంది. ఇందులో 30 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వారి వరకూ అందరికీ ఒకటే ప్రీమియం. వయసును బట్టి పెరగకపోవడం ఆకర్షణీయం. ఇదే పాలసీని నేషనల్ ఇన్సూరెన్స్ నుంచి నేరుగా తీసుకోవాలనుకుంటే 55 ఏళ్ల వ్యక్తికి రూ.10,000 వరకు ప్రీమియం ఉంటుంది. కానీ, ఇదే వయసున్న వ్యక్తి బ్యాంకు ఆఫ్ బరోడా అందించే హెల్త్ పాలసీ (దంపతులు, ఇద్దరు పిల్లలకు) తీసుకుంటే ప్రీమియం కేవలం రూ.4,500 మాత్రమే. పైగా బ్యాంక్ ఆఫ్ బరోడా హెల్త్ పాలసీలో రూమ్ అద్దెలు, వైద్యులు ఫీజలకు సంబంధించి ఎటువంటి సబ్ లిమిట్, కో పేమెంట్ తరహా షరతులు ఏవీ లేకపోవడం ఆకర్షణీయం.

representational imageబ్యాంకుల ద్వారా ఖాతాదారుడు తన జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ కలిపి పాలసీ తీసుకునే అవకాశం ఉండడం సానుకూలం. ఈ పాలసీలో 65 ఏళ్ల వయసు లోపున్న వారందరికీ ప్రీమియం ఒకటే. ఈ వయసు దాటితే ప్రీమియం 25 శాతం పెరుగుతుంది. బ్యాంకులు ఒప్పందం సమయంలోనే బీమా సంస్థలకు భారీ వ్యాపారం కల్పిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మార్కెట్లో ఉన్న పాలసీ కంటే మెరుగైన పాలసీని తక్కువ ప్రీమియానికే అందివ్వగలుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా వైద్య బీమా పాలసీ (వ్యక్తిగత పాలసీ/ఫ్యామిలీ ఫ్లోటర్/ కంపెనీ అందించే గ్రూప్ హెల్త్ పాలసీ) ప్రీమియం ఏటేటా పెరుగుతూనే ఉంటుంది. మరి బ్యాంకులు అందించే పాలసీల ప్రీమియం స్థిరంగా ఉండడం ఆకర్షణీయమే. కానీ, కొన్ని బ్యాంకులు మాత్రం వయసు ఆధారంగా ప్రీమియం ఏటేటా పెరిగే పాలసీలనే అందిస్తున్నాయి. కనుక పాలసీ తీసుకునే ముందే వివరాలు తెలుసుకోవాలి.

ఇక కెనరా బ్యాంకు అందించే ఈజీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే అన్ని వయసుల వారికీ ఒకటే ప్రీమియంతో ఆఫర్ చేస్తుండడం విశేషం. వరుసుగా మూడేళ్ల పాటు క్లెయిమ్ లు లేకపోతే వైద్య బీమా మొత్తంలో ఒక శాతాన్ని హెల్త్ చెకప్ ల కోసం ఇచ్చే ఫీచర్ కూడా ఉంది. ఆస్పత్రి పాలవడానికి ముందు 30 రోజులు, తర్వాత 60 రోజుల వరకు వైద్య వ్యయాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే, అంబులెన్స్ చార్జీలు రూ.1,000 వరకు పొందొచ్చు. బ్యాంకులు అందించే పాలసీల్లో కొన్నింటిలో రెండో ఏట నుంచి మేటర్నిటీ కవరేజీ కూడా ఉంటోంది. పాలసీ మొత్తంలో ఇది 5 శాతానికే పరిమితం. ఉదాహరణకు రూ.3 లక్షల బీమా పాలసీ తీసుకుంటే రూ.15,000 మేటర్నిటీ కవరేజీకే పరిమితం. క్లెయిమ్ లు అన్నవి పాలసీదారుడు నేరుగా బీమా సంస్థ వద్దే దాఖలు చేసుకోవాలి.

representational imageవ్యక్తిగత పాలసీలు లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు కానీయండి. బీమా సంస్థల నుంచి తీసుకోవాలనుకుంటే ఓ వయసు తర్వాత వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. కానీ, బ్యాంకుల నుంచి తీసుకునే పాలసీలకు ఈ కండిషన్ లేదు. 65 ఏళ్ల వయసు వరకూ ఈ మినహాయింపు ఉంది. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు బీమా కవరేజీ మాత్రం రెండింటిలోనూ ఒకే విధంగా ఉంటుంది. తీవ్ర వ్యాధులు, ఇతర కారణాల వల్ల విడిగా వైద్య బీమా పాలసీని ఏ బీమా సంస్థ నుంచి పొందలేని వారికి గొప్ప అవకాశం బ్యాంకులు అందించే పాలసీ. బ్యాంకు ఖాతాదారుడిగా దీన్ని సులభంగానే పొందొచ్చు. యాక్సిడెంటల్, క్రిటికల్ ఇల్ నెస్ (తీవ్ర అనారోగ్యం) కవరేజీలు కూడా బ్యాంకులు అందించే పాలసీల్లో ఉన్నాయి. జీవించి ఉన్నంత కాలం ఏటా ఈ పాలసీలను రెన్యువల్ చేసుకోవచ్చు. తద్వారా జీవిత కాలం పాటు కవరేజీకి అవకాశం ఉంది. కెనరా బ్యాంకు ఈజీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో లైఫ్ టైమ్ రెన్యువల్ ఆప్షన్ ఉంది.

ప్రతికూలతలు
representational imageబ్యాంకులు అందించే బీమా పాలసీలకు పలు ప్రయోజనాలు ఉన్నట్టే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వైద్యబీమా పాలసీ తీసుకోవాలనుకుంటే ముందు ఖాతాదారులుగా చేరాల్సి ఉంటుంది. సేవింగ్స్ ఖాతాదారులకే ఈ అవకాశం. బ్యాంకులో అప్పటికే ఖాతా ఉంటే ఫర్వాలేదు. కానీ, ఓ బ్యాంకు అందిస్తున్న వైద్య బీమా పాలసీ కోసమే సేవింగ్స్ ఖాతా తెరిస్తే అందులో కనీస బ్యాలన్స్ నిర్వహణతోపాటు అప్పుడప్పుడూ లావాదేవీలు నిర్వహిస్తూ ఉండాల్సి వస్తుంది.

బ్యాంకులు అందించే పాలసీల్లో బీమా మొత్తంపై పరిమితి ఉంటుంది. ఇది సాధారణంగా రూ.5 లక్షలుగా ఉంది. అయితే, ఇండియన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు మాత్రం రూ.10-20 లక్షల కవరేజీకి వీలు కల్పిస్తున్నాయి. కొన్ని 65 ఏళ్లు దాటిన తర్వాత బీమా మొత్తంపై గరిష్ట పరిమితి రూ.5 లక్షలుగా అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఈ విధమైన ఆంక్షలు ఇబ్బందికరమే. కానీ బీమా సంస్థల నుంచి తీసుకునే పాలసీల్లో ప్రీమియం అధికంగా చెల్లిస్తే ఎంత మొత్తానికైనా వైద్యబీమా పొందొచ్చు.

representational imageసాధారణంగా బ్యాంకులు అందించే వైద్య బీమా పాలసీల ప్రీమియం తక్కువగా ఉన్నప్పటికీ ఇది శాశ్వతం అని చెప్పలేం. బ్యాంకులు అందించే పాలసీల కాల వ్యవధి ఏడాది మాత్రమే. బీమా సంస్థతో ఒప్పందం చేసుకుని బ్యాంకులు వీటిని అందిస్తుంటాయి. ఒక విధంగా ఇది గ్రూపు హెల్త్ పాలసీ వంటిది. ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు అందరికీ వర్తించే మాదిరిగానే  సదరు బ్యాంకు ఖాతాదారులకు ఉద్దేశించినది. కనుక ఒక ఏడాదిలో బ్యాంకు ఖాతాదారుల నుంచి వైద్య బీమా పరిహారం కోరుతూ అధిక క్లెయిమ్ లు వచ్చాయనుకోండి. అప్పుడు బీమా సంస్థలు మరుసటి ఏడాది రెన్యువల్ సమయంలో ప్రీమియం పెంచేస్తాయి. కనుక ప్రీమియం ఎప్పుడూ తక్కువ స్థాయిలోనే కొనసాగుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు.

బ్యాంకులు అందించే బీమా పాలసీల ఫీచర్లు ఎప్పుడైనా మారిపోవచ్చు. బీమా కంపెనీలు తమ ప్రయోజనాల కోణంలో వీటిలో మార్పులు చేసే అవకాశం ఉంది. అందుకే పాలసీ తీసుకునే ముందే బ్యాంకు నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

బ్యాంకులకు, బీమా సంస్థలకు మధ్య ఒప్పందం పునరుద్ధరణకు నోచుకోకపోతే ఖాతాదారులు బీమా రక్షణ కోల్పోవాల్సి వస్తుంది. ఉదాహరణకు బీమా సంస్థ పాలసీల్లో మార్పులు చేస్తూ, ప్రీమియం పెంచేస్తుంటే అది సమంజసం కాదని బ్యాంకు భావిస్తే... బీమా సంస్థతో ఒప్పందాన్ని కొనసాగించుకోకుండా పుల్ స్టాప్ పెట్టేయవచ్చు. దీంతో బ్యాంకు మరో బీమా సంస్థతో టైఅప్ అయి పాలసీని అందించే వరకూ వేచి చూడాల్సి వస్తుంది. ఈ కాలంలో బీమా రక్షణ ఉండదు. పెద్ద వయసులో ఉన్న వారికి ఇది ప్రతికూలమే అవుతుంది.

representational imageకొన్ని బ్యాంకులు బీమా పాలసీలు అందించడం వరకే పరిమితం అవుతున్నాయి. అంటే పాలసీ తీసుకున్న వారు క్లెయిమ్ సమయంలో బ్యాంకు సాయం పొందడానికి అవకాశం ఉండదు. నేరుగా బీమా సంస్థనే సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకులు అందించే వైద్య బీమా పాలసీల్లో ముఖ్యంగా రూమ్ రెంట్ సబ్ లిమిట్, కో పేమెంట్ తరహా నిబంధనలు ఉన్నాయేమో పరిశీలించాలి. కెనరాబ్యాంకు అందించే అపోలో మ్యునిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో ఈ విధమైన పరిమితులు ఏవీ లేవు. ఈ విషయం పాలసీ పత్రాల్లోనే ఉంటుంది. అలాగే, బ్యాంకు అందిస్తున్నది గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీనా లేక ఇండివిడ్యువల్ హెల్త్ పాలసీనా (ఫ్యామిలీ ఫ్లోటరీ కూడా వ్యక్తిగత పాలసీయే అవుతుంది) అన్నది తెలుసుకోవాలి.

బ్యాంకుల నుంచి పాలసీ తీసుకునేట్టు అయితే తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. జీవిత కాలం పాటు రెన్యువల్ కు అవకాశం ఉందో లేదో కనుక్కోవాలి. కొన్నింటిలో ఇది 80 ఏళ్ల వరకే ఉంది. అలాగే, కొన్ని పాలసీల్లో వైద్య పరీక్షలకు అయ్యే వ్యయాలకు పరిహారం వర్తించడం లేదు. ఇక పాలసీ తీసుకునేందుకు ప్రవేశ వయసు ఎంతో కూడా కనుక్కోవాలి. అన్ని బ్యాంకుల పాలసీల్లోనూ ముందస్తు వ్యాధులకు కవరేజీ కోసం కనీసం మూడేళ్ల పాటు వేచి ఉండే కాలం అమల్లో ఉంది.

చాలా ముఖ్యమైనవి
representational imageబ్యాంకులు అందించే బీమా పాలసీల్లో మంచి ప్రయోజనాలు ఉన్నట్టే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వీటిలో బ్యాంకుల తరఫున తీసుకున్న పాలసీలకు అటు బ్యాంకు నుంచి, ఇటు బీమా కంపెనీ నుంచి సరైన సేవలు అందుతున్నాయా? లేదా అని. ఈ విషయంలో మీరు ఓ స్పష్టతకు వచ్చే ముందు తోటి బ్యాంకు ఖాతాదారుల్లో అప్పటికే ఈ పాలసీ తీసుకున్న వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకోవడం మంచిది. క్లెయిమ్ చేయాల్సి వస్తే ఎవరిని సంప్రదించాలి, ఎవరికి మెయిల్ చేయాలి? తదితర వివరాలు పాలసీ తీసుకునే ముందే అడిగితే మంచిది. సంబంధిత వివరాలు తెలుసుకుని సొంతంగా డీల్ చేయగలమనుకుంటే బ్యాంకుల ద్వారా పాలసీ తీసుకోవచ్చు. అలాగే, ఉన్నట్టుండి బీమా కంపెనీ ఓ ఏడాది ప్రీమియంను పెంచాలని నిర్ణయిస్తే ఆ ప్రభావం పాలసీదారులపై పడుతుంది. ప్రీమియిం, ఫీఛర్లు అన్నవి ఏటేటా బ్యాంకు, బీమా కంపెనీల మధ్య జరిగే చర్చల ఫలితాలపైనే ఆధారపడి ఉంటాయి. కొన్ని బ్యాంకుల పాలసీల్లో పలు మినహాయింపులు ఉంటున్నాయి. కొన్నింటికీ కవరేజీ వర్తించదు. ఈ విషయాలను పూర్తిగా తెలుసుకునేందుకు పాలసీ పత్రాలను సమగ్రంగా చదవడమే పరిష్కారం. ఎక్కువ వ్యాధులకు, అవుట్ పేషెంట్ గా తీసుకునే చికిత్సలకు కవరేజీ ఉంటేనే లాభదాయకం.


More Articles