జీరో బ్యాలన్స్ ఖాతా ఏ బ్యాంకులో అయినా ఓపెన్ చేయవచ్చు..!

ఖాతాలో కనీస బ్యాలన్స్ ఉంచాలన్నది ఒక నిబంధన. దీన్ని ఖాతాదారులు విధిగా పాటించాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే బ్యాంకులు జరిమానాలను విధిస్తాయి. అయితే, సామాన్యులు అందరికీ కనీస బ్యాలన్స్ ఉంచడం అన్నది అన్ని వేళల్లోనూ సాధ్యపడకపోవచ్చు. మరి దీనికి పరిష్కారం లేదా? అని అంటే ఉందనే చెప్పాలి. అదే బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతా (బీఎస్ బీడీఏ). జీరో బ్యాలన్స్ తో ప్రతి ఒక్కరూ ఈ ఖాతాను హ్యాపీగా నిర్వహించుకోవచ్చు. దీని వివరాల గురించి తెలుసుకుందాం.


బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాను ఏ బ్యాంకులో అయినా ఎవరైనా ప్రారంభించేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ ఖాతాను సున్నా బ్యాలన్స్ తో ప్రారంభించొచ్చు. ఇందులో ఎప్పుడూ కనీస నగదు నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. కనీస నగదు బ్యాలన్స్ నిబంధన అన్నది కేవలం రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలకే. కనుక రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలన్స్ ఉంచకపోతే జరిమానాలు చెల్లించుకోవాలి. బేసిక్ సేవింగ్స్ ఖాతాకు ఈ నిబంధన లేదు కనుక ఎటువంటి జరిమానాల భయం అక్కర్లేదు. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతా సౌకర్యాన్ని ప్రతి ఒక్క బ్యాంకు ఆఫర్ చేయాలని రిజర్వ్ బ్యాంకు నిర్దేశించింది.

వడ్డీ రేటు సౌకర్యాలు
బేసిక్ సేవింగ్స్ ఖాతాలో ఉన్న నగదు నిల్వలపై, రెగ్యులర్ సేవింగ్స్ ఖాతా మాదిరిగానే వడ్డీ రేటు అమలవుతుంది. కనుక ఖాతాదారులు వడ్డీ నష్టపోయేదేమీ ఉండదు. అలాగే, బ్యాంకు శాఖలో నగదు జమ చేయడాలు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలు, చెక్ బుక్ సౌకర్యం, ఆన్ లైన్ లో నగదు లావాదేవీలు అన్నీ చేసుకోవచ్చు.

పరిమితులు, ప్రతికూలతలు
కొన్ని బ్యాంకులు బేసిక్ సేవింగ్స్ ఖాతా తెరిచే విషయమై ఖాతాదారులకు తలాతోక లేని నిబంధనలను అమలు చేస్తున్నాయి. వారి వయసు, ఆదాయ స్థాయిలను బట్టి అనుమతిస్తున్నాయి. కానీ, రిజర్వ్ బ్యాంకు మాత్రం ఈ విధమైన పరిమితులు ఏవీ ఖాతాదారుల నెత్తిన రుద్దొద్దని స్పష్టంగా ఆదేశించింది. అయినప్పటికీ, ఖాతా నిర్వహణ విషయంలో పలు బ్యాంకులు కొన్ని నియంత్రణలను అమలు చేస్తున్నాయి.

representational imageఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని డిపాజిట్ల ( జమలు ) విలువ రూ.లక్ష మించకూడదు. ఒక నెలలో అన్ని నగదు ఉపసంహరణలు, నగదు బదిలీల విలువ రూ.10,000 దాటరాదు. ఏడాదిలో ఏ సమయంలో చూసినా ఖాతాలో రూ.50,000కు మించి బ్యాలన్స్ ఉండకూడదు. నగదు ఉపసంహరణలు, డిపాజిట్లపై ఆర్ బీఐ ఏ విధమైన ఆంక్షలు విధించలేదు. కానీ, బ్యాంకులే ఈ ఖాతాల విషయంలో కొన్ని పరిమితులను ప్రవేశపెట్టాయి.

ఒక నెలలో ఎన్ని సార్లయినా నగదు డిపాజిట్ చేసుకోవచ్చు గానీ, నగదు ఉపసంహరణలు మాత్రం నాలుగు సార్లే ఉచితం. ఏటీఎం నుంచి కానీ, నెట్ బ్యాంకింగ్ లో ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా నగదు బదిలీ, బ్యాంకు శాఖకు వెళ్లి తీసుకునే నగదు కానీయండి. ఏ రూపంలో అయినా నెలలో మొత్తం నాలుగు నగదు ఉపసంహరణలకు ఇది అమలవుతుంది. సాధారణ సేవింగ్స్ ఖాతాలకైతే కేవైసీ (కస్టమర్ గురించి తెలుసుకోవడం) నిబంధనలను పూర్తిగా పాటించాలి. బేసిక్ సేవింగ్స్ ఖాతాకు పూర్తి స్థాయిలో కేవైసీ పత్రాలను సమర్పించకపోయినా ప్రారంభించొచ్చు. బేసిక్ సేవింగ్స్ ఖాతాలన్నవి ప్రారంభంలో ఏడాది కాల పరిమితితో ఉంటాయి. ఏడాది తర్వాత వాటిని మరో ఏడాదికి పొడిగించుకోవచ్చు.

ఒకరు ఒక ఖాతానే
representational imageఒకరు ఒక బేసిక్ సేవింగ్స్ ఖాతానే తెరిచేందుకు వీలుంటుంది. అలాగే, అదే బ్యాంకులో అప్పటికే సాధారణ సేవింగ్స్ ఖాతా ఉంటే దాన్ని బేసిక్ సేవింగ్స్ ఖాతాగా మార్చుకునేందుకు అవకాశం లేదు. పైగా ఇందులో ఉన్న సమస్య ఏంటంటే సాధారణ ఖాతా ఉన్న వారు బేసిక్ సేవింగ్స్ ఖాతాను తెరిచినట్టయితే, ఆ తర్వాత నెలలోపు సాధారణ ఖాతాను క్లోజ్ చేయాలి. ఖాతాదారుడు ఈ పనిచేయకపోతే సమాచారం ఇచ్చి బ్యాంకులే ఖాతాను మూసేస్తాయి. ఎక్కువగా లావాదేవీలు నిర్వహించని వారు, కనీస బ్యాలన్స్ కొనసాగించడం వీలు పడని వారు హాయిగా బేసిక్ సేవింగ్స్ ఖాతాను ప్రారంభించి, కొనసాగించుకోవచ్చు. విద్యార్థులు, తక్కువ ఆదాయ వర్గాలు, సీనియర్ సిటిజన్స్ కు ఇవి అనుకూలంగానే ఉంటాయి.


More Articles