బీమా ఏ వయసు వరకు తీసుకోవాలి..? నిండు నూరేళ్లు అవసరమా..?
జీవిత బీమా అవసరం సంపాదనలో పడిన ప్రతీ ఒక్కరికీ అవసరమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, జీవిత బీమాలోనూ ఒకటికి మించిన ఆప్షన్లు కొందరిని సందేహంలోకి నెట్టేస్తాయి. ముఖ్యంగా బీమా పాలసీని ఏ వయసు వరకు తీసుకోవాలన్నది ఓ పట్టాన అర్థం కాదు. అవసరాన్ని బట్టి నిండు నూరేళ్ల వరకు పాలసీని తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీమా పాలసీ ఎప్పటి వరకు తీసుకోవాలన్న దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
టర్మ్ పాలసీ
నిర్ణీత కాలానికి జీవిత బీమా రక్షణనిచ్చే పాలసీ ఇది. కాల వ్యవధి తర్వాత రాబడుల రూపంలో ఏమీ తిరిగి రాదు. తక్కువ ప్రీమియానికి ఎక్కువ రక్షణ ఈ పాలసీల్లో ఉంటుంది. ఇవి కాకుండా జీవిత బీమా రక్షణతోపాటు కాల వ్యవధి ముగిసిన తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే రాబడులను అందించే సంప్రదాయ బీమా పొదుపు పథకాలు ఉండనే ఉన్నాయి. వీటిలో ప్రీమియం ఎక్కువ, రక్షణ తక్కువ ఉంటుంది. వీటిలోనే జీవితాంతం రక్షణనిచ్చే పాలసీలను హోల్ లైఫ్ పాలసీలు లేదా పర్మినెంట్ పాలసీలుగా వ్యవహరిస్తున్నారు.
హోల్ లైఫ్ పాలసీ
ఈ పాలసీల్లో ప్రీమియం ఎక్కువే ఉంటుంది. 40 ఏళ్లకు పైన వయసున్న వారు పాలసీ తీసుకోవాలనుకుంటే హోల్ లైఫ్ పాలసీలు పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. జీవిత భాగస్వామి, పిల్లల రూపంలో వారిపై బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కనుక వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీవితానికి రక్షణతోపాటు ఆర్థిక భద్రత (పొదుపు) కూడా ఉండేందుకు సంప్రదాయ హోల్ లైఫ్ పాలసీలు ఎంచుకోవచ్చు.
ఒకవేళ 25 ఏళ్లలోపు వారు అయితే, సాధారణ పాలసీని తీసుకుని కాల వ్యవధి తీరే సమయంలో హోల్ లైఫ్ పాలసీని ఎంచుకోవడం ప్రయోజనకరం అంటున్నారు. ఎందుకంటే ముందు నుంచే హోల్ లైఫ్ పాలసీ ఎంచుకుంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. టర్మ్ పాలసీల్లోనూ రకాలున్నాయి. జీవితానికి రక్షణ కల్పించే బీమా పాలసీలే కాకుండా రుణాలకు సంబంధించి టర్మ్ పాలసీలు, ఇంటి సంరక్షణకు సంబంధించి, బస్సు, రైలు ప్రయాణాలకు ఇలా పలు రకాలుగా టర్మ్ పాలసీలు పనిచేస్తున్నాయి.
ఏగాన్ రెలిగేర్ సంస్థ లైఫ్ ఐటర్మ్ పాలసీని ఆఫర్ చేస్తోంది. సాధారణంగా లైఫ్ టర్మ్ పాలసీలు 30 నుంచి 35 ఏళ్లకే పరిమితం. ఈ కాల వ్యవధి వరకు ప్రీమియం చెల్లిస్తేనే పాలసీ మనుగడలో ఉంటుంది. పాలసీ కాల వ్యవధి తీరిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. కానీ హోల్ లైఫ్ పాలసీలు జీవిత కాలం రక్షణ కల్పిస్తాయి. అంటే 100 ఏళ్ల వరకు. ప్రీమియం మాత్రం పరిమిత కాలం పాటే ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి హోల్ లైఫ్ పాలసీ తీసుకుంటే ప్రీమియం 60వ ఏట వరకు కడితే సరిపోతుంది. ఆ తర్వాత నుంచి ప్రీమియం చెల్లించక్కర్లేదు. కానీ పాలసీ మాత్రం కొనసాగుతుంది.
ఏగాన్ రెలిగేర్ హోల్ లైఫ్ టర్మ్ ప్లాన్ చూస్తే, 30 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించే గడువుతో పాలసీ తీసుకుంటే 60వ ఏట వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ పాలసీ హోల్ లైఫ్ టర్మ్ ప్లాన్ గా మారుతుంది. సాధారణ ప్రీమియం చెల్లించే సమయంలో పాలసీదారుడు మరణిస్తే బీమా పరిహారం చెల్లించినట్టే, ప్రీమియం చెల్లింపు కాలం ముగిసిన తర్వాత నూరేళ్ల వరకు ఎప్పుడు మరణించినా నామినీలకు పరిహారం చెల్లించడం జరుగుతుంది. ఆ తర్వాత పాలసీని క్లోజ్ చేస్తారు. అంటే పాలసీదారుడి మరణంతో పాలసీ కూడా ముగిసి పోతుంది.
సాధారణంగా 100 ఏళ్ల లోపు ఏదో ఒక వయసులో చనిపోవడం ప్రకృతి ధర్మం. కనుక తన మరణానంతరం వారసులకు కొంత నిధి ఇద్దామనుకునేవారు, తన మరణానంతరం ఎదురయ్యే వ్యయాల భారం వారసులపై పడకూడదని ఆలోచించే వారు హోల్ లైఫ్ టర్మ్ ప్లాన్లను ఎంపిక చేసుకుంటుంటారు.
ప్రీమియం భారం
జీవితాంతం రక్షణనివ్వాలి... ఏదో ఒక రోజు మరణం సంభవిస్తుంది కనుక పరిహారం చెల్లించడం తప్పనిసరి కావడంతో హోల్ లైఫ్ పాలసీల్లో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏగాన్ రెలిగేర్ లోనే 30 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల కాలానికి రూ.కోటి బీమా కోసం టర్మ్ ప్లాన్ తీసుకుంటే ప్రీమియం 7,500. కానీ, ఇదే వ్యక్తి జీవితాంతం రక్షణనిచ్చే ఐటర్మ్ ఫరెవర్ హోల్ లైఫ్ టర్మ్ పాలసీలో ప్రీమియం ఏటా రూ.40,000 వరకు ఉంది. ఇది భారీ తేడా.
ఇంత భారీ వ్యత్యాసంతో హోల్ లైఫ్ ప్లాన్ తీసుకోవడం దండగే. కాకపోతే ప్రీమియం సాధారణ టర్మ్ ప్లాన్, హోల్ లైఫ్ పాలసీల మధ్య 10 శాతం వ్యత్యాసానికి మించకుండా ఉంటే వాటిని పరిశీలించొచ్చు. హోల్ లైఫ్ టర్మ్ ప్లాన్ కు బదులు సాధారణ టర్మ్ తో కూడిన అంటే 60వ ఏట వరకు పాలసీ తీసుకుని పైన రెలిగేర్ పాలసీలో చెప్పినట్టే 7,500 చెల్లించడం నయం. మిగిలిన మేర రిస్క్ తక్కువ ఉండే ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినా వారసులకు నిధి అందించొచ్చు. పై ఉదాహరణలో హోల్ లైఫ్ టర్మ్ ప్లాన్ కు ఏటా రూ.40,000 చెల్లించాలి. సాధారణ టర్మ్ పాలసీకి రూ.7,500 చెల్లిస్తే సరిపోతుంది.
అందుకే, సాధారణ టర్మ్ పాలసీ తీసుకుని, మరోవైపు ప్రతీ నెలా రూ.3,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్ లో 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినా 12 శాతం వార్షిక రాబడి ప్రకారం 60వ ఏట వచ్చేసరికి సుమారు కోటీ ఐదు లక్షల రూపాయల నిధి సమకూరుతుంది. అందుకే సాధారణ టర్మ్ ప్లాన్ తో పోల్చుకుంటే హోల్ లైఫ్ టర్మ్ ప్లాన్ ప్రీమియం 10 శాతానికి మించకుండా ఉంటేనే తీసుకోవాలి. ఎక్కువ ప్రీమియం ఉంటే సాధారణ పాలసీ తీసుకుని మిగిలిన మేర మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడమే బెటర్.
బీమా రక్షణ ఎప్పటి వరకు
జీవితానికి బీమా రక్షణ ఎందుకో ఆలోచించండి. తమపై ఆధారపడిన వారు ఉంటేనే బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు స్పష్టంగా చెబుతుంటారు. తనపై ఎవరూ ఆధారపడి లేనప్పుడు, ఆర్థిక బాధ్యతలు లేనప్పుడు ఓ వ్యక్తి మరణిస్తే తద్వారా వచ్చే పరిహారం ఎవరికీ అవసరం ఉండదు. కనుక ఓ వ్యక్తికి ఆర్థిక బాధ్యతలు ఉన్నంత వరకే, అతని సంపాదనపై వారసులు ఆధారపడి ఉన్నంత వరకే బీమా రక్షణ ఉంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బాధ్యతలు కొందరికి 50కే తీరిపోవచ్చు. కొందరిలో 60, కొందరిలో 70వ ఏట వరకూ ఉండొచ్చు. ఆయా పరిస్థితులను బట్టి ఎవరికి వారు తమకు ఎంత వయసు వరకు బీమా రక్షణ అవసరమో నిర్ణయించుకోవాలి.
అంతేకానీ, సాధారణ సూత్రమైన 60వ ఏట వరకు తీసుకోవడం కరెక్ట్ కాదు. కొందరు చాలా చిన్న వయసులోనే జీవితంలో మెరుగైన స్థితికి చేరుకుంటారు. అధిక సంపాదన స్థితికి వెళతారు. వీరికి, ఇతరులతో పోలిస్తే బీమా రక్షణ అంతగా అవసరం ఉండకపోవచ్చు. బీమా పాలసీల్లో గరిష్ట కాల వ్యవధి కొన్నింటిలో 30, 35 ఏళ్లు మాత్రమే ఉంటోంది. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి ఈ తరహా పాలసీ తీసుకుంటే గరిష్టంగా 35 ఏళ్లే కనుక 60వ ఏట వరకే బీమా కవరేజీ ఉంటుంది. కానీ, అప్పటికి బాధ్యతలు అన్నీ తీరిపోవాలని లేదు. కనుక గరిష్ట కాల వ్యవధిపై పరిమితులు లేని పాలసీని ఎంచుకోవడమే నయం.