చపాతీ, పరాటాకు రుచినిచ్చే గ్రీన్ పీస్ కర్రీ

పచ్చిబటానీ (గ్రీన్ పీస్) తో చేసే కూర రుచికరమైన వంటకాల్లో ఒకటి. భోజనంలోకి, చపాతీ, పరాటాలు, పూరీలకు మంచి రుచిని ఇచ్చే ఈ వంటకం తయారీ విధానం గురించి తెలుసుకుంటే, ఎవరికి వారు సొంతంగా ఇంట్లోనే ట్రై చేయవచ్చు.


గ్రీన్ పీస్ కర్రీ అనేది ఉత్తర భారతదేశ వంటకం. పచ్చిబటానీలను ఉపయోగించి చేసే వంటకం ఇది. ఇందులోకి కావాల్సిన పదార్థాలు... గ్రీన్ పీస్ కప్పున్నర, పెద్ద ఉల్లిపాయ, జీడిపప్పులు 10, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుకారం, పసుపు, ఇంగువ, ఉప్పు. దీన్ని చాలా సులభంగా చేసుకోవచ్చు. టిఫిన్ లేదా లంచ్ కోసం బాక్స్ లో తీసుకెళ్లవచ్చు.

తయారీ విధానం
representational imageముందుగా పచ్చి బటానీలను ఓ పాత్రలోకి తీసుకుని నీటితో ఒకటి రెండు సార్లు కడిగి ఆ నీరు వంపేయాలి. ఆ తర్వాత అందులో గోరువెచ్చని నీరు పోసి కొంత సమయం పాటు పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు ఉల్లిపాయను తీసుకుని దాన్ని పెద్ద ముక్కలుగా తరిగిన అనంతరం ఆ ముక్కల్ని మిక్సర్ జార్ లో వేయాలి. అలాగే ఓ నాలుగు పచ్చిమిరపకాయలు (కారం కోరుకునేదాన్ని బట్టి తీసుకోవాలి), జీడిపప్పులు వేసి, రెండు స్పూన్ల నీరు పోసి గ్రైండ్ చేయాలి. గట్టి పేస్ట్ అయిన వెంటనే ఆపేయాలి. ఇప్పుడు మూకుడు తీసుకుని దాన్ని స్టవ్ పై ఉంచాలి. అందులో కాస్తంత నూనె పోసి, అరచెంచాడు జీలకర్ర వేసి మోస్తరు మంటపై చిటపట అనేవరకు వేగనివ్వాలి. ఆ తర్వాత మంటను పూర్తిగా తగ్గించేయాలి.

ఇప్పడు మూకుడులో ఉల్లిపాయల పేస్ట్ వేసి, రెండు మూడు నిమిషాల పాటు ఉంచాలి. దీనిలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉడకనివ్వాలి. గరిటెతో మధ్య మధ్యలో మంచిగా కలుపుతూ బాగా కలిసి, సన్నని మంటపై ఉడికిన తర్వాత ఎండు కారం, పసుపు, ఇంగువ వేసి కలియబెట్టాలి. ఒక్క నిమిషం తర్వాత నీళ్లలో నానబెట్టి ఉంచుకున్న గ్రీన్ పీస్ కలిపి కొంచెం నీరుపోయాలి. తక్కువ మంటపై కొన్ని నిమిషాలు ఉంచాలి. నీరు మరుగుతున్న సమయంలో అప్పుడే తరిగిన కొత్తి మీర వేసి, నిమ్మరసం కొంత వేసి స్టవ్ కట్టేయాలి. దీంతో గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయినట్టు. పూరీ, పరోటా, చపాతీ మీకు నచ్చిన టిఫిన్, భోజనంలోకి భాగంగా ఈ టేస్టీ వంటకాన్ని తీసుకోవచ్చు.


More Articles