కొత్త సంవత్సరం... సెలబ్రిటీల తీర్మానాలు ఇలా ఉంటాయ్!... మరి మన వంతు ఏమిటి?
కొత్త సంవత్సరం సమీపిస్తోందంటే కొందరిలో కొత్త ఆశలు, ఆకాంక్షలు, కోరికలు మొగ్గ వేస్తాయి. కొత్త ఏడాదిలో అయినా అనుకున్నవి సాధించుకోవాలని, నెరవేర్చుకోవాలని బలంగా ఉంటుంది. సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కొత్త ఏడాదిలో ఏదో ఒకటి చేసేయాలని తీర్మానించుకోవడం సర్వ సాధారణం. అయితే, సెలబ్రిటీల తీర్మానాలు, వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడం ఆసక్తికరమే. అవి మనలో కొందరికి స్ఫూర్తినీయం కావచ్చు. ప్రోత్సాహాన్ని ఇవ్వొచ్చు.
జుకెర్ బర్గ్
ఫేస్ బుక్ తో పరోక్షంగా ఈ ప్రపంచాన్ని జయించిన వ్యక్తి మార్క్ జుకెర్ బర్గ్. అమెరికాలోని కనీసం 30 రాష్ట్రాల్లో పర్యటించాలని 2017 సంవత్సరారంభంలో నిర్ణయం తీసుకున్నారు. జీవితం పట్ల తన దృక్పథాన్ని మరింత ఉన్నతంగా మార్చుకునేందుకే ఇలా పర్యటించాలని అనుకున్నారు. కానీ, సంపూర్ణంగా సఫలీకృతం కాలేకపోయారు. 2016 సందర్భంగా జుకెర్ బర్గ్ ఏం తీర్మానించుకున్నారంటే... ‘‘2016 సంవత్సరానికి గాను నా ముందున్న సవాలు ఏంటంటే... ఇంటిని నడిపించే సులభమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను రూపొందించడం’’ అంటే ఇంట్లోని లైట్స్, ఉష్ణోగ్రత, వస్తువులు, సంగీతం, భద్రత తదితర పనులు అన్నీ చేసిపెట్టేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను రూపొందించడం ఆయన లక్ష్యం. అనుకున్నది పూర్తి చేశారు కూడా.
2015 సందర్భంగా వారం విడిచి వారం ఓ పుస్తకం చవాలని నిర్ణయం తీసుకున్నారు. భిన్న సంస్కృతులు, నమ్మకాలు, చరిత్రలు, టెక్నాలజీలకు సంబంధించి పుస్తకాలు చదవాలన్నది ఆయన అభిలాష.
షారూక్ ఖాన్
బాలీవుడ్ అగ్ర నటుడు షారూక్ ఖాన్ అయితే 2010 నుంచీ పొగతాగడాన్ని మానేయాలని ప్రతీ సంవత్సరం ఆరంభంలో తీర్మానం చేసేస్తున్నారు. కానీ మానలేకపోతున్నారు. ‘ఇది చెడు అలవాటని నాకు తెలుసు. కానీ, ఈ అలవాటు నన్ను వీడడం లేదు. చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నాను. దీని వల్ల కలిగే దుష్ఫలితాల గురించి తెలుసు’ అని షారూక్ ఓ సందర్భంలో తన బలహీనత గురించి ఆవేదన కూడా చెందారు. షారూక్ కు ఇద్దరు కుమార్తెలు కాగా, వారిలో సుహానాకు అసలు స్మోకింగ్ అంటే గిట్టదని ఆయనే చెప్పారు.
బిపాసాబసు
హాని కలిగించని అబద్ధాలకోరుగా మారాలన్నది బాలీవుడ్ నటీమణి బిపాసాబసు నూతన సంవత్సర తీర్మానం. కొన్ని క్లిష్ట సందర్భాల నుంచి అబద్ధాలే బయటపడేస్తాయని ఆమె అన్నారు. అందుకే.... అబద్ధాలు ఆడే కళను నేర్చుకోవాలని ఈమె 2011 సందర్భంగా తీర్మానించుకున్నారు. కానీ, నేర్చుకోవడంలో విఫలం చెందారట. 2012లోనూ ఇదే నిర్ణయం తీసుకున్నారు.
సోనూ సూద్
తెలుగు, హిందీ నటుడు సోనూ సూద్ గతంలో నూతన సంవత్సరం సందర్భంగా తీసుకున్న నిర్ణయం... అమ్మ గుర్తుగా ఓ ట్రస్ట్ లేదా ఆర్గనైజేషన్ ను ప్రారంభించి పేద పిల్లల విద్యకు సాయం చేయాలని. ఎందుకంటే సోనూ సూద్ అమ్మగారు ఓ ప్రొఫెసర్.
పరేష్ రావల్
ఈ నటుడు గురించి తెలుగు వారికి పరిచయం అక్కర్లేదు. గతంలో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న పరేష్ ఆరోగ్య భాగ్యం కోసం యోగా చేయాలని నూతన సంవత్సరం సందర్భంగా తీర్మానించుకున్నారు. ఆచరణలో కూడా పెట్టారు.
రణవీర్ సింగ్
బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకడైన రణ వీర్ సింగ్ 2016 సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నీరు ఎక్కువగా తాగడం, మెడిటేషన్ కు మరింత సమయం కేటాయించడం, ప్రతీ రోజూ వ్యాయామాలతో ఆరోగ్యం విషయంలో ఫిట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారు.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్
చూడగానే ఆకట్టుకునే రూపంతో ఉండే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మానవీయత కాస్తంత ఎక్కువే. ఎందుకంటే ఆమె ఎన్నో ఏళ్ల క్రితం నుంచే సేవా కార్యక్రమాలకు తన వంతు చేయూతనందిస్తోంది. కాగా, ప్రజలు మెరుగ్గా జీవించేందుకు మరింతగా సేవ చేయాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆమె గతంలో నిర్ణయం తీసుకున్నారు.
వరుణ్ ధావన్
2016 లో రెండు కొత్త సంగీత పరికరాల పట్ల నైపుణ్యం సాధించాలని నిర్ణయించుకన్నారు. ఇవి శాక్సాఫోన్, పియానో.
తాప్పీ
సహనాన్ని పెంచుకోవాలని, ఇతరుల సమక్షంలో నియంత్రణ పాటించడం అలవరుచుకోవాలన్నది ఈ అమ్మడు గత సంవత్సర తీర్మానం.
ఎందుకు నిర్ణయాలు?
కొత్త సంవత్సరానికి గుర్తుగా ఏదైనా ఓ నిర్ణయం తీసుకుని అమలు చేసే సంస్కృతి చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. వాస్తవానికి ఇది భారతదేశ సంస్కృతి కాదు. బాబీలోనియన్లు దీన్ని 4,000 ఏళ్ల క్రితమే ఆరంభించినట్టు చరిత్ర చెబుతోంది. నూతన సంవత్సరం వేడుకలను కూడా మొదట ప్రారంభించింది వీరే. కాకపోతే అప్పట్లో నూతన సంవత్సరం మార్చిలో వచ్చేది.
మనిషి జీవిత కాలం నిజానికి చాలా చిన్నది. మహా అంటే 70 లేదా 80 ఏళ్లు. సెంచరీ కొట్టే వారు బహు అరుదు. జీవితంలో ఒక్కో ఏడాది కరిగిపోతుండడం కాల చక్రంలో భాగం. ఉన్న కొద్ది కాలంలోనే ఎన్నో చేసేయాలన్నది మనిషి ప్రయత్నం. అందుకు సంవత్సరం ఒక గుర్తు. ఫలానా ఘటన ఫలానా సంవత్సరంలో జరిగిందని చెప్పుకోవడం గుర్తుండే ఉంటుంది. కేలండర్ ప్రాధాన్యత దృష్ట్యా ఈ సంస్కృతి ప్రపంచవ్యాప్తమైంది.
2018 ప్లానింగ్ కు ముందు ఈ ప్రశ్నలు...?
- 2018లో మీరు ఎంతో ఇష్టంగా నేర్చుకోవాలని అనుకుంటున్న నైపుణ్యం ఏంటి?
- ఇప్పటికే నేర్చుకున్న నైపుణ్యాల్లో దేన్ని మెరుగు పరుచుకోవాలనుకుంటున్నారు?
- తప్పకుండా చదవాల్సిన పుస్తకాల పేర్లు...?
- మీ ముందున్న లక్ష్యాలు? వీటిని చేరుకునేందుకు ఈ ఏడాది చేయాల్సిన కృషి?
- మీకున్న బలాలు...? వీటిని కొనసాగించేందుకు ఏం చేస్తారు?
- మీకున్న బలహీనతలు ఏవి? వీటి నుంచి బయటపడేది ఎలా?
- మీ జీవిత భాగస్వామి, పిల్లలతో ఉన్న అనుబంధం మరింత పటిష్టం చేసుకోవడం ఎలా?
- శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు మీ వంతుగా ఈ సంవత్సరంలో ఏం చేస్తారు?
- మీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని ప్రస్తుత స్థితి నుంచి ఎలా మెరుగుపరుచుకుంటారు?
- మిమ్మల్ని నిరాశకు గురి చేస్తున్నవి ఏవి? వీటిని దూరం చేసేందుకు ఉన్న మార్గాలు..?
- మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చేయాల్సిన పనుల్లో మొదటిది. స్వీయ అభిమానం అన్నది తిరుగులేనిది.
- పెయింటింగ్ లేదా డ్యాన్స్ లేదా వంట చేయడం లేదా పాటలు పాడడం ఏదో ఒక హాబీ ఉండాలి. నిత్యం ఎంత బిజీ షెడ్యూల్ అయినా హాబీ కోసం కొంచెం సమయం కేటాయించి తీరాల్సిందే. ఎందుకంటే మీకు ఆనందాన్చిచ్చేవి చేయడం ద్వారా మీలో శక్తి ఇనుమడిస్తుంది. దీనివల్ల ఒత్తిడినీ జయించొచ్చు.
- కొత్త ఏడాదిలో ఏం చేయాలనుకుంటున్నారు...? ఊటీ లేదా మైసూర్ లేదా తాజ్ మహల్ సందర్శించాలనుకుంటున్నారా...? కొత్తగా బిజినెస్ కు ప్లాన్ చేసుకుంటున్నారా...? లేక ఉన్న రంగంలో నైపుణ్యాలను పెంచుకోవాలనుకుంటున్నారా...? లక్ష్యం ఏదైనా దానికో స్పష్టతనిచ్చి, షెడ్యూల్ ఖరారు చేసుకుని అనుకున్న ప్రకారం ఆచరణలో పెట్టేయండి. విజయం మీదే అవుతుంది. అంతేకానీ, ఈ లక్ష్యాలనే తర్వాతి సంవత్సరం కోసం తాజాగా ఉంచుకోకండి.