మీ మొబైల్ కు తగిన చార్జరే వాడుతున్నారా...? ఓ సారి చెక్ చేసుకోండిలా...
చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో ల్యాప్ ట్యాప్, పవర్ బ్యాంకు ఒక్కటేమిటి.. ఎన్నో పరికరాలు నిత్య జీవితంలో వచ్చి చేరుతున్నాయి. ప్రతీ దానికంటూ ఓ చార్జర్ ఉంటుంది. వేగంగా చార్జ్ చేసే ఫాస్ట్ చార్జర్లు కూడా వచ్చేశాయి. అయితే, గ్యాడ్జెట్ కు బ్యాటరీ అనేది శక్తినిచ్చే కేంద్రం. కనుక ఆ బ్యాటరీకి తగిన చార్జరే వాడాలి. ఏది పడితే అది వాడకపోవడం మంచిది. ఈ విషయంలో తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఏసీ అడాప్టర్
సాధారణంగా ఇది 110-240 వోల్టుల మెయిన్ కరెంట్ ను డీసీ వోల్టేజీలోకి మారుస్తుంది. తక్కువ విద్యుత్ అవసరమయ్యే చిన్న పరికరాలకు వీలుగా ఇలా మారుస్తుంది. ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంట్. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. బ్యాటరీ ఆధారిత పరికరాలను చార్జ్ చేసేందుకు డీసీయే అవసరం. కానీ, మన ఇళ్లల్లో ఉండేది ఏసీ విద్యుత్. సాధారణంగా మన ఇళ్లలో 230 వోల్టుల ఏసీ అవుట్ లెట్ ఉంటుంది. అందుకే బ్యాటరీ ఆధారిత గ్యాడ్జెట్ల చార్జింగ్ కు వీలుగా ఏసీ పవర్ ను డీసీ పవర్ గా మార్చేందుకు అడాప్టర్లను వినియోగిస్తుంటాం. మీ గ్యాడ్జెట్ తో పాటు వచ్చిన పవర్ అడాప్టర్ ను ఓ సారి పరిశీలిస్తే దానిపై వివరాలు ఉంటాయి. గ్యాడ్జెట్లోని బ్యాటరీ సామర్థ్యానికి సరిపోలే అడాప్టర్ ను కంపెనీ అందిస్తుంది. సాధ్యమైనంత వరకూ దీన్ని ఉపయోగించడమే మంచిది. ఒకవేళ మార్కెట్లో వేరేది కొనుగోలు చేస్తే పవర్ సామర్థ్యం మ్యాచ్ అవుతుందా? అనేది చూసుకోవాలి.
గ్యాడ్జెట్ బ్యాటరీపై చూడాల్సిన వివరాలు
వి = ఇన్ పుట్ వోల్టేజీ, దీన్నే వీఏసీ లేదా వీసీడీగానూ పేర్కొంటారు.
ఏసీ లేదా డీసీ ఈ రెండూ అడాప్టర్ పై కనిపిస్తాయి.
ఎంఏహెచ్/ఎ అన్నది విద్యుత్ వినియోగ సామర్థ్యం.
కొనుగోలు చేస్తున్న అడాప్టర్, డివైజ్ బ్యాటరీ ఇన్ పుట్ డీసీ సామర్థ్యానికి సరిపోయేలా ఉండాలి. అడాప్టర్ లోని అవుట్ పుట్ డీసీ ఓల్ట్స్(వి) డివైజ్ లోని ఇన్ పుట్ వోల్ట్స్ తో మ్యాచ్ అవ్వాలి. అడాప్టర్ అవుట్ పుట్ అన్నది డివైజ్ ఎంఏహెచ్ కు సమానంగా లేదా ఎక్కువైనా ఉండాలి. సాధారణంగా 3వి, 5వి, 6వి, 9వి, 12వి, 18వి రేటెడ్ ఓల్టేజీ అడాప్టర్లు ఉంటాయి.
యాంప్స్ అన్నది ఎ లేదా ఎంఏహెచ్ రూపంలో ప్రింట్ చేసి ఉంటుంది. మీరు వాడే లేదా ఎంచుకునే అడాప్టర్ అన్నది కనీసం డివైజ్ కరెంట్ రేటింగ్ కు తగినట్టు సరఫరా చేసేలా ఉండాలి. అడాప్టర్ అధిక పవర్ రేటింగ్ తో ఉంటే ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే అడాప్టర్ సామర్థ్యం ఎక్కువైనప్పటికీ డివైజ్ బ్యాటరీ తీసుకునేంతే తీసుకుంటుంది. ఉదాహరణకు మీ ల్యాప్ టాప్ ఇన్ పుట్ 19వి/5ఎ డీసీ ఉందనుకోండి. మీరు 19వి/8ఎ డీసీ అడాప్టర్ వాడారనుకోండి. అప్పుడు ల్యాప్ టాప్ కు 19వోల్టుల కరెంట్ వెళుతుంది. కాకపోతే 8యాంప్స్ కు బదులు 5యాంప్స్ మాత్రమే డెలివరీ అవుతుంది.
అయితే, అధిక సామర్థ్యం కలిగిన చార్జర్లను వాడితే బ్యాటరీపై అధిక భారం పడుతుందని కొందరు నిపుణులు అంటుంటారు. అందుకే వేగంగా చార్జ్ చేసేందుకు సంబంధిత డివైజ్ అనుకూలమా, కాదా అన్నది ముందుగానే తెలుసుకోవాలి. కానీ, డివైజ్ రేటింగ్ కంటే తక్కువ సామర్థ్యం గల బ్యాటరీతో ఆ డివైజ్ ను చార్జ్ చేయకపోవడమే మంచిది. దీనివల్ల అడాప్టర్ వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. డివైజ్ కు మాత్రం నష్టం వాటిల్లదు. ఓల్టేజీ అన్నది విద్యుత్ ను సరఫరా చేసే సామర్థ్యం. యాంప్స్ అన్నది విద్యుత్ వినియోగ పరిమాణాన్ని తెలియజేసేది.
ఏదో ఒక చార్జర్ ను వాడేస్తే దానివల్ల డివైజ్ బ్యాటరీ దెబ్బతినొచ్చు. చార్జింగ్ కు అధిక సమయం తీసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ల కంటే ట్యాబ్లెట్లలో ఉండే బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ. కనుక వేగంగా చార్జ్ అయ్యేందుకు వీలుగా వాటి చార్జర్ల కెపాసిటీ ఎక్కువే ఉంటుంది. ఈ చార్జర్ ను స్మార్ట్ ఫోన్లకు కనెక్ట్ చేస్తే వేగంగా చార్జ్ అవుతుంది. తరచూ ప్రయాణించే వారు యూనివర్సల్ పవర్ ప్లగ్ సాకెట్ ను ఒకటి కొని దగ్గర ఉంచుకోవడం మంచిది. దాంతో ఎక్కడ పవర్ సాకెట్ కనిపించినా మీ దగ్గరున్న దానితో అడాప్టర్ ను చక్కగా కనెక్ట్ చేసుకోవచ్చు.
ఫాస్ట్ చార్జర్లను వాడడం కరెక్టేనా...?
ఫాస్ట్ చార్జర్లపై ప్రభావం బ్యాటరీపై ఏ విధంగా ఉంటుందన్నది ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది. మొబైల్స్ ప్రాసెసర్లలో అగ్రగామి అయిన క్వాల్ కామ్ క్విక్ చార్జింగ్ అనువైన చిప్ లను మొబైల్ మార్కెట్ కు అందిస్తోంది. కాకపోతే మొబైల్ లో క్విక్ చార్జింగ్ ఆప్షన్ ఉంటే ఫాస్ట్ చార్జర్లను సంకోచం లేకుండా వాడుకోవచ్చు. అది లేని సాధారణ మొబైల్స్ కు ఫాస్ట్, టర్బో చార్జర్లు వాడడం దీర్ఘకాలంలో బ్యాటరీని దెబ్బతీసే అవకాశాలున్నాయన్నది కొందరు నిపుణుల వాదన.
అందుకే క్విక్ చార్జింగ్ సపోర్ట్ చేయని మొబైల్స్, ఇతర పరికరాలను అత్యవసర సందర్భాల్లో క్విక్ చార్జర్ ఉపయోగించి, సాధారణ సమయాల్లో డివైజ్ తో వచ్చిన చార్జర్ వాడడం మంచిదన్న సూచన ఉంది. సాధారణంగా ఫాస్ట్ చార్జర్ తో చార్జింగ్ చేస్తుంటే ఆ సమయంలో మొబైల్ బ్యాటరీ వేడెక్కడాన్ని గమనించొచ్చు. హీట్ చాలా అధికంగా ఉంటే దానికి బదులు సాధారణ చార్జరే వాడడం నయం. వేడి లేకపోతే నిరభ్యంతరంగా ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేసుకోవచ్చు. క్విక్, టర్బో, ర్యాపిడ్, ఫాస్ట్ చార్జింగ్ ఇవన్నీ ఒకటే.
క్లాస్ ఎ, క్లాస్ బి చార్జర్లు
ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే వోల్టేజీయే. ఈ రెండు రకాల అడాప్టర్లు 5, 9, 12 వోల్టుల రేటింగ్ తో ఉంటాయి. అయితే, క్లాస్ బి అడాప్టర్లు 20 ఓల్టుల వరకూ ఉండొచ్చు. క్లాస్ బి అడాప్టర్లు అధిక విద్యుత్ అవసరమయ్యే నోట్ బుక్ లు, ల్యాప్ టాప్ తదితర పరికరాలను చార్జ్ చేసేలా ఉంటాయి. క్విక్ చార్జింజ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే డివైజ్ కు అవసరమైనంత విద్యుత్ నే అందించేలా ఉంటుంది. కనుక క్లాస్ బి అడాప్టర్లను స్మార్ట్ ఫోన్ల చార్జింగ్ కు నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు.
శామ్ సంగ్ ఏం సూచిస్తోంది?
ఇతర పరికరాలకు సంబంధించిన చార్జర్లను ఉపయోగించొద్దని శామ్ సంగ్ తన కస్టమర్లకు గట్టిగా సూచిస్తోంది. డివైజ్ తో వచ్చిన ఒరిజనల్ చార్జర్ నే వాడాలన్నది కంపెనీ సలహా. దీనివల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతినకుండా ఉంటుందని చెబుతోంది. థర్డ్ పార్టీ చార్జర్లకు దూరంగా ఉండాలని సూచిస్తోంది.
కేబుల్స్ లోనూ ఉంటుంది...
చార్జింగ్ వేగాన్ని కేబుల్ నిర్దేశిస్తుంది. పాస్ట్ చార్జర్ ఉన్నా గానీ దానికి సపోర్ట్ చేసే కేబుల్ లేకపోతే వేగంగా చార్జ్ అవ్వదు. కేబుల్స్ అన్నీ చూడ్డానికి బయటకు ఒకే విధంగా ఉంటాయి. కానీ, లోపల ఉండే వైర్లలో మార్పు ఉంటుంది. సాధారణంగా యూఎస్ బీ చార్జింగ్ కేబుల్ లోపల నాలుగు వైర్లు ఉంటాయి. అవి ఒకటి యూఎస్ బీ వీసీసీ (+5వోల్ట్స్). ఇది ఎరుపురంగులో ఉంటుంది. నలుపు రంగులో ఉండేది జీఎన్ డీ. తెలుపు రంగులో ఉండేది యూఎస్ బీ డేటా +, ఆకుపచ్చ రంగు వైర్ యూఎస్ బీ-. ఇందులో రెండు వైర్లు తెలుపు, ఆకుపచ్చ డేటాకు సంబంధించినవి. ఎరుపు, జీఎన్ డీ మాత్రం 5వోల్టుల పవర్ ను తీసుకెళ్లేవి. ఇవి ఎంత పవర్ ను తీసుకెళతాయన్నది వాటి సైజు తెలియజేస్తుంది. స్టాండర్డ్ కేబుల్లో 28 గేజ్ తో 5ఏ పవర్ ను తీసుకెళుతుంది. అదే ఫాస్టర్ చార్జర్ లోపల ఉండేది 24 గేజ్. ఇది 2ఏ పవర్ ను తీసుకెళుతుంది.