దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రామాయణ’. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో ప్రకారం, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఎలాంటి వయోపరిమితి లేకుండా అందరూ ఈ చిత్రాన్ని థియేటర్లలో వీక్షించవచ్చు.

బుక్‌మైషోలో పొందుపరిచిన వివరాల ప్రకారం.. ‘రామాయణ’ సినిమా నిడివి 3 గంటల 15 నిమిషాలుగా ఉంది. అయితే, ఈ సమాచారం ఇంకా 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్' (సీబీఎఫ్‌సీ) అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు కాలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, బుక్‌మైషోలో ఉన్న వివరాలే దాదాపుగా ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

ఇతిహాస గాథ అయిన రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నందున, ఇంత భారీ రన్‌టైమ్ అవసరమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.