ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అద్భుతమైన పోరాట పటిమతో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. గ్గెబెర్హా వేదికగా మంగళవారం జరిగిన మూడో రోజు ఆటలో 179 పరుగులతో అజేయంగా నిలిచి, పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్‌గా ముందుండి నడిపించి, తన కెరీర్‌లోనే ఒక చిరస్మరణీయ శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ పేరిట ఉన్న 28 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టడం విశేషం.

వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికా జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ దెబ్బకు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన బవుమా, బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. రియాన్ రికెల్టన్, మార్కో జాన్సెన్, సైమన్ హార్మర్‌లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బవుమా వీరోచిత పోరాటంతో దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 425/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసి పటిష్ఠ‌ స్థితిలో నిలిచింది.

రికార్డుల మోత మోగించిన బవుమా.. 
ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో బవుమా పలు రికార్డులను తిరగరాశాడు. 36 ఏళ్ల 154 రోజుల వయసులో 179 పరుగులు చేసిన బవుమా, టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై 150కి పైగా పరుగులు చేసిన అత్యంత పెద్ద వయసు గల కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు 1998లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాపై 163 పరుగులు చేసిన భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (35 ఏళ్ల 38 రోజులు) పేరిట ఉండేది. ఈ జాబితాలో వాలీ హమండ్ (1938), మైక్ డెన్నెస్ (1975), ఆండ్రూ స్ట్రాస్ (2009) వంటి దిగ్గజాలను బవుమా అధిగమించాడు.

అంతేగాక దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ ఇన్నింగ్స్‌లో 150కి పైగా పరుగులు చేసిన అత్యంత పెద్ద వయసు గల రెండో కెప్టెన్‌గా బవుమా నిలిచాడు. సరిగ్గా 76 ఏళ్ల క్రితం 1950లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆర్థర్ లిండ్సే హాసెట్ (36 ఏళ్ల 187 రోజులు) ఇదే గ్గెబెర్హా మైదానంలో దక్షిణాఫ్రికాపై 167 పరుగులు చేశాడు. మళ్లీ ఇన్నేళ్లకు బవుమా ఈ ఘనతను అందుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున స్వదేశంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన కెప్టెన్ల జాబితాలోనూ బవుమా నాలుగో స్థానంలో నిలిచాడు. అతని కంటే ముందు హషీమ్ ఆమ్లా (208, 201), గ్రేమ్ స్మిత్ (183) ఉన్నారు.