దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేసిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌పై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రేప‌టి నుంచి ప్రారంభం కానున్న ఐదు టీ20ల సిరీస్‌లో భువనేశ్వర్ తమకు అతిపెద్ద సవాల్ విసరనున్నాడని, ముఖ్యంగా కొత్త బంతితో అతడు చాలా ప్రమాదకరమని శాంట్నర్ అభిప్రాయపడ్డాడు.

సిరీస్ ప్రారంభానికి ముందు క్రైస్ట్‌చర్చ్‌లో మీడియాతో మాట్లాడిన శాంట్నర్.. భువనేశ్వర్ బౌలింగ్‌ను ప్రశంసించాడు. "న్యూజిలాండ్‌లోని పరిస్థితులను భువి బాగా ఆస్వాదిస్తాడు. వికెట్‌లో కొంచెం పచ్చిక ఉన్నా, దాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటాడు. స్వింగ్‌కు ఏమాత్రం అనుకూలించని భారత ఫ్లాట్ పిచ్‌లపైనే బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నైపుణ్యం అతని సొంతం. అలాంటిది ఇక్కడి పరిస్థితుల్లో కొత్త బంతితో అతడు మాకు కచ్చితంగా పెను సవాల్ విసురుతాడు" అని శాంట్నర్ పేర్కొన్నాడు.

భారత్‌లో బౌలర్ల పరిస్థితి చాలా సవాలుగా మారిందని, ఇటీవల వెస్టిండీస్‌తో సిరీస్‌లో 250 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించిన విషయాన్ని శాంట్నర్ గుర్తుచేశాడు. "ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు మాత్రం బౌలర్ అవ్వాలని కోరుకుంటారు? కానీ ఇక్కడి పరిస్థితులు భువీకి బాగా నచ్చుతాయి" అని అన్నాడు.

36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్, 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాత మళ్లీ ఇప్పుడు జాతీయ జట్టులోకి వచ్చాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో నిలకడగా రాణించడమే అతనికి ఈ అవకాశం తెచ్చిపెట్టింది.

సిరీస్ గురించి శాంట్నర్ ఇంకా మాట్లాడుతూ.. "ఫ్లాట్ పిచ్‌లపై భారత జట్టును ఆపడం చాలా కష్టం. అయితే ఇక్కడి హాగ్లీ ఓవల్ మైదానంలో బౌండరీలు పెద్దవిగా ఉండటం బౌలర్లకు కాస్త ఊరటనిచ్చే అంశం. సిరీస్‌లో భాగంగా మేము దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆడతాం. అన్ని పిచ్‌లు ఒకేలా ఉండవు. కాబట్టి పరిస్థితులకు త్వరగా అలవాటు పడిన జట్టే విజయం సాధిస్తుంది" అని వివరించాడు.