అట్లాంటిక్‌ మహాసముద్రానికి ‘అమెరికన్‌ ఓషన్‌’ అని పేరు పెట్టాలనే ఆలోచన చేసినట్లు ట్రంప్‌ వెల్లడించారు. ఈ విషయంపై గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తో మాట్లాడానని, అయితే అనేక దేశాలను తాకే మహాసముద్రాలకు పేరు మార్చడం కష్టమని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. దక్షిణ కరోలినాలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును ‘గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా’గా మార్చిన విషయాన్ని గుర్తుచేసుకున్న ట్రంప్‌.. అట్లాంటిక్‌ మహాసముద్రం పేరు మార్చే అంశాన్ని కూడా పరిశీలించినట్లు చెప్పారు. ఈ విషయంపై పిచాయ్‌ను అడిగితే, మహాసముద్రాలు అనేక దేశాలను తాకుతాయని, అందువల్ల పేరు మార్చడం అంత సులభం కాదని చెప్పినట్లు వివరించారు. దీంతో అట్లాంటిక్‌ మహాసముద్రం పేరును మార్చే ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నట్లు తెలిపారు.

అయితే పసిఫిక్‌ మహాసముద్రానికి ‘అమెరికన్‌ ఓషన్‌’ అని పేరు పెట్టే అంశాన్ని ప్రస్తావించారు. అట్లాంటిక్‌, పసిఫిక్‌ మహాసముద్రాలకు మాత్రమే అమెరికా పేరు పెట్టే విషయాన్ని పరిశీలిస్తానని అన్నారు.

ఇరాన్‌తో ఉద్రిక్తతల గురించి మాట్లాడుతూ హర్మూజ్‌ జలసంధిని ‘ట్రంప్‌ స్ట్రెయిట్‌’గా పిలుస్తున్నట్లు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో’ పేరును మార్చినప్పుడు దీని పేరును ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్‌ జలసంధి ప్రస్తుతం అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల్లో ప్రధాన అంశంగా ఉంది.

2025 జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ట్రంప్‌ గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును ‘గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా’గా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత అమెరికా వినియోగదారుల కోసం గూగుల్‌ మ్యాప్స్‌లోనూ కొత్త పేరు కనిపించడం ప్రారంభమైంది. ఇటీవల ఓ సరస్సుకు ‘లేక్‌ అమెరికా’ అని పేరు పెట్టినట్లు కూడా ట్రంప్‌ సభలో చెప్పారు.

చెన్నైలో జన్మించిన సుందర్‌ పిచాయ్‌ ట్రంప్‌ను పలుమార్లు కలిశారు. 2025 జనవరిలో ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన పిచాయ్‌.. అదే ఏడాది సెప్టెంబరులో వైట్‌హౌస్‌లో జరిగిన టెక్నాలజీ కంపెనీల అధిపతుల విందులోనూ పాల్గొన్నారు.