స్మార్ట్‌ఫోన్లకు వాడే తక్కువ నాణ్యత స్క్రీన్‌ ప్రొటెక్టర్ల విక్రయాలపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై భారత్‌లో విక్రయించే స్క్రీన్‌ ప్రొటెక్టర్లు నిర్దేశిత నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ వీటిని ‘బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌’ (బీఐఎస్‌) తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. 2027 ఏప్రిల్‌ 1 నుంచి ఐఎస్‌ 19348:2025 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న స్క్రీన్‌ ప్రొటెక్టర్లనే విక్రయించాల్సి ఉంటుంది.

ఆరు నెలలకు పైగా గడువు
సెప్టెంబర్‌ 21న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ‘స్క్రీన్‌ ప్రొటెక్టర్స్‌ ఫర్‌ స్మార్ట్‌ఫోన్స్‌’ను తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ పరిధిలోకి చేర్చింది. తయారీదారులు, దిగుమతిదారులు కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తులను సిద్ధం చేసుకునేందుకు 2027 ఏప్రిల్‌ 1 వరకు గడువు ఇచ్చింది. అంటే ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి రావు. ఆ తేదీ నుంచి బీఐఎస్‌ ప్రమాణాలను పాటించడం తప్పనిసరి అవుతుంది.

నాణ్యతపై ప్రత్యేక ప్రమాణాలు
కొత్త ఐఎస్‌ 19348:2025 ప్రమాణంలో గ్లాస్‌ నాణ్యత, పరిమాణం, గ్లాస్‌ బలం, ఉపరితల నాణ్యతకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. స్క్రీన్‌ ప్రొటెక్టర్‌ ఎంత మేరకు కాంతిని ప్రసారం చేయాలి, కనిపించే లోపాలు ఎలా ఉండాలనే అంశాలనూ ఇందులో పేర్కొన్నారు. అంటుకునే పదార్థం, యాంటీ-షాటర్‌ ఫిల్మ్‌, ఆయిల్‌ నిరోధక కోటింగ్‌, యాంటీ-గ్లేర్‌, బ్లూ-లైట్‌ ఫిల్టరింగ్‌, ప్రైవసీ ఫిల్మ్‌లకు సంబంధించిన అంశాలూ ప్రమాణాల్లో ఉన్నాయి.

ప్యాకేజింగ్‌పై వివరాలు తప్పనిసరి
స్క్రీన్‌ ప్రొటెక్టర్ల ప్యాకేజింగ్‌పై తయారీదారు పేరు, బ్యాచ్‌ నంబర్‌, మందం వంటి కీలక వివరాలను అందించాల్సి ఉంటుంది. కొత్త ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను పరీక్షించిన తర్వాతే విక్రయించాల్సి ఉంటుంది. తయారీదారులు, దిగుమతిదారులు ఈ నాణ్యత నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

కొనుగోలుదారులకు ఏం మారుతుంది?
కొత్త నిబంధనలతో మార్కెట్‌లో నాణ్యమైన స్క్రీన్‌ ప్రొటెక్టర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వివిధ ధరల్లో బ్రాండెడ్‌ నుంచి బ్రాండ్‌ లేని ఉత్పత్తుల వరకు స్క్రీన్‌ గార్డులు, టెంపర్డ్‌ గ్లాస్‌లు లభిస్తున్నాయి. ఇకపై తయారీదారులు, దిగుమతిదారులు నిర్దేశిత నాణ్యత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.

ధరలు పెరుగుతాయా?
స్క్రీన్‌ ప్రొటెక్టర్ల ధరలు పెరుగుతాయని కేంద్రం జారీ చేసిన గెజిట్‌లో ఎలాంటి ప్రకటన లేదు. నిర్దిష్ట ఉత్పత్తులను మార్కెట్‌ నుంచి తొలగిస్తామని కూడా చెప్పలేదు. అయితే అదనపు పరీక్షలు, ధ్రువీకరణ వంటి నిబంధనల కారణంగా కొంతమంది తయారీదారులు, దిగుమతిదారుల నిర్వహణ విధానాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నిబంధన బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ చట్టం-2016 కింద జారీ అయింది.