ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్‌ఏఐ సంస్థకు ఊహించని షాక్ తగిలింది. తమను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన అంతర్గత మానిటరింగ్ సిస్టమ్‌నే తమ ఏఐ ఏజెంట్లు బలహీనపరిచాయని, కొన్నిసార్లు పూర్తిగా ఆఫ్ చేశాయని కంపెనీ స్వయంగా అంగీకరించింది. ఒకవైపు సొంత ఏఐ సిస్టమ్స్ అదుపు తప్పుతుండగా, మరోవైపు కంపెనీ రహస్యాలను దొంగిలించేందుకు ప్రయత్నించిన ఓ ఉద్యోగి అరెస్ట్ కావడం సంస్థలో కలకలం రేపుతోంది.

ఓపెన్‌ఏఐ తన బ్లాగ్ పోస్ట్‌లో ఈ సంచలన విషయాలను వెల్లడించింది. రెండు అంతర్గత కోడింగ్ టాస్క్‌లు చేస్తున్నప్పుడు తమ ఏఐ ఏజెంట్లు ఇలా ప్రవర్తించాయని పేర్కొంది. అయితే, ఇది కేవలం అంతర్గత ఘటన అని, దీనివల్ల బయటి వ్యక్తులకు ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం చేసింది. 

ఏఐ మోడల్స్ ఇలా నిఘా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. తమను రూపొందించిన వారి ఆదేశాలను కాకుండా, ఏఐ నమూనాలు సొంతంగా ప్రవర్తించడాన్ని 'ఏఐ మిస్‌అలైన్‌మెంట్' అంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంతో టెక్ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

గతంలో కూడా కొన్ని ఏఐ మోడళ్లు శిక్షణా వాతావరణం నుంచి తప్పించుకుని బయటి వెబ్‌సైట్లపై దాడులు చేసిన సందర్భాలున్నాయి. భవిష్యత్తులో ఈ వ్యవస్థలు మరింత అధునాతనంగా మారి అదుపు తప్పితే, వాటిని బయోవెపన్స్ తయారీ లేదా సైబర్ దాడులకు ఉపయోగించే ప్రమాదం ఉందని డెవలపర్లు హెచ్చరిస్తున్నారు. 

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పినప్పటికీ, తమ ఏజెంట్లు ఎందుకిలా ప్రవర్తించాయో తమకు కూడా 'సంతృప్తికరమైన వివరణ ఇంకా లభించలేదని' ఓపెన్‌ఏఐ పేర్కొనడం గమనార్హం.

ఉద్యోగి గూఢచర్యం.. అరెస్ట్
ఓపెన్‌ఏఐ ఓవైపు ఇలాంటి సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటుండగానే, మరోవైపు అంతర్గత భద్రతా వైఫల్యం కూడా వెలుగులోకి వచ్చింది. కంపెనీలో పనిచేస్తున్న సౌదీ అరేబియా ఇంజనీర్ అబ్దుల్‌రహమాన్ అల్ఫోజాన్ ను ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓపెన్‌ఏఐ కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ రూంలో రహస్యంగా ఆడియో రికార్డింగ్ పరికరాన్ని అమర్చాడనే ఆరోపణలపై అతడిని అక్టోబర్ 9న అరెస్ట్ చేశారు. నేరం రుజువైతే అతనికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 2.37కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ శాఖ వెల్లడించింది.