ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పీహెచ్‌పీలో ప్రమాదకర లోపాలు, భారత సంస్థ ఈముద్ర సెక్యూరిటీ కీల్లో బలహీనతలు, ఏఐ టూల్స్‌ ద్వారా హ్యాకింగ్‌ దాడులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ఎస్‌బీఐకి చెందిన 3,897 మంది కస్టమర్ల రికార్డులు బహిర్గతమైనట్లు బ్యాంకు ధ్రువీకరించింది. గత 24 గంటల్లో వరుసగా బయటపడిన ఈ ఘటనలు డిజిటల్‌ వ్యవస్థల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

పీహెచ్‌పీలో ప్రమాదకర లోపాలు
ప్రపంచంలోని దాదాపు 70 శాతం వెబ్‌సైట్లు పీహెచ్‌పీని ఉపయోగిస్తున్నట్లు డబ్ల్యూ3టెక్‌ అంచనా. ఈ ప్రోగ్రామింగ్‌ భాషలో గుర్తించిన రెండు కీలక లోపాలను ‘PHP2Shell’గా పిలుస్తున్నారు. వీటి ద్వారా హ్యాకర్లు ప్రభావిత వెబ్‌ సర్వర్లపై నియంత్రణ సాధించే ప్రమాదం ఉంది. అమెరికా జాతీయ భద్రతా సంస్థ ఎన్‌ఎస్‌ఏ, ఎఫ్‌బీఐ వెంటనే భద్రతా అప్‌డేట్లు ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించాయి. అప్‌డేట్‌ సాధ్యం కాకపోతే సమస్య పరిష్కారమయ్యే వరకు వ్యవస్థలను ఆఫ్‌లైన్‌లో ఉంచాలని హెచ్చరించాయి. పీహెచ్‌పీ ఫౌండేషన్‌ అక్టోబర్‌ 21న అత్యవసర అప్‌డేట్‌ను విడుదల చేసింది.

ఈముద్ర సెక్యూరిటీ కీల్లో బలహీనతలు
భారత డిజిటల్‌ సర్టిఫికెట్‌ సంస్థ ఈముద్ర ఉపయోగించిన ఎనిమిది ప్రైవేట్‌ కీలు అత్యంత బలహీనంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఒక్క బైట్‌తో సూచించగల సంఖ్యలుగా ఉన్న ఈ కీలను సెకనులోపే ఛేదించగలిగారు. ఇలాంటి లోపాలు నకిలీ సర్టిఫికెట్ల జారీకి, అసలైన వెబ్‌సైట్ల పేరుతో మోసాలకు దారితీయవచ్చు.

యాపిల్‌, గూగుల్‌, మొజిల్లా ప్రభావిత సర్టిఫికెట్లను తమ బ్రౌజర్లలో బ్లాక్‌ చేశాయి. క్లౌడ్‌ఫ్లేర్‌ కూడా అత్యవసర భద్రతా చర్యలు చేపట్టింది. ఎనిమిది సర్టిఫికెట్లలో ఒక్కటే వాస్తవ వినియోగంలో ఉందని, వాటితో వ్యక్తిగత వెబ్‌సైట్లకు సర్టిఫికెట్లు జారీ చేయలేదని ఈముద్ర తెలిపింది. వినియోగదారులు బ్రౌజర్లు, ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు.

ఏఐ టూల్స్‌ ద్వారా హ్యాకింగ్‌ దాడులు
నోడ్‌.జేఎస్‌లో నాలుగు అధిక తీవ్రత భద్రతా లోపాలను పరిష్కరిస్తూ కొత్త అప్‌డేట్లు విడుదలయ్యాయి. మరోవైపు, ఏఐ సేవలకు అనుసంధానంగా పనిచేసే LiteLLMలో హానికరమైన కోడ్‌ను చొప్పించినట్లు భద్రతా సంస్థ విజ్‌ వెల్లడించింది. దీనివల్ల డెవలపర్ల రహస్య సమాచారం, క్లౌడ్‌ ఆధారాలు, బ్రౌజర్‌ డేటా చోరీ అయ్యే ప్రమాదం ఉంది.

క్లౌడ్‌ సంస్థ రైల్వేలోనూ వినియోగదారుల సున్నిత సమాచారం అనధికార వ్యక్తులకు చేరి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వినియోగదారులు తమ ఏపీఐ కీలను, ఇతర రహస్య ఆధారాలను మార్చుకోవాలని సంస్థ సూచించింది.

2,250కిపైగా సంస్థలు లక్ష్యం
చైనాతో సంబంధాలున్న హ్యాకింగ్‌ బృందం ఏఐ ఆధారిత టూల్‌ను ఉపయోగించి కనెక్ట్‌వైజ్‌ క్లౌడ్‌ బ్యాకప్‌ ద్వారా 2,250కిపైగా సంస్థల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. సంస్థలు అనుమానాస్పద లాగిన్‌లను పరిశీలించాలని, సంబంధిత కనెక్షన్లను నిలిపివేయాలని సూచించింది.

ఎస్‌బీఐపై జరిగిన సైబర్‌ దాడిలో 3,897 మంది కస్టమర్ల రికార్డులు బహిర్గతమైనట్లు బ్యాంకు ధ్రువీకరించింది. వరుస ఘటనల నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు, బలమైన సెక్యూరిటీ కీలు, నిరంతర పర్యవేక్షణ అత్యంత కీలకంగా మారాయి.