భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకున్న దేశీయ బ్రాండ్‌ ‘కార్బన్‌ మొబైల్స్‌’ మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. కొన్నేళ్లుగా మార్కెట్‌కు దూరంగా ఉన్న ఈ సంస్థ తాజాగా ‘కార్బన్‌ రెబెల్‌ 5G’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చే సంకేతాలు ఇచ్చింది. అమెజాన్‌ ఇండియాలో ఈ ఫోన్‌ కోసం ప్రత్యేక మైక్రోసైట్‌ కనిపించడంతో బ్రాండ్‌ పునరాగమనంపై ఆసక్తి పెరిగింది.

అయితే, ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. ధర, ఫీచర్లు, అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశాలపై స్పష్టత లేదు. త్వరలోనే కొత్త ఫోన్‌ తొలి లుక్‌ను చూపిస్తామని మాత్రం సంస్థ సంకేతాలిచ్చింది.

అమెజాన్‌ మైక్రోసైట్‌లోని ప్రచార వాక్యాలు ఈ ఫోన్‌ లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. ‘హోదా అనేది ఫీచర్‌ కాదు’, ‘ప్రత్యేకంగా కనిపించే స్టైల్‌’, ‘ధర చూసి షాక్‌ అవ్వాల్సిన అవసరం లేని ఫోన్‌’ వంటి క్యాప్చన్స్‌ను అందులో పొందుపరిచారు. ‘ఇతరులను అనుసరించొద్దు.. మీ దారిలో మీరు సాగండి’ అనే భావనతో ‘డోంట్‌ ఫాలో, జస్ట్‌ రెబెల్‌’ అనే నినాదాన్ని కూడా ఉపయోగించారు. వీటిని బట్టి ఆకర్షణీయమైన రూపంతో పాటు అందుబాటు ధరపై సంస్థ దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయితే, ధరకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

కార్బన్‌ మొబైల్స్‌ ఢిల్లీకి చెందిన జైనా గ్రూప్‌, బెంగళూరుకు చెందిన యూటీఎల్‌ గ్రూప్‌ సంయుక్త సంస్థగా ఏర్పడింది. స్మార్ట్‌ఫోన్లు, సాధారణ మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లను తయారు చేసింది. గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వన్‌ కార్యక్రమంలోనూ భాగమైంది. ఆ కార్యక్రమంలో భాగంగా భారత్‌లో విడుదలైన తొలి ఫోన్లలో కార్బన్‌ స్పార్కిల్‌ వీ ఒకటి.

ఈ సంస్థ నుంచి వచ్చిన చివరి ముఖ్యమైన ఫోన్లలో కార్బన్‌ ఫ్రేమ్స్‌ ఎస్‌9 ఒకటి. 2018 మేలో రూ.6,790 ధరతో విడుదలైన ఈ ఫోన్‌లో 5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌, 2,900 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు రెబెల్‌ 5Gతో తిరిగి మార్కెట్‌లో తన స్థానాన్ని సంపాదించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.